TDP BJP Alliance: ఏపీలో పొత్తుల విషయంలో బిజెపి తుది నిర్ణయానికి రానుందా? ఆ మేరకు రాష్ట్ర నాయకత్వానికి సంకేతాలు పంపిందా? పార్లమెంటరీ బోర్డులో డిసైడ్ కానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. బిజెపి కోసం ఆ రెండు పార్టీలు ఎదురుచూస్తున్నాయి. కానీ బిజెపి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. సంక్రాంతి వరకు వేచి చూసి తమ పని తాము చేసుకోవాలని ఆ రెండు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే పొత్తులపై బీజేపీ నుంచి సానుకూలత వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. సీట్ల పరంగా మెరుగైన స్థితిలో ఉంటే పొత్తుకు ఆలోచిస్తామని ఓ ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం.
తెలంగాణలో బిజెపి జనసేన తో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. సీఎం అభ్యర్థిత్వం తో పాటు సీట్ల కేటాయింపులో బిజెపి సరికొత్త ఎత్తుగడతో ముందుకు సాగింది. అందుకే అక్కడ సీట్లు, ఓట్లు పెంచుకుంది. అదే ఫార్ములాను ఇక్కడ అనుసరించాలని చూస్తోంది. అయితే తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో ఆ పార్టీకి బలం అంతంత మాత్రమే. అందుకే పొత్తుల ద్వారా ముందుకెళ్లాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఏదైనా రాష్ట్రాల్లో పొత్తులు, రాజకీయ నిర్ణయాలు తీసుకునే ముందు పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించడం బిజెపిలో ఆనవాయితీగా వస్తోంది. అందుకే జనవరి మొదటి వారంలో పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ఏపీ విషయంలో ఎలా ముందుకెళ్లాలో చర్చించనుంది. అయితే అంతకంటే ముందే ముగ్గురు జాతీయ నాయకులు ఏపీలో ఎంటర్ అయినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో బిజెపి ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అని.. రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం మేరకు బిజెపి 8 లోక్ సభ స్థానాలు, 12 అసెంబ్లీ సీట్లు అడుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో టిడిపి తీవ్ర తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఐదు లోక్ సభ, ఐదు శాసనసభ స్థానాలను కేటాయించేందుకు టిడిపి సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. సీట్ల పైన ముందుకు వస్తే పొత్తు పైన పార్టీ అధినాయకత్వం వద్ద తుది నిర్ణయం తీసుకుంటామని బిజెపి నేతలు సంకేతాలు పంపుతున్నారు. పార్టీ కమిటీ ఇచ్చిన నివేదిక పైన జనవరి తొలి వారంలో జరిగే బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. టిడిపి నుంచి సీట్లు పైన స్పష్టత వస్తేనే పొత్తు విషయంలో ప్రధాని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే పొత్తుపై సానుకూల ప్రకటన వస్తుందని తెలుగుదేశం, జనసేన వర్గాలు భావిస్తున్నాయి. అయితే బిజెపి నుంచి సానుకూలత రావడంతో.. వైసీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.