
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. అయితే సుదీర్ఘకాలం లాక్ డౌన్ కొనసాగడం మూలంగా ఐటీ పరిశ్రమలో ఉద్యోగాలను తీసేసే అవకాశాలు ఉన్నట్లు నాస్కామ్ మాజీ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ సంకేతాలిచ్చారు. వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి దీర్ఘకాలంలో సానుకూలంగా ఉండవచ్చని, ఐటీ కంపెనీల పెట్టుబడులను ఆదా చేసే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. వెంచర్ క్యాపిటలిస్టుల నిధులతో స్టార్టప్స్ మనుగడ సాగిస్తున్నాయని, ప్రస్తుత పరిణామాలు ఇంకా దిగజారితే ఈ సంస్థ లు మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.
ఉద్యోగులను తగ్గించుకోకుండా ఉండటానికి రెండు కారణాలున్నాయి. ఒకటి. వారు తమ ఉద్యోగులను కోల్పోవాలనుకోరు. ఆయా కంపెనీల వద్ద తగినంత సొమ్ము ఉంది. పెద్ద కంపెనీల్లో కొన్ని ఉద్యోగులను తొలగించాలనుకుంటే.. తాత్కాలిక ఉద్యోగులను తగ్గించుకోవచ్చు. కానీ రెగ్యులర్, శాశ్వత ఉద్యోగులను కోల్పోవాలనుకోరు. అయితే రెండు మూడు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే వాటిపై కూడా ఒత్తిడి రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు సబ్సిడీలు కొనసాగిస్తూ ఉండలేని పరిస్థితి ఏర్పడవచ్చు. ఎంతకాలం అది కొనసాగుతుందన్నదే ప్రశ్న’’ అని చంద్రశేఖర్ అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తం గా చాలా కంపెనీలు ఇంటి నుంచి పనికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇది స్వల్పకాలంలో పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపినా దీర్ఘకాలంలో ఇది పని సంస్కృతిని మార్చే అవకాశం ఉందని చెప్పారు. మరికొన్ని నెలలపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే ఐటీ రంగంలోని పెద్ద కంపెనీల్లోనూ ఉద్యోగ కోతలు తప్పదని అన్నారు.
ప్రపంచమంతా ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో ఐటీ పరిశ్రమకు డిమాండ్ తగ్గుతుంద ని భావిస్తున్నట్టు నాస్కామ్ మాజీ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రపంచంలోని ఏ ఆర్థిక వ్యవస్థ కూడా బాగుండే అవకాశం లేదన్నారు. అన్ని ఎంతో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. కాబట్టి డిమాండ్ తగ్గడానికి అవకాశం ఉందని చెప్పారు.