
మూడో రోజు ఆర్ధికమంత్రి ప్రత్యేకంగా వ్యవసాయం , దాని అనుబంధరంగాలపై దృష్టి సారించింది. అయితే ఇందులో ప్రకటించిన వాటిలో ఇంతకుముందు బడ్జెట్ లో ప్రకటించినవి, దానికి సంబంధించి నిధులు కేటాయించినవి కూడా వుండటం విశేషం. అదేమంటే వాటిని ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ లో ఫ్రంట్ లోడ్ చేసామని చెప్పారు. కాబట్టి ఈరోజు ప్రకటించిన వాటిలో బడ్జెట్ లో ఇంతకూ ముందే ఎంత కేటాయించారు, ఇప్పుడు అదనంగా ఎంత కేటాయించారో వివరాలు స్పష్టంగా లేవు. అటువంటప్పుడు ఇవి 20 లక్షల కోట్ల ప్యాకేజి లో ఎంత అనేది తేలాల్సి వుంది. ఇవ్వాళ ప్రకటించిన మొత్తం 11 పధకాల్లో 8 ఆర్ధిక సంబంధమైనవి , మిగతా మూడు పరిపాలనా సంస్కరణలు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
- వ్యవసాయ మౌలిక సదుపాయాలు : శీతల గిడ్డంగులు, నిల్వ కేంద్రాలు, మిగతా మౌలిక సదుపాయాల కోసం 1 లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. ఇందులో ఇప్పటికే బడ్జెట్ లో పొందుపరిచిన సొమ్ము కూడా వుంది. ఏది ఏమైనా ఈ డబ్బులు వేగంగా ఖర్చుచేయగలిగితే రైతులకు మేలు జరుగుతుంది.
- చిన్న ఆహార సంస్థలు : దీనికి 10 వేల కోట్లు కేటాయించారు. దీని ద్వారా 2 లక్షల సంస్థలకు మేలు జరుగుతుంది. దీని అమలుకు క్లస్టర్ పద్దతి అవలంబిస్తారు. ఉదాహరణకు ఆంధ్ర లో మిర్చి, తెలంగాణాలో పసుపు, కాశ్మీర్ లో కేసరి ఎక్కువగా లభ్యమవుతాయి. వీటిని ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక క్లస్టర్లు గా పరిగణించి వాటి మీద ఆధారపడే చిన్న ఆహార, ఆరోగ్య , తదితర రంగాలలో సంస్థలకు ప్రోత్సాహం కల్పిస్తారు. వీటిల్లో దళితులూ, ఆదివాసులు, స్త్రీలు, వెనకబడిన జిల్లాలకు ప్రాధాన్యం ఇస్తారు.
- మత్స్య సంపద యోజన : దీనికి 20 వేలు కేటాయించారు. నాకు తెలిసి ఇది ఇప్పటికే బడ్జెట్ లో కేటాయించిందే. ఇప్పుడు దీన్ని తక్షణం అమలు చేస్తారు. దీనికింద షుమారు 55 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. షుమారు 1 లక్ష కోట్ల ఎగుమతులకు అవకాశం వుంది. దీనికింద వ్యక్తిగత భీమా , ఫిష్ బోట్లకు కూడా భీమా సౌకర్యం కల్పిస్తారు.
- పశు సంపద కు నూరు శాతం టీకాలు : ఈ పధకం కింద అన్ని పశువులకు ( గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు లాంటి ) నూటికి నూరు శాతం టీకాలు ఇస్తారు. దేశంలో మొత్తం 53 కోట్ల పశుసంపద వుంది. దీనికి 13,343 కోట్ల రూపాయలు కేటాయించారు.
- పాడి పరిశ్రమ లో మౌలిక సదుపాయాలు : దీనికి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో ప్రైవేటు పరిశ్రమను కూడా ప్రోత్సహిస్తారు. వాళ్ళు పెట్టుబడులు, ప్రణాలికలతో ముందుకొస్తే ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది.
- ఔషద మొక్కల పెంపకం : దీన్ని ప్రోత్సహించటానికి 4 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. దీంట్లో భాగంగా గంగా నది గట్టుపై ఇరువైపులా ఔషద మొక్కల పెంపకాన్ని చేపడతారు. మొత్తం 10 లక్షల హెక్టార్ల లో సాగుచేస్తారు.
- తేనెటీగల పెంపకం : దీనిని ప్రోత్సహించటానికి 500 కోట్ల రూపాయాలు కేటాయించారు. షుమారు 2 లక్షల మంది లబ్ది పొందుతారని అంచనా.
- ఆపరేషన్ గ్రీన్ : ఇది పైలట్ ప్రాజెక్ట్ , వచ్చే ఫలితాన్ని బట్టి విస్తరిస్తారు. దీని కింద తొందరగా పాడైపోయే కూరగాయలు, పండ్లు నిల్వ ఉంచుకోవటానికి, రవాణా చేయటానికి అయ్యే ఖర్చు లో సగం సబ్సిడీ గా ఇస్తారు. దీని కింద 500 కోట్ల రూపాయలు కేటాయించారు.
ఇవన్నీ కలిపి 1 లక్ష 63 లక్షల కోట్ల రూపాయలు అవుతాయి. ఇందులో అదనపు కేటాయింపు పై స్పష్టత లేదు. షుమారు 45 నుంచి 50 వేల కోట్లు అదనపు అంచనా అని అంచనా. వీటితోపాటు మరో మూడు పరిపాలనా సంస్కరణలు ప్రకటించారు. వాస్తవానికి ఈ రోజు ప్రకటించిన వాటిల్లో ఇవే ముఖ్యమైనవిగా చెప్పొచ్చు. అవేమిటో చూద్దాం.
- అత్యవసర సరుకుల చట్టానికి సవరణలు : ఇది కాలం చెల్లిన చట్టానికి తిలోదకాలు ఇవ్వటానికి ఉద్దేశించినది. దీనికింద ధాన్యాలు, పప్పులు, ఉల్లిపాయలు, బంగాళదుంప , నూనె విత్తనాలు లాంటి అనేక సరుకుల పై నియంత్రణ తొలగించారు. సరుకు నిల్వల పై అవసరమైన చోట తప్పిస్తే నిబంధనలు ఎత్తివేశారు. ఇది పెద్ద మార్పుగా చెప్పొచ్చు.
- మార్కెట్ సంస్కరణలు : రైతు ఉత్పత్తుల్ని ఎవరికైనా అమ్మే విధంగా చట్టం లో మార్పులు చేస్తారు. అలాగే అంతర రాష్టాలకు కూడా. ఇది కూడా పెద్ద మార్పే.
- గ్యారంటీ ధర, నాణ్యత కోసం: రిస్కు లేని ముందస్తు ధర , నాణ్యత పై రైతు కి భరోసా ఇచ్చే విధంగా చట్టం లో మార్పులు చేస్తారు.
ఇదీ ఈరోజు ప్రకటన స్థూలంగా సారాంశం. రేపటి ప్రకటన కోసం ఎదురు చూద్దాం