https://oktelugu.com/

GHMC: ఇవీ జీహెచ్ఎంసీ ‘చెత్త’ పనులు.. కేటీఆర్ సార్ చూడండి ఈ దారుణం?

ఆదివారం స్వచ్ఛ సేవా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల అత్యుత్సాహం జిహెచ్ఎంసిని నవ్వులపాలు చేసింది.

Written By:
  • Rocky
  • , Updated On : October 2, 2023 / 12:31 PM IST
    Follow us on

    GHMC: మీరు అప్పుడే మీ ఇల్లు ఊడ్చారు. శుభ్రంగా ఉంది. వెంటనే చెత్త తీసుకొచ్చి పోస్తారా? మీకేమైనా పిచ్చా? అలా అడుగుతున్నారేంటి? అని అంటారా.. కానీ ఘనత వహించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, అధికారులు ఇలాంటి నిర్వాకమే చేశారు. కాకపోతే వారు ఇంట్లో కాకుండా నడిరోడ్డు మీద చెత్త పోశారు. అది కూడా శుభ్రంగా ఊడ్చిన దారి మీద..

    ఆదివారం స్వచ్ఛ సేవా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల అత్యుత్సాహం జిహెచ్ఎంసిని నవ్వులపాలు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, సినీ నటి అక్కినేని అమల, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్ తదితరులు రావాల్సి ఉంది. అయితే వారు వచ్చే కంటే ముందు.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వేరే చోట నుంచి వాహనాలలో చెత్తను తీసుకొచ్చి ఇక్కడ పారబోశారు. అనంతరం ముఖ్య అతిథులు, అధికారులు వచ్చిన తర్వాత ఆ చెత్తను చీపుర్లతో ఊడిచారు. ఈ వ్యవహారం మొత్తం మెడికల్ అధికారి భార్గవ నారాయణ ఆధ్వర్యంలో జరిగింది. పరిశుభ్రత ఉన్నచోట చెత్తను పారబోయడం, అధికారులు వచ్చిన తర్వాత వారితో ఊడిపించడం.. ఇవేం చెత్త పనులు అంటూ స్థానికులు ముక్కున వేలేసుకున్నారు.

    వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుద్ధ్య పరిరక్షణకు ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేస్తోంది. నగరం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో చెత్త కూడా అదే స్థాయిలో పోగవుతోంది. ఈ నేపథ్యంలో పారిశుధ్య సిబ్బందికి హైదరాబాద్ నగరాన్ని శుభ్రంగా ఉంచడం ఒక సవాల్ గా మారింది. నాలాల్లో పలు ప్లాస్టిక్ వ్యర్ధాలు, ఇతర హానికరమైన వస్తువులు వస్తుండటంతో మంత్రి కేటీఆర్ కూడా ఒకానొక సందర్భంలో నగర వాసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరవాసులు సివిక్ సెన్స్ కలిగి ఉండాలని సూచించారు. అయితే ఆయన శాఖ పరిధిలో పనిచేసే అధికారులు పై అధికారుల మెప్పు కోసం నడిరోడ్డు మీద చెత్తను పారబోయడం.. అది కూడా కేంద్ర ప్రభుత్వ పథకం ప్రచారం కోసం రహదారిని చెత్త మయం చేయడం విమర్శలకు తావిస్తోంది. కాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరు పట్ల నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “రోడ్లు సరిగా శుభ్రం చేయరు. దోమలు, ఈగలు వృద్ధి చెంది జ్వరాలు వ్యాపిస్తున్నాయి.. ఇలాంటి సమయంలో మీరు శుభ్రం చేసిన రోడ్లను కూడా చెత్త మయం చేయడం ఏంటి అని” నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రోడ్డు మీద చెత్తను పారబోస్తున్న దృశ్యాలను కొంతమంది నెటిజెన్లు ఫోటోలు తీసి మంత్రి కేటీఆర్ కు ట్విట్ చేశారు. మరి దీనిపై ఆయన ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.