No Head Masters In Govt Schools: ఏపీలో పాఠశాల విద్యావ్యవస్థపై ప్రభుత్వం కత్తికట్టింది. ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో కోతతో పాటు సమీప భవిష్యత్ లో టీచర్ పోస్టుల భర్తీ అన్నది లేకుండా రేషన్ లైజేషన్ పేరిట నిబంధనలు తెరపైకి తెచ్చింది. టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియపై రాష్ట్ర విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు (జీవో 117) జారీచేసింది. కిలోమీటరు లోపు పాఠశాలలను విలీనం చేసే ప్రక్రియ రెండురోజుల్లో పూర్తవుతుందని తెలిపింది. నూతన విద్యావిధానం ప్రకారం కొత్తగా వర్గీకరించనున్న పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించే విధానాన్ని వివరించింది. దీని ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాలలకు అసలు ప్రధానోపాధ్యాయులే ఉండరు. 137 విద్యార్థుల కంటే తక్కువ గా ఉన్నత పాఠశాలలకు సైతం ప్రధానోపాధ్యాయుడి పోస్టు ఉండదు. ఈ స్కూళ్లకు పీఈటీలు ఉండరు. ఉన్న ఉపాధ్యాయుల్లో సీనియర్‌గా ఉన్న వ్యక్తే… బోధనతోపాటు ప్రధానోపాధ్యాయుడి విధులు కూడా చూసుకోవాలి. ఇప్పటివరకు ఆయా పాఠశాలల్లో ఉన్న హెచ్‌ఎంలు, పీఈటీలను అక్కడి నుంచి పంపించేస్తారు. సబ్జెక్టు టీచర్లతో తరగతులు చెప్పిస్తామన్న ప్రభుత్వం దాన్ని కూడా పూర్తిగా నెరవేర్చకుండా తప్పించుకోబోతోంది.
విలీన ప్రక్రియతో..
పాఠశాలలను ఫౌండేషన్ నుంచి హైస్కూల్ ప్లస్ వరకు ఐదురకాలుగా వర్గీకరించిన ప్రభుత్వం… దాని ప్రకారం విలీన ప్రక్రియ మొదలుపెడుతుంది. విలీనం చేసిన పాఠశాలలకు ఉపాధ్యాయులను ఎలా కేటాయించాలన్న దానిపై తాజా జీవో లో నిబంధనలు పొందుపరిచింది. పాఠశాలల్లో ప్రతి 30మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలని పేర్కొంది. ఫౌండేషన్ పాఠశాలల్లోనూ 30 మంది విద్యార్థులకు ఒక సెకండరీ గ్రేడ్ టీచర్‌ను నియమిస్తారు. కానీ… 1, 2 తరగతుల్లో కలిపి 30 మంది విద్యార్థులే ఉంటే, ఇద్దరు టీచర్లను ఇవ్వరు. అంటే… ఇవి ఏకోపాధ్యాయ పాఠశాలలుగా పనిచేస్తాయి. రెండు తరగతులకు బోధనతోపాటు… బోధనేతర విధులైన యాప్‌లో వివరాలు నింపడం, మరుగుదొడ్ల పరిశుభ్రత, మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ వంటివన్నీ ఆ ఒక్క టీచరే చూసుకోవాలి. ఉన్న ఒక్క ఉపాధ్యాయుడు సెలవు పెడితే…. అంతే సంగతులు. ప్లేస్కూల్‌కు పాఠాలు చెప్పే అంగన్‌వాడీ టీచర్లే 1, 2 తరగతులకు కూడా పాఠాలు చెప్పాలి. ఫౌండేషన్ ప్లస్ పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. 30 మందికంటే ఎక్కువ విద్యార్థులు ఉంటేనే రెండో టీచర్‌ను కేటాయిస్తారు. 1 నుంచి 5 తరగతుల వరకు బోధన జరిగే ఈ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 121కంటే ఎక్కువుంటేనే ప్రధానోపాధ్యాయుడు ఉంటారు. లేకుంటే ఉండరు.
క్లాసులతో భారం..
3 నుంచి 8 వరకు ఉన్న పాఠశాలల్లో ఆరు సెక్షన్లు (ఒక్కో తరగతికి ఒక సెక్షన్ ఉంటుందనే భావనతో) ఉంటే… ఆరుగురు స్కూల్ అసిస్టెంట్లను కేటాయిస్తారు. ఏడు సెక్షన్లు ఉంటే ఏడుగురు స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తారు. వెరసి… ప్రతి టీచరు, ప్రతిరోజూ 6 నుంచి 8 తరగతులను కనీసం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే… ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క పీరియడ్ కూడా విరామం లేకుండా చెబుతూనే ఉండా లి. పరీక్ష పేపర్లు దిద్దడం, క్లాసులకు సన్నద్ధం కావడం ఎప్పుడనేది ప్రశ్నార్థకమే! మరో దారుణం ఏమిటంటే… మొత్తం విద్యార్థుల సంఖ్య 137కంటే తక్కువ ఉంటే, ప్రధానోపాధ్యాయుడు కూడా ఉండరు. ఉన్న టీచర్లలోనే ఒక సీనియర్ ఆ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది.
హైస్కూల్స్‌లో 17 సెక్షన్లు ఉన్నప్పటికీ… ముగ్గురు మ్యాథ్స్ టీచర్లనే ఇచ్చారు. అంటే ఒక్కొక్కరికి ఆరు క్లాసులు. నిబంధనల ప్రకారం మ్యాథ్స్ ప్రతి తరగతికి వారానికి 8క్లాసులు తీసుకోవాలి. అంటే ఒక్కో మ్యాథ్స్ టీచరు వారంలో ఆరు రోజులు… రోజుకు 8 క్లాసుల చొప్పున… 48క్లాసులు చెప్పాలి. అంటే… అవిశ్రాంతంగా పాఠాలు చెబుతూనే ఉండాలన్న మాట! బడిలో ఒక నిర్దిష్ట సంఖ్యను మించి విద్యార్థులుంటేనే అదనపు స్కూల్ అసిసెంట్లను (సబ్జెక్ట్ టీచర్లు) ఇస్తారు. లేదంటే… సెకండరీ గ్రేడ్ టీచర్లనే కేటాయిస్తారు. వెరసి… ‘విద్యార్థులకు సబ్జెక్టు టీచర్లతో బోధన’ అంటున్న ప్రభుత్వం స్వీయ నిబంధనలనే ఉల్లంఘిస్తోంది. తాజాగా జారీ చేసిన రేషనలైజేషన్ ఉత్తర్వులను చూస్తే తెలుగు మాధ్యమాన్ని ఎత్తేసినట్లే కనిపిస్తోంది.