Shortage Of Petrol In AP: ఏపీలో పెట్రోల్ కొరత ఏర్పడింది. దీంతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. ఇప్పటికే పలుచోట్ల పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి అవి తాత్కాలికంగా, పరిమితంగానే ఉన్నా రానున్న రోజుల్లో కొరత పెరిగే అవకాశం ఉందని బంకుల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఆయిల్ కంపెనీలు అడిగిన మేరకు ఇంధనాన్ని సరఫరా చేయకపోవడంతో ఈ అనుమానాలు తలెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎస్) ఆయిల్ సరఫరాను తగ్గించాయి. అదే విధానాన్ని ఏపీలోనూ అమలుచేస్తున్నాయి. హెచ్‌పీసీఎల్‌లో మరీ ఎక్కువగా ఈ సమస్య లేకపోయినా, బీపీసీఎల్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. గత నెలలో సరఫరాలో కోత విధానం అమలుచేయగా, ఈసారి దానికి బదులుగా ఆలస్యంగా సరఫరా చేస్తున్నాయి.ఇంధనం ఇవ్వబోమని చెప్పకుండా అడిగిన మూడు నాలుగు రోజుల తర్వాత సరఫరా చేస్తున్నాయి. నెలరోజుల ముందు వరకూ ఆయిల్ కంపెనీలు క్రెడిట్ విధానం పాటించేవి. అంటే నగదు చెల్లించకపోయినా ముందు ఇంధనం లోడ్లు పంపి, తర్వాత బంకుల నుంచి నగదు తీసుకునేవి. కొద్దిరోజుల కిందట డబ్బు కడితేనే ఇంధనం ఇస్తామనే నిబంధన పెట్టాయు. ఇప్పుడు రెండు రోజులు ముందుగానే పేమెంట్ చేసినా సరఫరా చేయడం లేదు. మూడు నాలుగు రోజుల తర్వాతే ఇంధనం పంపిస్తున్నారు. ఈలోగా బంకుల్లో ఇంధనం పూర్తిగా అయిపోతే నో స్టాకు బోర్డులు పెడుతున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో లీటరుపై డీజిల్‌కు రూ.23, పెట్రోల్‌కు రూ.12 వరకూ నష్టం వస్తోందని, ఈ నష్టాన్ని భరించలేమని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. అందువల్లే సరిపడా ఇవ్వలేకపోతున్నామని అంటున్నాయి.
ఆందోళనలో డీలర్లు
ఆయిల్ కొరత వల్ల బంకుల యాజమానులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే ఏపీలో అత్యధిక ధరల కారణంగా వ్యాపారం తగ్గిపోయి నష్టపోతుంటే ఇప్పుడు కొత్తగా ఈ కొరత సమస్య తమపై పడిందని అంటున్నారు. ఇటీవల కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిడంచడంతో డీలర్లు భారీగా నష్టపోయారు. ఆ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలి అని తంటాలు పడుతున్న సమయంలో కొరత వల్ల మరింత వ్యాపారం తగ్గిపోయి ఇంకా నష్టపోతున్నారు. అందులోనూ భారత్ పెట్రోల్ బంకులు నిర్వహించేవారు ఎక్కువగా నష్టపోతున్నారు. కొన్ని బంకుల్లో డీజిల్, పెట్రోల్ రెండిటిలో ఏదొకటి కొరత ఉంటోంది. నో స్టాకు బోర్డులు పెడితే వినియోగదారులు తగ్గిపోతారనే భయంతో కొందరు బోర్డులు పెట్టకుండా వినియోగదారులకు త్వరలో వస్తుందని చెప్పి వెనక్కి పంపుతున్నారు.
Also Read: Kavitha Kalvakuntla: ఎమ్మెల్సీగారు… ఏమిటిది? గ్యాంగ్‌రేప్‌పై స్పందించని కవిత!!
తెలంగాణలో అలా..
పెట్రోల్, డీజిల్ సరఫరా అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత దానిపై ఉంటుంది. ఇంధనం కొరత సమస్య తెలంగాణలో తలెత్తగా అక్కడి పౌరసరఫరాలశాఖ మంత్రి చమురుల కంపెనీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటుచేసి కొరత పెట్టొద్దని సూచించారు. ఆయిల్ కంపెనీలు కూడా సానుకూలంగా స్పందించాయి. కానీ ఏపీలో మాత్రం ఇంతవరకూ ప్రభుత్వం తరఫున దీనిపై ఎలాంటి స్పందన లేదు. ఈ విషయంలో జోక్యం చేసుకుని కొరత లేకుండా చర్యలు చేపట్టాలని పెట్రో డీలర్ల సంఘం పౌరసరఫరాల కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించినా ఎవరూ స్పందించలేదు. దీనిపై ఆయిల్ కంపెనీలతో సహా సంయుక్త సమావేశం ఏర్పాటుచేయాలని ఆ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత కొరత పెరిగే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు.