ఏపీలో మరో ఎన్నికలకు వేళైంది. కొత్త ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన రోజే ఎస్ఈసీ నీలం సాహ్ని ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడం విశేషం.
తాజాగా అధికారికంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఈనెల 8న పోలింగ్ నిర్వహించి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అవసరమైన చోట 9న రీపోలింగ్ నిర్వహించనున్నారు. అంటే కేవలం ఈరోజు నుంచి ఏడు రోజులు మాత్రమే సమయం ఇచ్చారు. ఇంత ఆగమాగం జగన్నాథం ఎన్నికల నిర్వహణపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
గత ఏడాది మార్చిలో పరిషత్ ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి.
తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తూ ఎస్ఈసీ నీలం సాహ్ని నోటిఫికేషన్ జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ఆగిన చోటే తిరిగి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ ఉన్నప్పుడే ఏపీలో ఎన్నికలు దౌర్జన్యంగా నిర్వహించారని.. ఇక ఎస్ఈసీ నీలం సాహ్ని ఏకంగా జగన్ కు సన్నిహితురాలని.. ఆమె హయాంలో మొత్తం వైసీపీయే గెలుస్తుందని టీడీపీ ఆరోపించింది. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ ప్రకటించింది. దీన్ని బట్టి పరిషత్ ఎన్నికల్లో టీడీపీ పోటీచేయదని తేలింది.