Vande Bharat Express Trains: మనదేశంలో రైళ్ళంటే కిక్కిరిసిపోయిన ప్రయాణికులు… గంటలకు గంటలకు ఆలస్యంగా నడిచే సర్వీసులు.. అపరిశుభ్రంగా కంపార్ట్మెంట్లు… నీళ్లు రాని మరుగుదొడ్లు… కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అలాంటి దుస్థితి నుంచి భారతీయ రైళ్ళు కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. పట్టాలపై వందే భారత్ రూపంలో రైళ్ళు ఇప్పుడు సరికొత్తగా కూత పెడుతున్నాయి. జపాన్, చైనా సరసన భారతదేశాన్ని నిలబెడుతున్నాయి. జనవరి 19న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే వందే భారత్ రైలును ప్రారంభిస్తారు. గతంలో ఆయన సెప్టెంబర్ 30న వందే భారత్ రైలును గాంధీనగర్, ముంబై మార్గంలో ప్రారంభించారు.. ఇప్పుడు తాజాగా సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే సర్వీస్ ను ప్రారంభించబోతున్నారు.. అసలు ఈ రైలు ప్రత్యేకత ఏమిటి? కేంద్ర ప్రభుత్వం దీనిని ఎందుకు అంతగా ప్రమోట్ చేస్తోంది?

విమానం లాంటి అనుభూతి
వందే భారత్ రైలు సెమీ హై స్పీడ్ రకానికి చెందింది.. విమానం లాంటి ప్రయాణ అనుభూతి ఇస్తుంది.. గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.. ఇందులో ఉన్న కవచ్ టెక్నాలజీ రైలు పరస్పరం ఢీ కొట్టుకోకుండా నివారిస్తుంది.. సాంకేతిక తప్పిదం వల్ల రైలు ఒకే ట్రాక్ పై వస్తే వాటి మధ్య కిలోమీటర్ దూరం ఉండగానే ఈ వ్యవస్థ హెచ్చరికలు జారీ చేస్తుంది.. రైలు వేగాన్ని వెంటనే నియంత్రిస్తుంది. వందే భారత్ రైలులో 16 కోచ్ లు ఉంటాయి. కేవలం 140 సెకండ్ల సమయంలో 160 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది.. అంత వేగంలోనూ ఎటువంటి కుదుపులు లేకుండా ప్రయాణం సాగడం ఈ రైలు మరో ప్రత్యేకత.. ఎయిర్ కండిషన్ కోసం ప్రతి కోచ్ కు కోచ్ కంట్రోల్ మేనేజ్మెంట్ సిస్టం ఉంటుంది.. ప్రయాణికులకు ఎప్పటికప్పుడు స్టేషన్లు, ఇతర సమాచారం అందించేందుకు ఏర్పాట్లు ఉంటాయి.. ఆటోమెటిగ్గా తెరుచుకునే, మూసుకునే డోర్లు ఉంటాయి.. ఎగ్జిక్యూటివ్ కోచ్ లలో సీట్లు 360 డిగ్రీల్లో తిరుగుతాయి. పెద్ద గాజు అద్దాల నుంచి ప్రకృతి అందాలను చూస్తూ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.. విమానాల తరహాలో బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు, అంధుల కోసం బ్రెయిలీ లిపిలో సమాచారం, వరదల నుంచి రక్షణకు ప్రత్యేక ఏర్పాటు కూడా ఈ రైలులో ఉంటుంది. ఇక ఈ రైలు ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు కేవలం 6 గంటల 20 నిమిషాల్లోనే చేరుకుంటుంది.. సాధారణ రైలుకు 9 నుంచి 10 గంటల సమయం పడుతుంది.. అంతేకాదు వందే భారత రైలు ఎలాంటి అవాంతరం లేకుండా వెళ్లేందుకు శతాబ్ది రైళ్ళను కూడా రైల్వే శాఖ రీ షెడ్యూల్ చేస్తోంది.
2019లో..
వాస్తవానికి మనదేశంలో తొలి వందే భారత్ రైలు 2019లోనే అందుబాటులోకి వచ్చింది.. న్యూఢిల్లీ, వారణాసి మార్గంలో ఈ రైలును ప్రారంభించారు.. అనంతరం ఢిల్లీ_ శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా మార్గంలో రెండో రైలును ప్రవేశపెట్టారు.. ఇక భవిష్యత్తులో వందే భారత్ రైళ్ల కోసం మెట్రో తరహాలో ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంది.

టికెట్ రేట్లు ఎక్కువ
సాధారణ రైళ్లతో పోలిస్తే వందే భారత్ రైళ్లలో టికెట్ చార్జీలు కాస్త అధికంగా ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధర 2505 కాగా, సాధారణ చైర్ కార్ టికెట్ వన్ త్రీ ఎయిట్ ఫైవ్ గా ఉంది శతాబ్ది సహా ఇతర రైళ్ల టికెట్ ధరలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.. అయితే వందే భారత్ రైళ్లలో ఉన్న ఫీచర్లతో పోలిస్తే ఈ ధర కాస్త ఎక్కువ ఏం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. అతి తక్కువ ధరతో విమానంలో ప్రయాణించిన అనుభూతిని పొందే అవకాశం ఉంటుందని వారు వివరిస్తున్నారు.