కేంద్ర మంత్రివర్గ విస్తరణ అట్టహాసంగా జరిగింది. అవకాశం ఉన్నంత మేరకు కేబినెట్లో మంత్రులను చేర్చుకున్నారు. ఆ విధంగా ఇప్పుడు.. 78 మంది మినిస్టర్లతో కేంద్ర కేబినెట్ ఫుల్ ప్యాక్ అయిపోయింది. కానీ.. అందులో ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి లేరు! ఇంకా చెప్పాలంటే.. కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేని ఏకైక రాష్ట్రం కూడా ఏపీనే! దీంతో.. తెలుగు రాష్ట్రానికి కనీస ప్రాధాన్యత కూడా ఉండబోదనే విషయం సుస్పష్టమైపోయింది.
కేంద్రంలో మంత్రులు ఉంటేనే తగిన న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఇక, ప్రాతినిథ్యమే లేనప్పుడు రాష్ట్ర సమస్యలు కేబినెట్లో చర్చించేది ఎవరు? ఇటువైపు దృష్టి సారించేది ఎవరు? ఒక మంత్రి ఉండి ఉంటే.. ఆయన న్యాయం చేయడం సంగతి అటుంచితే.. కనీసం నష్టం జరగకుండా ఆపొచ్చు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో.. కాస్త తమ ప్రాంతాన్ని కూడా చూడమని కోరొచ్చు. కానీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు అలాంటి అవకాశం కూడా లేకుండాపోయింది.
ఏపీకి కేంద్రం ఎంత అన్యాయం చేసినా.. రాష్ట్రంలో ఉన్న పార్టీలు కుక్కిన పేనులా పడిఉండడం గమనించాల్సిన అంశం. అధికార పార్టీ ఒక లక్ష్యంతో.. విపక్ష పార్టీ మరో లక్ష్యంతో.. కేంద్రాన్ని కనీసంగా కూడా ప్రశ్నించట్లేదు. ఇటు జగన్, అటు చంద్రబాబు కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను, చేపడుతున్న చర్యలను వేడుకగా చూస్తున్నారనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నా.. తమ పద్ధతి మార్చుకోవట్లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో.. ఏపీని పరిగణనలోకే తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం భావించి ఉంటుంది. అందుకే.. లైట్ తీసుకొని మంత్రి పదవిని, కనీసం సహాయ మంత్రిని కూడా ప్రకటించలేదు. ఇది కేవలం ఏపీకి మాత్రమే కాదు. దక్షిణాది మొత్తం ఇదే పరిస్థితి. తెలంగాణ నుంచి ఉన్న కిషన్ రెడ్డికి పదోన్నతి మాత్రమే. అదికూడా.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేశారనే అభిప్రాయం ఉంది. తమిళనాడుకు ఇవ్వకపోతే.. ఉద్యమించే అవకాశం ఉంటుంది. అందుకే ఒకటి విదిల్చారు. కర్నాటకలో అధికారంలో ఉంది కాబట్టి కాస్త కరుణ చూపారు. మిగిలిన రాష్ట్రాలన్నింటినీ కనీసంగా పట్టించుకోలేదు.
అదే ఉత్తరాదిన మాత్రం ఘనంగా మంత్రి పదవులు పంచిపెట్టారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్, రేపు ఎన్నికలు జరిగే యూపీతోపాటు మహారాష్ట్ర, ఢిల్లీ, ఇతర రాష్ట్రాలకు రాజకీయంగా అవసరమైన చోట మాత్రమే పదవులు ఎక్కువగా వచ్చేశారు. ఈ పరిస్థితి ఇంకా ఎంత కాలం కొనసాగుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి నెలకొందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.