Homeఆంధ్రప్రదేశ్‌అధికార దాహ రాజకీయాలకు ఆంధ్రా ప్రజలు బలి

అధికార దాహ రాజకీయాలకు ఆంధ్రా ప్రజలు బలి

ప్రపంచం మరణ మృదంగం తో హృదయవిదారకంగా తయారయ్యింది. ఎక్కడచూసినా శవాల గుట్టల లెక్కలే తప్ప వేరే మాట లేదు. ఇది ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుందో ఎన్ని విషాదకర దృశ్యాలు, సంఘటనలు, వార్తలు వింటూ గడపాలో తెలియని విచిత్ర పరిస్థితి లో జనం బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. అయినా ఇవేమీ ఆంధ్రా రాజకీయనాయకులకు పట్టవు. అధికార దాహ రాజకీయాలకు ఇంతటి విపత్కర పరిస్థితి లో కూడా ఫులుస్టాప్ పడలేదు. అవి ఎప్పటిలాగే కొనసాగుతూనే వున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమంతో మొదలైన రావణాకాష్టం ఇంకా మండుతూనే వుంది. ఆంధ్రా జనం ఏం పాపం చేసారని ఈ శాపం.

జగన్ మొరటు రాజకీయాలు 

జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పెద్ద మెజారిటీ తో గెలుపొందాడు. మొదట్లో తను తీసుకున్న ప్రజారంజక చర్యలు అందరి అభిమానాన్ని చూరగొన్నాయి. ముఖ్యంగా గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల నియామకం, మద్యపాన నియంత్రణ చర్యలు, అమ్మ ఒడి , విద్యారంగం లో మౌలిక సదుపాయాలు, రైతు భరోసా, సంక్షేమ పధకాలు లాంటి అనేక సంస్కరణలు, నిర్ణయాలతో ప్రజల మన్ననలు పొందాడు. ప్రజలకు ఊరట గొలిపే ఇటువంటి పధకాల తో పరిపాలన జనరంజకంగా జరుగుతున్న తరుణం లో వివాదాస్పద నిర్ణయాలతో పరిపాలన పక్కదారి పట్టింది. గోటితో పోయే దాన్ని గొడ్డలితో నరుక్కోవటం చందంగా సానుకూల వాతావరణాన్ని చేతులారా చెడగొట్టుకున్నాడు. రాజధాని వికేంద్రీకరణ పేరుతో రాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి.

రాజధాని వికేంద్రీకరణ యోగ్యతా యోగ్యతల కన్నా అది నడిపిన తీరే మొరటుగా వుంది. ఆ మొరటు తనమే అవకాశం కోసం ఎదురుచూస్తున్న  ప్రతిపక్షాలకు వరమయ్యింది. ప్రతిపక్షాలమీద కోపం ప్రజలమీదకు  మళ్ళింది. రాజధానికి భూమినిచ్చిన రైతుల్ని పిలిచి మాట్లాడుకోవాల్సింది పోయి వాళ్ళ తో పంతానికి పోయి సమస్యను మరింత జటిలం చేసుకోవటం చూస్తే 21వ శతాబ్దపు ఆలోచనలకు భిన్నంగా పాత కాలపు కక్ష రాజకీయాల తోవనే యువకుడైన జగన్ మోహన రెడ్డి ఎంచుకోవటం చూస్తుంటే యవ్వనం వయసులోనే కానీ మనసులో కాదని అర్ధమవుతుంది. ఈ సమస్యను నిజానికి కొంచెం లౌక్యంతో వ్యవహరిస్తే ఇక్కడిదాకా వచ్చేదికాదనిపిస్తుంది. చంద్రబాబు అయిదు సంవత్సరాల్లో రాజధానికి ఖర్చు పెట్టింది కేవలం ఐదువేల కోట్లు మాత్రమే. మిగతాదంతా ప్రణాళికలలో మాత్రమే వుంది. మరి ఆర్దికపరిస్థితి బాగులేనప్పుడు నిన్ను మాత్రం లక్ష కోట్లు ఖర్చుపెట్టమని ఎవరూ చెప్పలేరు కదా. రాజధాని కి, నగర నిర్మాణానికి పొంతన పెట్టటం చంద్రబాబు ఎంత తప్పుచేసాడో జగనూ అంతే తప్పు చేసాడు. కొత్త నగరాన్ని నిర్మించటం ఆచరణ సాధ్యం కాదనుకున్నప్పుడు విశాఖ పట్టణాన్ని విస్తరించాలంటే ఇప్పుడున్న అధికారాలతో చేయొచ్చు కదా. దానికి రాజధాని మార్చటానికి లింక్ ఎందుకు? కావాలంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం పెద్దది విశాఖలో కట్టుకొని విశాఖ ను వాణిజ్య నగరంగా అభివృద్ధి చేయటానికి ఇబ్బందేముంది? రాజధాని కి మరీ ఎక్కువ ఆర్భాటానికి పోకుండా ఇక్కడున్న ప్రాంతం లో కొనసాగిస్తూనే విశాఖ ను  అభివృద్ధి చేసివుంటే సమస్య సామరస్య పూరకంగా పరిష్కార మయ్యుండేది. ఇంత మొరటుగా , కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరమేముంది?

