ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య జరుగుతున్న జల వివాదం సంగతి అందరికీ తెలిసిందే. మీ కట్టడాలు అక్రమమైనవి అంటే…. మీ కట్టడాలు అన్యాయమైనవి అంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు, అధికారులు కాలం గడుపుతున్నారు. ఇక ఈ విషయమై కృష్ణా రివర్ బోర్డు, ట్రిబ్యునల్ వారు, అపెక్స్ కౌన్సిల్ రాజీ చేసేందుకు చూస్తున్న తర్వాత కూడా ఆ విషయం ఇంకా సద్దుమణగకపోవడం గమనార్హం. ఈ నెల ఆఖరి కల్లా అపెక్స్ కౌన్సిల్ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు ఈ విషయమై ఒక ఏకాభిప్రాయంతో వస్తారని ఆశ కూడా ఎవరికీ లేదు. ఎందుకంటే అటు కెసిఆర్ ఇటు జగన్ మొండితనం లో ఎవరికి వారే సాటి
ఇలాంటి సమయంలో ఎన్జీటీ వారు రాయలసీమ ఎత్తిపోతల పథకం పై తెలంగాణ తరపు వాదనలు వినేందుకు సిద్ధమయ్యారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మళ్లీ ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం కేసుని రీ- ఓపెన్ చేసేందుకు తెలంగాణ వారు పెట్టుకున్న అప్లికేషన్ ను ఒప్పుకున్నారు. గవినొల్ల శ్రీనివాస్ ఫైల్ చేసిన పిటిషన్ ను మన్నించిన ఎన్జీటీ ఇప్పుడు దీనిపై ఒక తీర్పును ఇవ్వనుంది. ఇప్పటికే ఈ విషయమై కృష్ణా ట్రిబ్యునల్ బోర్డు ఎన్నో సార్లు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్నో ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు వాటిని బేఖాతరు చేయడం జరిగింది.
ఇక జగన్ అయితే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పై మరొక అడుగు ముందుకు వేసి టెండర్లకు కూడా ఆహ్వానించాడు. దానితో మన తెలంగాణ ప్రభుత్వం ఇపుడు అపెక్స్ కౌన్సిల్ వరకు వెళ్ళింది. ఇక తెలంగాణ ప్రభుత్వం వాదన ఏమిటంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది జరిగితే దక్షిణ తెలంగాణకు చెందిన మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు ఎడారులు అయిపోతాయట.
ఇక అపెక్స్ కౌన్సిల్ ఈ నెల 25న జరగాల్సి ఉండగా…. జస్టిస్ రామకృష్ణ నేతృత్వంలోని ఈ ఎన్జీటీ బెంచ్ ఈ నెల 28న తెలంగాణ వారి తరఫున వాదన వినేందుకు సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పట్లో ఈ సమస్యను ఒక కొలిక్కి తెచ్చేందుకు ఎవరికీ ఇష్టం లేనట్టు ఉంది. వరుస పెట్టి కౌన్సిల్ లు, కమిటీలు తీర్పు చెప్పడం…. రాష్ట్ర ప్రభుత్వాలు తన ఇష్ట ప్రకారం నడుచుకోవడం తప్పించి… ఇక్కడ ఏదీ లేదు. ఏమైనా అంటే ఒకరి పై ఒకరు నిందించుకోవడం. ఇక్కడ వ్యర్థమవుతున్న ప్రజా సొమ్ము, విలువైన సమయం ఎవరికీ కనిపించడం లేదు.