Attacks On Women
Attacks On Women: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువవుతోంది. అడుగు బయట పెట్టినప్పటి నుంచి తిరిగి ఇంటికి చేరేవరకు ఆడపిల్లలతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా బిక్కుబిక్కుమనే పరిస్థితి దాపురించింది. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా.. ప్రతి చోటా మహిళలపై దాష్టికాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రేమోన్మాదం, కామ వాంఛ, పరువు నష్టం.. ఇలా కారణాలేమైనా మహిళల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వీటికి రాజకీయ అధికార అండదండలు ఉండడంతో రోజురోజుకీ పెరుగుతున్నాయి.
వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోయాయి. ఇటీవలే కేంద్రం గణాంకాలతో సహా మహిళలపై అకృత్యాలను వెల్లడించింది. ఇందులో ఏపీ తొలి స్థానాల్లో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దీనిని నియంత్రించేందుకు వైసిపి సర్కార్ కఠిన చర్యలకు ఉపక్రమించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో మహిళలపై అఘాయిత్యాలు ఏటా పెరుగుతున్నాయని కేంద్రం పలుమార్లు పేర్కొంది. మహిళల ఆత్మగౌరవానికి భంగం కేసుల్లో ఏపీ మొదటి స్థానంలో నిలవడం విచారకరం.మహిళల అదృశ్యం, అత్యాచారాలు దొంగతనాలు డేకాయిటీలు పెరిగినట్లు కేంద్రం తేల్చి చెప్పింది. 2019లో 6252 మంది మహిళలు అదృశ్యమయ్యారు. 2020లో 7057 మంది, 2021 లో 8969 మంది మిస్సింగ్ అయ్యారు. 2019, 2021 మధ్యకాలంలో అత్యాచారాలు 9.39%, దొంగతనాలు 4.6%, డెకాయిటీలు 85% పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జగన్ సర్కార్ మహిళలకు రక్షణకు తెచ్చిన దిశ చట్టం పెద్దగా ప్రయోజనం చేకూరిన దాఖలాలు లేవు. 21 రోజుల్లో శిక్ష విధిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరికి కూడా శిక్ష పడిన పరిస్థితి లేదు.
ప్రస్తుతం ఏపీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న విశాఖలో ఓ నేవీ అధికారి కూతురిపై కొందరు సామూహిక అత్యాచారం జరిపారు. తన అక్కను ప్రేమ పేరిట వేధించవద్దని కోరినందుకు అధికార వైసీపీ నాయకుడు ఒకడు ఒక బాలుడిపై యాసిడ్ పోసి చంపేశాడు. మొన్నటికి మొన్న సీఎం కార్యాలయానికి కూత వేటు దూరంలో కృష్ణానది ఇసుక తేనెలపై విశ్రాంతి తీసుకుంటున్న ప్రేమికుల పై అల్లరి ముక దాడి చేసింది. కాబోయే భర్త ఎదుటే యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఇక చిన్నారులు, విద్యార్థులపై లైంగిక దాడుల గురించి చెప్పనక్కర్లేదు.
తాజాగా ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని ఓ గ్రామంలో దారుణం వెలుగు చూసింది. ఓ మహిళ కంట్లో కారం కొట్టి.. కత్తులతో పొడిచి.. సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. సకాలంలో వచ్చిన పోలీసులు అడ్డుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె సోదరుడు అగ్రకులానికి చెందిన యువతిని ప్రేమించడమే అందుకు కారణం. ఈ ఏడాది మార్చిలో సదరు యువతిని తీసుకెళ్లిపోయిన ఆ యువకుడు వివాహం చేసుకున్నాడు. ఆ యువకుడిది ఎస్సీ సామాజిక వర్గం. దీంతో ఆ కుటుంబం పై యువతి కుటుంబ సభ్యులు కక్ష కట్టారు. ఆ యువకుడి సోదరిపై దాడి చేశారు. వీధిలో దాడి చేసి.. విచక్షణ రహితంగా కొట్టి.. తమ ఇంటికే తీసుకెళ్లి బంధించారు. వివస్త్రను చేసి.. పెట్రోల్ పోసి సజీవ దహనం చేసే ప్రయత్నం చేశారు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత మహిళను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పరువు కోసమే ఈ హత్యయత్నం చేసినట్లు తెలుస్తోంది. దీని వెనుక రాజకీయ ప్రోత్సాహం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అచ్చం మణిపూర్ తరహాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఇది ఆంధ్రానా? మణిపూర్ నా? అన్న సందేహం వ్యక్తం అవుతోంది. ఇంత జరుగుతున్నా వైసిపి సర్కార్ కఠిన చర్యలకు ఉపక్రమించకపోవడం విమర్శలకు తావిస్తోంది.