Wayanad ; కేరళలోని వాయనాడ్‌లో ప్రకృతి విపత్తు కారణంగా వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ చాలా మంది ఆచూకీ దొరకడం లేదు. తమ వారి కోసం కుటుంబ సభ్యులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. 200 మంది ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. దీంతో తమ వారు ఎక్కడున్నారో.. ఎలా ఉన్నారో అని ఆవేదన చెందుతున్నారు. ఇక చనిపోయిన వారి బంధువులు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఇంకోవైపు స్థానిక అధికారులు, ఆర్మీ సంయుక్తంగా సహాయ చర్యలు చేపడుతున్నారు. ఇలా ఎవరి పనిలో వారు ఉండగా, ఇదే సమయంలో బాధితులు కొత్త సమస్య ఎదుర్కొంటున్నారు. వాయనాడ్ ప్రాంతంలో ప్రస్తుతం దొంగలు చెచ్చిపోతున్నారు. బాధితులు వదిలేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. కొండచరియలు విరిగిపడిన తర్వాత కొంత మంది ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. వారి ఇళ్లలోని సామగ్రి అలాగే ఉంది. ఇది గమనించిన దొంగలు వాటిని టార్గెట్ చేశారు. రాత్రి సమయంలో అక్కడకు చేరుకుని వారి నివాసాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా కొందరు బాధితులు వారి ఇళ్లకు వెళ్లి చూడగా సామగ్రి లేకపోవడం గుర్తించారు. దీంతో రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడే వారిని గుర్తించి శిక్షించాలని బాధితులు కోరుతున్నారు.
ప్రాణాలు కాపాడుకుందామని పోతే..
కొండచరియలు విరిగిపడిన సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు చాలా కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాయి. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఇళ్లను వదిలి వెల్లిపోయారు. వారం తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వచ్చి చూడగా ఇళ్లలోని సామగ్రి కనిపించకపోవడంతో షాక్ అవుతున్నారు. ఇ«ళ్ల తలుపులు పగులగొట్టి ఉన్నాయని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తాము ఉంటున్న రిసార్టులో గదిని కూడా దొంగలు టార్గెట్ చేశారని పేర్కొంటున్నారు. దుస్తులు, డబ్బులు ఎత్తుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గస్తీ చేపడుతున్న పోలీసలు..
బాధితుల ఫిర్యాదు మేరకు వాయనాడ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చూరల్మల, మండక్కై సహా విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు గస్తీ పెంచారు. రాత్రి వేళల్లో విపత్తు ప్రాంతాల్లో బాధితులు లేని ఇళ్లలోకి ప్రవేశించేవారిపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి తెలిపారు. రాత్రి వేళల్లో పోలీసుల అనుమతి లేకుండా రెస్క్యూ ఆపరేషన్ పేరుతోగానీ, మరేదైనా ప్రభావిత ప్రాంతాల్లోకి లేదా ఇళ్లలోకి ఎవరినీ అనుమతించమని పేర్కొన్నారు.
అనుమానితులపై నిఘా..
దొంగతనాల నేపథ్యంలో పోలీసులు చూరల్మల, మండక్కై సహా విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో అనుమానితులపై నిఘా పెట్టారు. ఇప్పటికే కొంత మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దొంగల భయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లినవారు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇంకా అక్కడే ఉంటే తమ ఇళ్లు గుల్ల అవుతాయని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది తిరిగి వస్తున్నారు. ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు.