తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ కి ఒక లేఖ రాసింది. ఇప్పటికే మూడు రాజధానులు అమలు పై ఉత్సాహంగా ఉన్నా జగన్ సర్కారు వీలైనంత త్వరగా కొత్త రాజధానిని విశాఖ లో ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మోదీని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని వైసిపి భావిస్తున్నట్టు మొదటి నుండి తెలిసిందే. ఇదే విషయాన్ని మంత్రి వర్యులు కూడా చెప్పారు. ఇక దీనికి సంబంధించిన ఆహ్వానం కోసం ఏపీ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఒక లేఖ రాసినట్లు చెబుతున్నారు. జగన్ తరఫు నుండి ప్రధాని కార్యాలయ సంయుక్త కార్యదర్శి శేషాద్రికి ఈ లేఖ వెళ్లినట్లు సమాచారం.
అయితే మొదటిగా ప్రధానితో భేటీ కోసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆగస్టు 16న నిర్వహించాలని ఆలోచనతో ఉన్న విషయాన్ని పేర్కొన్నట్లు ప్రకటించారు. ఇక మూడో అంశం కింద పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని…. ఇందులో పాల్గొనేందుకు కూడా మోదీ కి ఆహ్వానం అందించాలన్న ఆలోచనలో వారు ఉన్నట్లు ఆ లేఖలో పొందుపరిచినట్లు చెబుతున్నారు.
ఇక 2022 నాటికి అందరికీ సొంతంగా ఇళ్ళు ఉండాలన్న ప్రధాని లక్ష్యాన్ని ఆచరణలో పెట్టేందుకు వీలుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇలా ప్రధానిని ఏపీ ఇళ్ల స్థలాల సెంటిమెంట్ తో కొట్టి అదే పనిలో పనిగా ఆగస్టు 16న విశాఖ లో రాజధాని శంకుస్థాపన భూమిపూజకు మోదీ ను పిలవాలన్నదే జగన్ సర్కారు లక్ష్యంగా కనిపిస్తుంది.
ఈ విషయాలను ప్రధానితో చర్చించేందుకు వీలుగా వీలైనంత త్వరగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరినట్లు చెబుతున్నారు. ఇక ఆగస్టు 16 ఈ కార్యక్రమాలను నిర్వహించడమే లక్ష్యం అని…. ఆ తర్వాత మంచి రోజులు కూడా లేవన్న విషయాన్ని లేఖలో వెల్లడించారట. మరి దీనికి మోడీ సమాధానం ఎలా ఉంటుందో వేచి చూడాలి.