ఆంధ్రప్రదేశ్లో ఏ ఎన్నికలు నిర్వహించినా జగన్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తోంది. ఆ విషయం సర్పంచ్ ఎన్నికల నుంచి మొన్నటి తిరుపతి ఉప ఎన్నిక వరకూ అర్థమైంది. దీంతో 2024 వరకు వైసీపీకి ఢోకా లేదు.. అన్నట్లుగా ఉన్నారు ఆ పార్టీలోని నాయకులంతా. అయితే కొందరు ఎంపీల్లో మాత్రం ఆ సీన్ లేదని అంటున్నారు. ఎందుకంటే ఎంపీగా గెలిచినా ఎమ్మెల్యే సహకారం లేనిది వారు ఏ పని చేయడం లేదట. అయితే కొన్ని చోట్ల మాత్రం ఎమ్మెల్యేలు ఎంపీలను దూరంగా పెట్టడంతో వీరి మధ్య విభేదాలు పుట్టుకొస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం జగన్ దగ్గరికి కొందరు తీసుకెళ్లడంతో సీఎం వారి విషయంలో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు చర్చించుకుంటున్నారు.
2019 ఎన్నికల్లో గుంటూరు, రాజమండ్రి, శ్రీకాకుళం జిల్లాల్లో టీడీపీ నాయకులు గెలిచారు. మిగతా 22 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచారు. అయితే తాము ఎంపీగా ఉన్న సంబరమే కానీ.. నేరుగా ప్రజలకు సేవ చేసే మార్గం దొరకడం లేదని కొందరు ఆవేదన చెందుతున్నారు. ఇక గెలిచిన వారందరూ దాదాపు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారే. దీంతో వారు ఎమ్మెల్యేలతో సయోధ్యను కుదుర్చుకోవడంలో విఫలమవుతున్నారట. దీంతో వీరి మధ్య తరుచూ విభేదాలు వస్తున్నాయని అంటున్నారు.
ఇక వచ్చే ఎన్నికల్లో ఇలా విభేదాలు ఉన్న ఎంపీలకు టికెట్ ఇచ్చేది లేదని జగన్ నిర్ణయించబోతున్నట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు. రాజంనేట, అనంతపురం, నరసరావుపేట, హిందుపురం, బాపట్ల, విశాఖ, అమలాపురం, ఒంగోలు స్థానాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య తీవ్ర విభేదాలున్నాయట. అయితే వచ్చే ఎన్నికల్లో ఇక్కడి ఎమ్మెల్యేలకు టికెట్ ఇస్తే ఎంపీలు సహకరించరని అంటున్నారు. దీంతో మొత్తంగా పార్టీకి దెబ్బ పడే అవకాశం ఉందని, అందువల్ల వారికి టికెట్ ఇచ్చే విషయంలో జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.