Lok Sabha Elections Results 2024: మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్ సభ స్థానంలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి.. 11.72 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించి శంకర్ లాల్వాని రికార్డు సృష్టిస్తే.. మహారాష్ట్రలోని ఓ అభ్యర్థి 48 ఓట్ల తేడాతో గెలుపొంది.. తక్కువ మెజారిటీతో విజయం సాధించిన అభ్యర్థిగా చరిత్ర సృష్టించారు.
వాస్తవానికి ఈ ఎన్నికలలో ఓటర్లు విభిన్నమైన ఫలితాలను ఇచ్చారు. తక్కువ సీట్లు సాధించినప్పటికీ కేంద్రంలో వరుసగా ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి గత ఎన్నికలతో పోల్చితే ఎక్కువ స్థానాలు సాధించినప్పటికీ.. అధికారానికి దూరంగా నిలిచిపోయింది.
అయితే ఈ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. హోరాహోరీగా పోరు సాగింది. కొందరు అభ్యర్థులు గత రికార్డులను బద్దలు కొడితే.. మరి కొంతమంది అభ్యర్థులు తక్కువ ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇందులో మహారాష్ట్రలోని ఓ అభ్యర్థి 48 ఓట్ల తేడాతో విజయం సాధించడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది.
మహారాష్ట్రలోని ముంబై నార్త్ వెస్ట్ నియోజవర్గం నుంచి రవీంద్ర దత్తరాం వైకర్ పోటీ చేశారు. ఈయన ఏకనాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేన పార్టీ తరఫు నుంచి బరిలో ఉన్నారు. ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుంచి అన్మోల్ కీర్తికర్ పోటీలో ఉన్నారు. వీరిద్దరి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. చివరికి 48 ఓట్ల తేడాతో రవీంద్ర దత్తారామ్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో దత్తారామ్ 4,52,644 ఓట్లు సాధించారు. అన్మోల్ కు 4,52,596 ఓట్లు పోలయ్యాయి.. ఈ నియోజకవర్గంలో నోటా కు 15,161 ఓట్లు దక్కడం విశేషం.
ఇక కేరళ రాష్ట్రంలోని అత్తింగల్ పార్లమెంటు నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి అధూర్ ప్రకాష్ 684 ఓట్లతో విజయం సాధించారు. ప్రకాష్ కు 3,28,051 ఓట్లు పోలయ్యాయి. ఆయన సమీప ప్రత్యర్థి, సిపిఎం అభ్యర్థి జాయ్ కి 3,27,367 ఓట్లు లభించాయి. ఈ స్థానంలో నోటా కి 9,791 ఓట్లు నమోదయ్యాయి.
ఒడిశా రాష్ట్రంలోని జయపురంలో బిజెపి అభ్యర్థి రవీంద్ర నారాయణ్ బెహరా 5,34,239 ఓట్లు సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి, బిజూ జనతా దళ్ అభ్యర్థి శర్మిష్ఠ సేథి 5,32,652 ఓట్లు సాధించారు. షర్మిష్ఠ పై రబీంద్ర 1,587 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో నోటాకు 6,788 ఓట్లు లభించాయి.
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ గ్రామీణ పార్లమెంటు నియోజకవర్గం లో బిజెపి అభ్యర్థి 1,615 ఓట్లతో తేడాతో విజయం సాధించారు. ఇక్కడ బిజెపి తరఫున రాజేంద్ర సింగ్ పోటీ చేశారు. ఆయన 6,17,877 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ తరపు నుంచి అనిల్ చోప్రా బరిలో ఉన్నారు. ఈయన 6,16,262 ఓట్లు దక్కించుకున్నారు. ఈ ప్రాంతంలో 7,519 ఓట్లు నోటా కి దక్కాయి.
ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో కాంకేర్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి భోజ్ రాజ్ నాగ్ 5,97,624 ఓట్లు సాధించారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి పోటీ చేసిన బీరేష్ ఠాకూర్ 5,95,740 ఓట్లు దక్కించుకున్నారు. 1,884 ఓట్ల తేడాతో భోజ్ రాజ్ బీరేష్ పై విజయం సాధించారు. ఇక్కడ నోటాకు 18,669 ఓట్లు పోలయ్యాయి.