Bandi Sanjay: రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తు.. వ్యూహానికి ప్రతి వ్యూహం పండితేనే సక్సెస్ సొంతమవుతుంది. ప్రస్తుత రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తు వేసేవాళ్లు వ్యూహానికి ప్రతి వ్యూహం రచించేవారు తక్కువ. అదే సమయంలో పార్టీలో శకుని పాత్ర పోషిస్తున్న వారు పెరిగిపోతున్నారు. శకుని మహాభారతంలో శత్రువర్గం వైపు ఉన్న వ్యక్తి. ఆయన తన వర్గం నాశనాన్ని కోరుకున్నాడు. రాజకీయ పార్టీల్లో కూడా ఇలాంటివారు పెరిగిపోతున్నారు. స్వలాభం కోసం ప్రత్యర్థులతో చేతులు కలుపుతున్నారు. కోవర్టులుగా పనిచేస్తున్నారు. సొంత పార్టీ వ్యూహాలను ప్రత్యర్థి పార్టీకి చేరవేస్తున్నారు. ఇలాంటి తరుణంలో బీజేేపీకి తెలంగాణలో ఒక ఊపు తీసుకొచ్చాడు కరీంనగర్ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్రంలో బీజేపీ బండి సంజయ్ కి ముందు.. తర్వాత అని చెప్పుకునే స్థాయికి పార్టీ ఎదిగింది. ఎందుకు బండి సంజయ్ కృషి తప్పనిసరిగా అభినందించాల్సిందే. అయితే తాజాగా బండి సంజయ్ ని పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తారని చర్చ జోరుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల్లో లాగానే బీజేపీలో ఉన్న శకుని పాత్ర పోషిస్తున్న నేతలు అప్రమత్తమయ్యారు.

బండిని దింపే ప్రయత్నం..
– తాజా ఊహాగానాల నేపథ్యంలో బండి సంజయ్ వ్యతిరేకవర్గం ఆయనను తప్పించేందుకు జాతీయస్థాయిలో ప్రయత్నాలు మొదలు పెట్టింది. బండి సంజయ్ ముందు వరకు బిజెపి పార్టీ ఉందా అంటే ఉన్నట్లుగానే ఆ పార్టీ అధ్యక్షుడు నడిపించారు. బండి అధ్యక్షుడు అయ్యాక పార్టీని దౌడు పెట్టిస్తున్నారు. ఇది కొంతమందికి నచ్చడం లేదు. హిందుత్వ వాదాన్ని జాతీయవాదాన్ని కలిపి తెలంగాణలో వ్యాప్తింపజేయడంలో బండి సక్సెస్ అయ్యారు. పార్టీకి ప్రజల్లో క్రేజీ తీసుకురాగలిగారు. తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బిజెపి అన్న స్థాయిలో పార్టీని నిలబెట్టారు. ఇతరుణంలో బండిని తప్పిస్తే పార్టీకి నష్టం తప్పదని సంజయ్ అనుకూల నేతలు చెబుతున్నారు.
మంత్రి పదవి కోసం..
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బిజెపి భావిస్తోంది. ఇతరుణంలో త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ ఎంపీకి స్థానం ఇవ్వాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఇందులో బండి సంజయ్ తో పాటు అరవింద్, బాపూరావు, లక్ష్మణ్ ఉన్నారు. అయితే జాతీయ నాయకత్వం బండి సంజయ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సంజయ్ కి మంత్రి పదవి ఇస్తే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం ఖాయం. ఒక వ్యక్తికి రెండు పదవులు సిద్ధాంతం బీజేపీలో లేదు. ఇదే జరిగితే ఇన్నాళ్లు సంజయ్ పడిన శ్రమంత వృధా అవుతుందనే భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతుంది.

మరో 10 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్న ఉత్కంఠ రాష్ట్ర నేతల్లో నెలకొంది. అధిష్టానం మనసులో ఏముందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.