ఇకపోతే ఎన్నికల కమీషనర్ తో వ్యవహరించిన తీరు ఇంకా మొరటుగా, అనాగరికంగా వుంది. స్థానిక ఎన్నికల వాయిదా పై జగన్ మాట్లాడిన తీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సింది కాదు. ఇందులో కులాన్ని చొప్పించటం క్షంతవ్యం కాదు. ఎన్నికల కమీషనర్ కేంద్రానికి రాసిన లేఖ అభ్యంతరకరంగా వున్న మాట వాస్తవం. కానీ జగన్ మోహన రెడ్డి చేసిన వ్యాఖ్య వల్ల విషయం పక్కదారిపట్టింది. అందుకనే మొరటు రాజకీయాలనేది. అలా అనాగరికంగా మాట్లాడకపోయివుంటే ఎన్నికల కమీషనర్ లేఖ పైనే చర్చ జరిగుండేది. ఏది ఏమైనా ఓ విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు హుందాగా , సంయమనం తో వ్యవహరించి వుంటే జగన్ మోహన్ రెడ్డి నే అభినందించే వాళ్ళు. ఎన్నికల కమీషనర్ వ్యవహారం ఈ విపత్కర పరిస్థితులు అయిపోయేవరకు వాయిదా వేసుకొనివుంటే వచ్చే నష్టమేమిటో జగన్ మోహన రెడ్డి చెప్పాలి. ఇప్పటికిప్పుడు ఆర్డినెన్సు తీసుకొచ్చి తనను తీసేయాల్సిన అవసరం ఏముంది? రాజ్యాంగ బద్ధమా, చట్టబద్దమా అనే చర్చలోకి వెళ్ళదలుచుకోలేదు. అది న్యాయ స్థానాలు తేలుస్తాయి. కాకపోతే ఈ చర్య మొరటు రాజకీయాలకు ప్రతిబింబంగా వుందనేది వాస్తవం. ఇప్పటికైనా జగన్ మోహన రెడ్డి హుందాగా ప్రవర్తించటం అలవాటుచేసుకోవాలి. ఎందుకంటే ఆయన మాట్లేడేది, చేసేది ప్రతిదీ ఆరుకోట్ల ఆంధ్రుల తరఫున అని మరిచిపోవద్దు. ఆంధ్రుల గౌరవాన్ని ప్రతిబింబించే విధంగా తన ప్రవర్తన వుండాలి. అంతేగానీ నేనింతే మారను అంటే దానివలన మొత్తం ఆంధ్రుల పరువు ప్రతిష్టలు మంటగలుస్తున్నాయని గుర్తుంచుకోవాలి. ఇకనైనా మొరటు రాజకీయాలకు స్వస్తి పలకాలి.

