
ఆఫ్ఘనిస్తాన్ లో అధికార మార్పిడి దాదాపుగా పూర్తయినట్టే. ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఉండబోదని తాలిబన్లు ప్రకటించేశారు. గతంలో మాదిరిగానే ఒక కౌన్సిల్ దేశాన్ని పాలిస్తుందని తెలిపారు. తాలిబన్ అగ్ర నాయకుడి హోదాలో హైబతుల్లా అఖుండ్ జాదా ఉంటారని తాలిబన్ ప్రతినిధి వహిబుల్లా హషీమీ మీడియాకు తెలిపారు.
గతంలో ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించిన సమయంలోనూ కౌన్సిల్ ద్వారానే పాలన సాగించారు. తొలిసారిగా 1996లో ఆఫ్ఘన్ ను తాలిబన్లు ఆక్రమించారు. వీరి పాలన 2001 వరకు కొనసాగించింది. అమెరికా సైన్యం రాకతో.. అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది. తాలిబన్ల పాలన కొనసాగినప్పుడు తాలిబన్ చీఫ్ గా ముల్లా ఒమర్ ఉన్నారు. ఆయన కింద ఒక కౌన్సిల్ ఉండేది. ఆ కౌన్సిల్ పాలన కొనసాగించేది.
ఇప్పుడు అఖుండ్ జాదా తాలిబన్ బాస్ గా ఉండబోతున్నారు. ఆయన కింద అబ్ధుత్ ఘనీ బరాదర్, మౌల్వీ యాకూబ్, సిరాజుద్దీన్ హక్కానీ ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో కౌన్సిల్ ఏర్పాటు కానుందని తెలుస్తోంది. అయితే.. పాలన ఎలా కొనసాగించాలి? అనే విషయమై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని హషీమీతెలిపారు. అయితే.. దేశంలో ప్రజాస్వామ్యం మాత్రం ఉండదని తేల్చి చెప్పారు.
ఇదిలాఉంటే.. ఆఫ్ఘనిస్తాన్ లో విమానాలు నడిపేందుకు కూడా కావాల్సినంత మంది పైలెట్లు ఇప్పుడు లేకపోవడం గమనార్హం. దేశంలో ఉన్న విమానాలతోపాటు పొరుగున దేశం ఉజ్బెకిస్తాన్ లోనూ పలు విమానాలు, హెలికాఫ్టర్లు ఉన్నాయి. వాటిని ఇవ్వాలని తాలిబన్లు కోరుతున్నారు. అయితే.. వాటిని నడిపేందుకు కావాల్సినంత మంది పైలెట్లు లేరు. వీటిని నడిపేందుకు పైలట్ల కోసం చూస్తున్నట్టు హషీమీ తెలిపారు.
మొత్తానికి ఆఫ్ఘన్ లో ప్రజాస్వామ్యం ఉండదని తేల్చాశారు తాలిబన్లు. దీంతో.. నిన్నటి వరకు పలికిన శాంతి పలుకులు అవసరం కోసం చేసినవేనా? ఇందులో నిజం లేదా? అనే చర్చ మొదలైంది. మహిళల హక్కులు కాపాడుతాం.. ప్రభుత్వంలో భాగం చేస్తామంటూ తాలిబన్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు.. షరియా చట్టం ప్రకారమే పాలన సాగుతుందని చెబుతున్నారు. ఈ చట్టం ప్రకారం మహిళలు చదువు కోకూడదు, బురఖాలోనే బందీగా ఉండాల్సి ఉంటుంది. ఇంకా ఎన్నో అరాచక నిర్ణయాలు ఉంటాయి. దీంతో.. మరోసారి పాత పాలనే కొనసాగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.