Governor Tamilisai Vs KCR: కెసిఆర్ ఎత్తులు చిత్తవుతున్నాయి.. ఆయన ప్లాన్లు బెడిసి కొడుతున్నాయి.. నిష్ణాతులైన, మేధావులైన అధికార బృందం ఉన్నప్పటికీ హైకోర్టు నుంచి మొట్టికాయలు ఎదురవుతున్నాయి.. రాజకీయ చాణక్యుడిగా, వ్యూహ చతురత ఉన్న నేతగా పేరుపొందిన కేసీఆర్ కు ఈ వరుస తలనొప్పులు ఏమిటి? అసలు గవర్నర్ బలం ఏమిటి? ఎవరి సూచనల ఆధారంగా ఆమె బలమైన అడుగులు వేస్తున్నారు?

2019 సెప్టెంబర్ లో తమిళ సై సౌందర్ రాజన్ తెలంగాణ గవర్నర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు.. మొదట్లో ఆమెకు, ముఖ్యమంత్రి కార్యాలయానికి సుహృద్భావ వాతావరణం ఉండేది.. కానీ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత అది చెడిపోయింది.. ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా యుద్ధం కొనసాగుతూనే ఉంది.. కానీ ప్రతిసారి గోడకు కొట్టిన బంతి లాగా గవర్నర్ తెలంగాణ ప్రభుత్వం పై పై చేయి సాధిస్తూనే ఉన్నారు.. కెసిఆర్ తనకు తెలిసిన అస్త్ర శస్త్రాలు ప్రయోగించినప్పటికీ చాలా తెలివిగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు.. అంతేకాదు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని బోనులో పెడుతున్నారు.
వాస్తవానికి గత బడ్జెట్లో గవర్నర్ కార్యాలయానికి ప్రభుత్వం అంతంత మాత్రమే కేటాయింపులు జరిపింది. అయినప్పటికీ గవర్నర్ వెనకడుగు వేయలేదు.. కానీ ఇక్కడ ప్రభుత్వ వర్గాలకు తెలియనిది ఏమిటంటే తెలంగాణ ప్రాంతానికి తాను వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే గవర్నర్ పట్టు సాధించారు.. ముఖ్యంగా తనకు వెన్నెముక లాగా ఉండే అధికారులను నియమించుకున్నారు.. వీరు కూడా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ బాధితులు కావడం గమనార్హం..
గవర్నర్ పేషీలో పనిచేసే అధికారులు ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులుగా పని చేశారు.. వీరిలో గవర్నర్ వ్యక్తిగత వ్యవహారాలు చూసే ఓ అధికారి గతంలో జిల్లా కలెక్టర్ గా పని చేశారు.. వ్యక్తిగతంగా వివాద రహితుడు, అవినీతి రహితుడు కావడంతో ఒక మంత్రికి ఆయనకు విభేదాలు వచ్చాయి.. ఈ పంచాయతీ సాక్షాత్తు ప్రగతి భవన్ వద్దకు వెళ్లడంతో… ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.. నీతి వైపు ఉన్న ఆ అధికారిని రాత్రికి రాత్రే బదిలీ చేశారు.

దీంతో మనసు నొచ్చుకున్న ఆ అధికారి గవర్నర్ పేషీలోకి వెళ్లారు.. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి, గవర్నర్ కార్యాలయానికి విభేదాలు వెలుగు చూసిన నేపథ్యంలో… ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలో, ఇలాంటి ఎత్తులు వేస్తే కేసీఆర్ చిత్తు అవుతారో సదరు అధికారి గవర్నర్ కు చెప్పడం ప్రారంభించారు..ఈ అధికారికి తోడు వరంగల్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ జర్నలిస్టు గవర్నర్ ఇతర వ్యవహారాలు పర్యవేక్షించే పోస్టులో ఉండటంతో.. ఆయన కూడా తనకు తెలిసిన సమాచారాన్ని గవర్నర్ కు అందజేయడం ప్రారంభించారు.. సదరు అధికారి, సీనియర్ జర్నలిస్ట్ ఇద్దరూ కూడా భారత రాష్ట్ర సమితి బాధితులే. వారు పొందిన పరాభవానికి ప్రతీకారంగా గవర్నర్ కు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఫలితంగా గవర్నర్ ప్రభుత్వంపై పై చేయి సాధిస్తున్నారు.. దీనినే ముల్లుతోనే ముల్లును తీయడం అంటారేమో…