https://oktelugu.com/

ప్రైవేటీకరణతో జరిగే దారుణాలివీ!

పాలకుల విధానాలను బలంగా సమర్థించే వారికి తెలిసిన చరిత్ర వాట్సప్ యూనివర్సిటీ లో చదువుకున్నది తప్పితే విశ్వసనీయత కలిగిన చరిత్ర కారులు రాసింది కాదు. చరిత్ర తన ఆనవాళ్లను, ప్రకృతిలో , రాళ్లపై, సమాధుల్లో,తిరుగులేని సాక్షాలను వదిలి పోతుంది. వాటి ఆధారంగా మనుషుల జీన్స్ విశ్లేషణ చేసిన ఆధునిక చరిత్ర కూడా చరిత్ర కారులు రాసిన విషయాలను నిర్ధారిస్తూ ఉన్నాయి. భారతీయ మూలవాసులు సింధూ నాగరికత కు చెందిన వారని తిరుగులేని సాక్షాలున్నాయి. ఇక పోతే క్రి […]

Written By:
  • NARESH
  • , Updated On : March 19, 2021 / 09:09 PM IST
    Follow us on

    పాలకుల విధానాలను బలంగా సమర్థించే వారికి తెలిసిన చరిత్ర వాట్సప్ యూనివర్సిటీ లో చదువుకున్నది తప్పితే విశ్వసనీయత కలిగిన చరిత్ర కారులు రాసింది కాదు. చరిత్ర తన ఆనవాళ్లను, ప్రకృతిలో , రాళ్లపై, సమాధుల్లో,తిరుగులేని సాక్షాలను వదిలి పోతుంది. వాటి ఆధారంగా మనుషుల జీన్స్ విశ్లేషణ చేసిన ఆధునిక చరిత్ర కూడా చరిత్ర కారులు రాసిన విషయాలను నిర్ధారిస్తూ ఉన్నాయి.

    భారతీయ మూలవాసులు సింధూ నాగరికత కు చెందిన వారని తిరుగులేని సాక్షాలున్నాయి. ఇక పోతే క్రి పూ. వేద కాలం నుండి ఆధిపత్య వర్గాలవారు రాసిన పెట్టిన సాహిత్యం లెక్క లేనంతగా ఉంది. సత్యా సత్యాలు ఎట్లా ఉన్న ఈ దేశంలో కులాలు ఉన్నాయి. అనేక మతాలు ఉన్నాయి. రాజులు పాలించారు. పన్నులు వేశారు. శూద్రులకు 18వ శతాబ్దం వరకు చదువు లేకుండే అనే దానికి కూడా రుజువులు ఉన్నాయి. ఇంగ్లీష్ వాళ్ళకంటే ముందు రాజులు, వారి తర్వాత 300 సంస్తానాధీశులు.. ఇంగ్లీష్ వాళ్ళు ఈ దేశంలో ఉన్న ప్రజల మూలుగులూ పీల్చి వేశారు.

    1947 నాటికి ఈ దేశం ఆర్థిక , సామాజిక వ్యవస్థ ఇప్పుడు ఉన్న స్థితి కంటే చాలా అధ్వాన్న స్థితిలో ఉండేది. విద్యాలయాలు లేవు, వైద్య శాలలు లేవు, పరిశ్రమలు లేవు. విస్తారంగా ఉన్న సరిహద్దుకు ను కాపాడే దానికి సరిపోయినంత సైనిక బలగాల లేదు. నీటి ప్రాజెక్ట్ లు లేవు. కాలే కడుపుతో ఉన్న ప్రజల వద్ద రెక్కలు తప్ప మరో వనరు లేనిస్థితి. ఆనాడు దేశంలో సంపన్నులుగా ఉన్న మాజీ రాజులు, సంస్తానాధిపతులు, టాటా, బిర్లాల వంటి పెట్టుబడి దారులు కూడా పెద్ద పరిశ్రమలు స్థాపించే అంతటి పెట్టుబడులు లేని వారే.

