https://oktelugu.com/

BRS MLAs: ఆ 35 మంది అవుట్‌.. బీఆర్‌ఎస్‌లో భారీ కుదుపు!?

తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ నుంచి 10 మంది ఎస్టీ, 18 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో వీరిలో 45 శాతం మంది ఎమ్మెల్యేలను మార్చాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్టు తెలిసింది. వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయడంతోపాటు, రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలని వారికి ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 29, 2023 12:14 pm
    Follow us on

    BRS MLAs: రెండు రోజుల క్రితం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ జనరల్‌ బాడీ సమావేశంలో సీఎం కేసీఆర్‌ చేసిన కామెంట్స్‌ ఆ పార్టీలో భారీ కుదుపునకు దారితీయబోతున్నాయా.. గులాబీ బాస్‌ హిట్‌లిస్టులో ఉన్న ఆ 35 మందికి వచ్చే ఎన్నికల్లో టికెట్‌ లేనట్లేనా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. కేసీఆర్‌ వ్యాఖ్యలు ఇప్పటికే ఆపార్టీ సిట్టింగుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వబోమని గులాబీ బాస్‌ స్పష్టం చేయడంతో సిట్టింగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. కేసీఆర్‌ వద్ద ఉన్న జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయో తెలియక టెన్షన్‌ పడుతున్నారు. ఇలాంటి తరుణంలో కొన్ని పుకార్లు పార్టీ నేతలను, సిట్టింగులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

    వరంగల్‌ నుంచే మొదలు..
    ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచే కేసీఆర్‌ టికెట్ల కోత మొదలు పెడతారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీగా మార్పులు చోటుచేసుకుంటాయని టాక్‌. సీఎం సొంత జిల్లాలోనూ పలువురి పేర్లు ఆ జాబితాలో ఉన్నట్టు సమాచారం. మొత్తంగా ఆ లిస్టులో బహుజన నేతలే అధికంగా ఉన్నారని తెలుస్తున్నది.

    లిస్ట్‌ బయటపెట్టకుండా గేమ్‌..
    ఇప్పటికిప్పుడు అవినీతి ఎమ్మెల్యేల లిస్టును బహిర్గతం చేయకుండా గేమ్‌ ఆడాలని కేసీఆర్‌ చూస్తున్నట్లు తెలుస్తోంది. టికెట్‌ రాదని ముందస్తుగా తెలిస్తే వారు ఇతర పార్టీలో చేరే చాన్స్‌ ఉన్నందున ఎన్నికల సమయానికి జాబితా బయటపెట్టాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఆ లిస్టులో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి అత్యధిక మంది ఉన్నట్టు సమాచారం. సీఎం సొంత జిల్లాల్లోనూ పలువురికి టికెట్లు దక్కకపోవచ్చనే ప్రచారం జరుగుతున్నది. సీఎం సొంత జిల్లా నుంచీ ముగ్గురు ఎమ్మెల్యేలకు ఈసారి మొండిచేయే దక్కనున్నదనే టాక్‌ ఉన్నది.

    45 మందిని మార్చే ఆలోచన..
    తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ నుంచి 10 మంది ఎస్టీ, 18 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో వీరిలో 45 శాతం మంది ఎమ్మెల్యేలను మార్చాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్టు తెలిసింది. వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయడంతోపాటు, రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలని వారికి ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలోని ఎస్టీ ఎమ్మెల్యేలపై పలు ఫిర్యాదులు వచ్చాయని, వారికి తిరిగి టికెట్లు కట్టబెడితే ఓటమి ఖాయమని సీఎం సర్వేలో తేలినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

    పది మంది బీసీలు అవుట్‌..
    వచ్చే ఎన్నికల్లో పది మంది బీసీ ఎమ్మెల్యేలను మార్చాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అదే సామాజిక వర్గానికి చెందిన కొత్తవారికి తిరిగి టిక్కెట్లు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఇద్దరు బీసీ ఎమ్మెల్యేలకు ఆరోగ్యం సహకరించడం లేదు. ఈసారి వారిని పక్కన పెట్టి, ఎమ్మెల్సీ పదవులు ఇస్తారని ప్రచారం సాగుతున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఇద్దరు బీసీ ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోవడంతో వారిని కొనసాగించడమా? లేక కొత్త వారికి అవకాశం ఇవ్వడమా? అనే విషయంపై సీఎం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

    ముగ్గురు వెలమలకు నోచాన్స్‌..
    ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ పార్టీకి 10 మంది వెలమ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ముగ్గురిని తప్పించే చాన్స్‌ ఉన్నట్టు సమాచారం. వేములవాడ నుంచి చెన్నంనేని రమేశ్‌ వారసత్వంపై కోర్టులో వివాదం నడుస్తున్నది. మరోసారి ఆయనకే టికెట్‌ ఇస్తారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే వయోభారంతో రానున్న ఎన్నికల్లో పోటీ చేయలేనని, తన కుమారుడికి టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నట్టు తెలిసింది. అదే ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు ఈసారి తిరిగి టికెట్‌ ఇస్తే.. విపక్ష అభ్యర్థికి గట్టి పోటీ ఇవ్వడం కష్టమని కేసీఆర్‌ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకని ఆ స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి మరో అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.

    ‘రెడ్డీస్‌’లో 6 నుంచి 7 మందికు నో టికెట్‌..
    ఇక రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో 36 మంది ఉన్నారు. వీరిలో ఆరేడు మందిని ఈ సారి తప్పిస్తారని తెలుస్తోంది. కొందరిపై అవినీతి ఆరోపణలు ఉండటం ప్రధాన కారణమని సమాచారం. ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఆరోగ్యం సహకరించకపోవడంతో వారి స్థానాల్లో కొత్త వారిని ఎంపిక చేసే ప్రయత్నాల్లో కేసీఆర్‌ ఉన్నట్టు తెలుస్తుంది.

    హిట్‌ లిస్ట్‌లో వరంగల్‌ నుంచే ఎక్కువ మంది
    కేసీఆర్‌ తయారు చేసిన బ్లాక్‌ లిస్టులో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. అక్కడి నుంచి అత్యధిక మందికి ఈసారి టికెట్లు దక్కకపోవచ్చనే ప్రచారం జరుగుతున్నది. సీఎం సొంత జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్‌ ఇవ్వకపోవచ్చని టాక్‌.