చంద్రబాబు రెచ్చగొట్టే రాజకీయాలు      

ఒకవైపు అధికారపార్టీ నాయకుడు మొరటుగా ప్రవర్తిస్తుంటే ప్రతిపక్ష నాయకుడు రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నాడు. ఇదికూడా రాష్ట్ర ప్రజల క్షేమానికి మంచిదికాదు. చంద్రబాబు రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి. ముఖ్యమంత్రిగా , ప్రతిపక్షనేతగా అపార అనుభవం వున్న వ్యక్తి. ఎప్పుడు రాజకీయాలు చేయాలో, ఎప్పుడు ప్రభుత్వానికి మద్దత్తివ్వాలో తెలియనంత అమాయకుడేమీ కాదు. ఇప్పుడు ఎదుర్కుంటున్నది ఓ మహత్తర విపత్కర పరిస్థితి. ఈ విపత్తు నుంచి ఎప్పుడు బయటపడతామో తెలియని స్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలకు ఇది సమయం కాదు. ఏదో ఒక మిషమీద ప్రజల్ని రెచ్చగొట్టటం ఆపాలి. నిర్ద్వందంగా ప్రభుత్వానికి మద్దత్తు ప్రకటించాలి. ఈ విపత్కర పరిస్థితులనుంచి బయటపడిన తర్వాత రాజకీయాలు చేసుకోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం తప్పుచేసినా వాటిని ఎత్తి చూపే సమయం కాదు. నిర్మాణాత్మక సూచనలు మాత్రమే చేయాలి. లేకపోతే మౌనంగా ఉండటమే ఉత్తమం. తప్పులు ఎత్తిచూపటానికి, ప్రజల మధ్య పెట్టటానికి ఆ తర్వాత తగినంత సమయముంది. ఇప్పుడుకావాల్సింది అందరూ ఒక్కటిగా వుండి ఈ సమస్యనుంచి ప్రజల్ని బయట పడేయటం. అప్పటిదాకా రాజకీయాలు ఆపి ప్రభుత్వ నిర్ణయాలకు మద్దత్తివ్వాలి. ఈ మహమ్మారి పై యుద్ధం లో  విభేదాలకు తావులేదు. అలా చేస్తే చంద్రబాబుని అందరూ అభినందిస్తారు.

మీడియా భాద్యతాయుతంగా వ్యవహరించాలి 

జాతీయ చానళ్ళు చూస్తే కరోనా మహమ్మారి పై వార్తలు, ప్రజలకు సలహాలు మాత్రమే ప్రసారం చేస్తున్నాయి. అదే తెలుగు చానళ్ళు (ఏవో కొన్ని తప్పించి) చూస్తే మతి పోతుంది. జగన్ మోహన్ రెడ్డి , చంద్రబాబు మాటల యుద్ధం, దానికి మద్దత్తుగా రెండువైపులా అనుయాయుల కాకిగోల చూపిస్తూ ఈ సమయం లో రాజకీయ నాయకుల వికృత రాజకీయ చేష్టలకు తాన తందానా అంటూ బాధ్యతారాహిత్యంగా ప్రసారం చేస్తున్నాయి. చివరకు జనానికి విసుగు, చిరాకు కలిగిస్తున్నాయి. ఇదేనా సామాజిక బాధ్యత. కొన్ని చానళ్లయితే ఇదే అదనుగా తమ వుద్యోగస్తుల్ని, రిపోర్టర్లని తొలగిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదేనా సామాజిక బాధ్యత. మీడియా అంటే ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభం. అటువంటిది ఇటువంటి సమయం లో ఎంత బాధ్యతగా వ్యవహరించాలి.  దేశం లో ఎక్కడా లేనివిధంగా చెత్త రాజకీయాలతో  ప్రసారాలను నింపటం కన్నా దారుణం ఇంకేముంటుంది? మీడియా పాత్ర ఇటువంటి తరుణంలో ఎలా ఉండాలో జాతీయ ప్రసారాలను చూసైనా బుద్ధితెచ్చుకోండి. ఇకనైనా కొద్దిరోజులు అధికార , ప్రతిపక్ష రాజకీయ వికృత చేష్టల్ని ప్రసారం చేయకుండా ఆపితేనే మీ బాధ్యత నెరవేర్చిన వారవుతారు.

Ram
Ramhttps://oktelugu.com/
An Independent Editor, Trend Stetting Analyst.
RELATED ARTICLES

Most Popular