    పైగా రెండవ ప్రపంచ యుద్ధం వదిలిన రోగాలు, కరువు. భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం అప్పగించారు. దేశ ప్రజల బానిస సంకెళ్లు చేదించడానికి ప్రాణాలకు తెగించి పోరాడిన శక్తులు కూడా నెహ్రూ మాటలను నమ్మారు. అప్పటిదాకా రాచరిక వ్యవస్థలో అధికారం వెలగ బెట్టిన రాజులు, సామంత రాజులు, సంస్థానాధీశులు, పార్లమెంట్ లో అసెంబ్లీలో కూర్చొని వాళ్ళ దోపిడీలు యథావిధిగా కొనసాగించారన్న విమర్శలున్నాయి. అయినా అజేయులైన ప్రజలు తమ శ్రమశక్తితో సృష్టించుకున్న సంపదతో ఇవాళ పాలిస్తున్న పాలకులు, గత పాలకులు అంతా కలిసి అమ్మిన, అమ్ముతున్న 500 పై చిలుకు ప్రభుత్వ రంగ సంస్థలను, నిర్మించుకున్నారు. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన రక్షణ బలగాలను, అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని, ఐఐటీలు, ఐఐఎంలు, నల్సార్ లు, విశ్వవిద్యాలయాలు, ఇలా ఇప్పటి దాకా దళిత బహుజన వర్గాలు ఎంతో కొంత తెలివిన పడటానికి అవసరమైన వ్యవస్థలను రూపొందించుకున్నారు. ఇందులో ఇప్పుడు చెప్పుకుంటున్న ప్రపంచ స్థాయి కుబేర వర్గాల పాత్రగాని, పాలిస్తున్న పాలక వర్గాల కష్టార్జితం గానీ ఇసుమంత లేదు. ప్రజల సొమ్మును అప్పనంగా పెట్టుబడి దారులకు దోచిపెడుతూ, వాగాడంబరాలు చెప్పే ఈ రాజకీయ నాయకులు, సంపద సృష్టి కర్తలు అని కీర్టించబడుతున్న గుమ్మికింది పంది కొక్కులు, ఆనాడు రాజులు, ఆంగ్లేయులు చేసిన పనినే జాతీయవాదం, దేశభక్తి పేర్లతో నిర్వహిస్తున్నారు.

    1991లో ప్రారంభించబడిన ఈ ఆర్థిక దివాలా కోరు విధానాలను ప్రపంచ పెట్టుబడిదారులు ఆశించినంత వేగవంతంగా మన్మోహన్ సింగ్ చేయలేని కారణంగా అతడు తప్పించబడ్డాడు. ఇప్పుడు అవే నూతన ఆర్థిక విధానాలను ప్రస్తుత ప్రభుత్వాలు శరవేగంగా కొనసాగిస్తున్నాయి. అదే అభివృద్ధి అనే భ్రమలను కలిగిస్తోంది. కానీ ప్రజల జీవన ప్రమాణాలు దినదినం కృంగి పోతున్నాయి. కుడి ఎడమల డాల్ కత్తుల వారి ఆస్తులు ప్రపంచ కుబేరుల ఆస్తులతో పోటీలు పడి ఎందుకు పెరుగుతున్నాయి? యువకుల నిరుద్యోగిత ఇంతగా ఎందుకు పెరుగుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ ఉంటే ఉద్యోగ అవకాశాలు ఎలా పెరుగుతాయి? ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం వల్ల ఉద్యోగాల్లో రిజర్వేషన్ అవకాశాలు లేకుండా పోవడం లేదా? రాజ్యాంగం కల్పించిన అవకాశాలను దళిత బహుజనులకు దక్కకుండా చేస్తున్న ప్రభుత్వ విధానాలను ఎవరు ప్రశ్నించాలి? ఇలా సవాలక్ష జవాబులు లేని ప్రశ్నలు.

    -వీరగోని పెంటయ్య