Ratan Tata : ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా నిన్న స్వర్గస్తులైన ఘటన యావత్తు భారతీయులను శోకసంద్రంలోకి నెట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే. వ్యాపార రంగం లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశానికి ఎనలేని సేవలను అందించిన ఆ మహానుభావుడిని తలచుకొని సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులూ, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే సినీ ఇండస్ట్రీ లో ఎంతో మంది టాప్ హీరోలు ఉన్నప్పటికీ, రతన్ టాటా కేవలం ఒక నటుడితో మాత్రం చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఆ నటుడి పేరు గూఫీ పైంటల్. ఈయన మన టాలీవుడ్ ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేకపోయుండొచ్చు. కానీ పాత మహాభారతం సీరియల్ ని చూసిన ప్రతీ ఒక్కరికీ గూఫీ సుపరిచుతుడే. మహాభారతం సీరియల్ లో ఆయన శకుని పాత్ర పోషించాడు.
అప్పట్లో సెన్సేషనల్ హిట్ గా నిల్చిన ఈ సీరియల్ లో గూఫీ శకునిగా అద్భుతంగా నటించి, శకుని బహుశా ఇలాగే ఉండేవాడేమో అని జనాల హృదయాల్లో ముద్ర వేసేశాడు. ఆ తర్వాత సినిమాల్లో ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ ని చేసి బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు ఈ సీనియర్ నటుడు. అయితే ఈ నటుడు గత ఏడాది తన చివరి శ్వాస వదిలాడు. అంతకు ముందు ఈయన రతన్ టాటా తో తనకు ఉన్న అనుబంధం గురించి అభిమానులతో పంచుకుంటూ ఒక వీడియో ని యూట్యూబ్ లో అప్లోడ్ చేసాడు. ఆ వీడియోని ఇప్పుడు నెటిజెన్స్ సోషల్ మీడియా లో మరోసారి షేర్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే రతన్ టాటా ఎంత గొప్పవాడు అనే విషయం తెలుస్తుంది. ఆయన మాట్లాడుతూ ‘రతన్ టాటా నాకంటే కొన్నేళ్లు పెద్దవాడు. అప్పట్లో ఆయన అమెరికాలో పై చదువులు చదివి ఇండియా కి తిరిగి వచ్చాడు. అతను మా అపార్ట్మెంట్స్ లోనే రూమ్ నెంబర్ 21 లో ఉండేవాడు. రతన్ లో తాను ఒక పెద్ద కుటుంబం నుండి వచ్చాను అనే గర్వం ఇసుమంత కూడా కనిపించేది కాదు. నాతో చాలా స్నేహంగా ఉండేవాడు. అలాంటి వ్యక్తి టాటా గ్రూప్స్ కి చైర్ పర్సన్ అయినప్పుడు నాకు చాలా సంతోషం గా అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ రతన్ అప్పట్లో తన కార్ లో నన్ను పిక్నిక్స్ కి తీసుకొని వెళ్ళేవాడు. సరదాగా గడిపేవాళ్ళం. అతని రూమ్ లోకి నాకు ఒక్కడికే అనుమతి ఉండేది. ఎన్నో విషయాలను చర్చించుకునేవాళ్ళం. రతన్ సినిమాలు కూడా బాగానే చూసేవాడు. ఎక్కువగా హిందీ, ఇంగ్లీష్ పాటలు వింటుండేవాడు. రతన్ టాటా చైర్ పర్సన్ గా మంచి పేరు సంపాదించిన తర్వాత నన్ను మర్చిపోయాడేమో అని అనుకున్నాను. కానీ ఒకరోజు బాంద్రా లో నేను రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో ఒక పెద్ద కార్ వచ్చి నా ముందు ఆగింది. ఆ తర్వాత రెండు పెద్ద కుక్కలు ఆ కారు నుండి దిగాయి, వాటి వెనుక రతన్ నడుచుకుంటూ నా వద్దకు వచ్చాడు. ఎలా ఉన్నావు అని అడిగాడు, కార్ ఎక్కు ఇంటి వద్ద డ్రాప్ చేస్తాను అని కూడా అన్నాడు. ఆ సంఘటనను నేను ఇప్పటి వరకు మర్చిపోలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు గూఫీ.