https://oktelugu.com/

Minister Roja: వైసీపీలో ఒంటరైన రోజా.. స్వయంకృతాపమే

రాజకీయాల్లో దూకుడు కలిసి వస్తుంది. ఈ విషయంలో రోజా సక్సెస్ అయ్యారు. తన దూకుడు స్వభావంతోనే రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ క్రమంలో ఆమె వివాదాస్పద ముద్రను తెచ్చుకున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : October 1, 2023 1:43 pm
    Minister Roja

    Minister Roja

    Follow us on

    Minister Roja: వైసీపీలో మంత్రి రోజా ఒంటరి అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ఆమెపై టిడిపి నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా.. వైసీపీ నేతలు ఎవరూ కౌంటర్ అటాక్ ఇవ్వడం లేదు. అయితే ఈ విషయంలో ఆమెది స్వయంకృతాపమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. సినీ రంగం నుంచి ఆమె రాజకీయాల వైపు అడుగులు వేశారు. తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. పార్టీ పరంగా కీలక పదవులు చేపట్టిన ఆమె.. ఎమ్మెల్యేగా రెండుసార్లు పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆది నుంచి ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా, ఆపై మంత్రిగా అనుకున్నది సాధించగలిగారు. కానీ ఈ క్రమంలో ఎక్కువమందితో శత్రుత్వాన్ని పెంచుకున్నారు. ప్రత్యర్థులకు టార్గెట్ గా మారారు.

    రాజకీయాల్లో దూకుడు కలిసి వస్తుంది. ఈ విషయంలో రోజా సక్సెస్ అయ్యారు. తన దూకుడు స్వభావంతోనే రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ క్రమంలో ఆమె వివాదాస్పద ముద్రను తెచ్చుకున్నారు. చాలా సందర్భాల్లో చులకనగా మారిపోతున్నారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించడంలో గాడి తప్పుతున్నారు. దానికి ఆమె మూల్యం చెల్లించుకుంటున్నారు. తాజాగా టిడిపి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె గత జీవితం ఇది అంటూ వ్యక్తిగత హననానికి పాల్పడ్డారు. అయితే దీనిని తిప్పి కొట్టడంలో మాత్రం వైసీపీ ఘోరంగా వైఫల్యం చెందింది. తోటి మంత్రులు, వైసీపీ సీనియర్లు కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. గతంలో తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం ఉన్నా.. ఒంటరిని చేశారన్న ఒకే ఒక్క కారణంతో ఆ పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు కూడా వైసీపీలో అదే పరిస్థితి ఆమెకు ఎదురవుతోంది.

    వాస్తవానికి ఆమెకు వచ్చే ఎన్నికల్లో ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవి ఇచ్చినంత సులువుగా టికెట్ కేటాయించే అవకాశాలు లేవని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆమెకు సొంత నియోజకవర్గంలోనే సొంత పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత ఉంది. ఇటీవల సీఎం జగన్ సైతం నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో ఉన్న విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇది రోజా లాంటి నేతలకు వర్తిస్తుందని సంకేతాలు ఇచ్చారు. మరోవైపు రోజా ప్రత్యర్థులకు పార్టీ హై కమాండ్ అగ్రతాంబూలం ఇస్తోంది. వారికి ఆర్థికంగా బలోపేతం అయ్యేలా చేయూతనిస్తోంది. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ బీసీ నేతను అభ్యర్థిగా ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. ఇటువంటి తరుణంలోనే తాను ఒంటరిగా మారానని రోజా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేయడానికి ముఖ్య కారణం సీఎం జగన్ సంతృప్తి పెట్టడానికేనని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో ఆమె స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారు. ప్రత్యర్థులపై వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమెకు అవే ప్రతిబంధకంగా మారాయి. అటు సొంత పార్టీ నేతలు సైతం ఆమెను లైట్ తీసుకుంటున్నారు. అందుకే తాజాగా బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను ఒక్క మంత్రి కూడా తప్పు పట్టలేదు. సీనియర్లు ఎవరూ ఖండించలేదు. అసలు మంత్రి రోజా తమ పార్టీయే కాదన్నట్టు వారి వ్యవహార శైలి ఉంది. చివరికి వైసీపీ విషయాల్లో వకాల్తా పుచ్చుకునే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాల్సి వచ్చింది. అయితే ఆయన వ్యవహార శైలి అందరికీ తెలిసిందే. రోజా విషయంలో ఆయన మద్దతు తెలపడం ప్లస్ కంటే మైనస్ అధికం. మహిళల విషయంలో ఆయన ప్రవర్తన చూసినవారు.. సరిపోయారు అంటూ వ్యాఖ్యానిస్తున్నారే కానీ.. ఓ మహిళా మంత్రి విషయంలో బాధ్యతగా వ్యవహరించారని ఎవరు అనుకోవడం లేదు. మొత్తానికైతే తాజా పరిస్థితులు చూస్తుంటే మంత్రి రోజా వైసీపీలో ఒంటరైన పరిస్థితి కనిపిస్తోంది.