AP Police: ఏపీలో పోలీసుల వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కులాభిమానం ఉన్న పోలీస్ అధికారులు తప్పించి.. మిగతా వారు కాస్త లౌక్యాన్నే ప్రదర్శిస్తున్నారు. సహజంగా ఇది వైసీపీ నేతలకు మింగుడు పడదు. అధికారంలో మేమున్నామంటూ అహం ప్రదర్శించడం.. తమ ఆదేశాలను పాటించాలని ఒత్తిడి చేయడం పరిపాటి. గత నాలుగేళ్లుగా ఇదే మాదిరిగా పోలీస్ శాఖతో ఓ ఆట ఆడుకున్నారు. కానీ ఇప్పుడు ఎన్నికల సమీపిస్తుండడంతో పోలీస్ శాఖ న్యూట్రల్ గా వ్యవహరించడం ప్రారంభించింది. ఇది కొంచెం వైసీపీ నేతలకు మింగుడు పడని అంశమే.
గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో పోలీసుల వైఖరి విమర్శలకు తావిచ్చిన మాట వాస్తవమే. విపక్ష నేతలపై దాడులు జరిగితే.. బాధితులు పైనే హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. గోడ దూకి ఇంట్లో ప్రవేశించి అరెస్టులు చేశారు. ఇవన్నీ పోలీసులే స్వతహాగా చేశారనుకుంటే పొరపడినట్టే. అధికార పార్టీ నాయకులు ఆదేశాలు ఇచ్చి మరి అకృత్యాలు చేయించారు. తమ ఆదేశాలు అమలు చేయని పోలీస్ అధికారులను చుక్కలు చూపించారు. ఆ భయంతోనే పోలీసులు అతిగా ప్రవర్తించారు. అయితే ఇప్పుడు పోలీసుల్లో మార్పు వస్తున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ పెద్దల్లో అదే అసహనానికి కారణమవుతుంది.
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించాలనుకున్నా పవన్ వారాహి 3.0యాత్ర విశాఖలో విజయవంతంగా ముందుకు సాగుతోంది. వాస్తవానికి పవన్ పర్యటనను పోలీస్ శాఖ ద్వారా అడ్డగించాలని ప్రభుత్వ పెద్దల లక్ష్యం. ఇందుకోసం చాలా రకాలుగా ఆదేశాలు జారీ చేశారు. అందుకే పోలీస్ శాఖ ఆంక్షలు విధించింది. గత అనుభవాల దృష్ట్యా యాత్ర సాఫీగా సాగుతుందో లేదో అన్న ఆందోళన జనసైనికులను వెంటాడింది. కానీ పోలీసులే యాత్రను సాఫీగా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు. వేలాది మంది జనసైనికులు తరలివస్తున్నా వారిని కట్టడి చేసే ప్రయత్నం చేయలేదు. చివరకు రుషికొండ పర్యటనకు వెళ్లినా, వైసీపీ నేతల అక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించినా.. ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు గట్టి కట్టడి చర్యలు చేపడుతున్నారు. దీంతో ప్రభుత్వ పెద్దలు విశాఖ పోలీసులపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
గతంలో జనవాణి కార్యక్రమానికి గాను పవన్ విశాఖకు వచ్చినప్పుడు పోలీస్ శాఖ ద్వారా వైసీపీ నేతలు సృష్టించిన గలాటా అంతా ఇంతా కాదు. పోలీసులపై ఉన్న గౌరవంతో పవన్ రెండు రోజులు పాటు హోటల్ కే పరిమితమయ్యారు. విశాఖలో ఎటువంటి కార్యక్రమం నిర్వహించకుండానే విజయవాడ పయనమయ్యారు. అప్పట్లో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అదే పోలీసులు ప్రభుత్వ పెద్దల ఆదేశాలను పాటించకుండా.. పవన్ వారాహి యాత్రను సజావుగా ముందుకు తీసుకెళుతుండడం అభినందనీయం. ఇదే స్ఫూర్తిని పోలీస్ శాఖ కొనసాగించాల్సిన అవసరం ఉంది. అయితే కొందరు కులాభిమానం గల పోలీస్ అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పోలీస్ శాఖకే మచ్చగా నిలుస్తున్నారు.