Tirumala
Tirumala: ఆశానికి చిల్లు పడిందా అనే స్థాయిలో వర్షం కురుస్తున్నది. నిమిషాలు, గంటలు కాదు.. ఏకంగా రోజుల తరబడి వాన దంచి కొడుతోంది. వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయ అవుతున్నాయి. పంట చేలు నీట మునిగాయి. జనం హాహా కారాలు చేస్తున్నారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకి వెళ్ళొద్దని అధికారులు చెబుతున్నారు. ఇంతటి వర్షాల్లోనూ ఒక ప్రాంతం మాత్రం రద్దీగా మారింది. ఇసకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. ఇంతకీ ఏమిటా ప్రాంతం? ఏమిటి దాని ప్రాశస్త్యం
ప్రస్తుతం వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో బయటికి వెళ్తే ప్రమాదం అని అధికారులు చెబుతున్నారు. కానీ తిరుమల తిరుపతికి వెళ్లేందుకు మాత్రం భక్తులు వర్షాలను కూడా లెక్కచేయడం లేదు. ముంచెత్తే వరదలను ఖాతరు చేయడం లేదు. నమో తిరుమలేశా, నమో వెంకటేశా అనుకుంటూ ఏడుకొండలెక్కేస్తున్నారు. వారం రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నప్పటికీ భక్తులు వెంకటేశ్వరుడిని చూసేందుకు తహతహ లాడుతున్నారు. ప్రస్తుతం శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. గురువారం శ్రీవారిని 63,932 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం 4.13 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. స్వామివారికి 25,862 మంది భక్తులు తల నీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమల కిటకిట
ఓ వైపు వర్షాలు భారీగా కురుస్తున్నప్పటికీ తిరుమలను సందర్శించేందుకు భక్తులు ఏమాత్రం వెనుకాడటం లేదు. స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. వర్షాలు కురిసినప్పుడు తిరుమలకు భక్తుల రాక కొంచెం తగ్గేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తిరుమల తిరుపతి అధికారులు అంటున్నారు. పైగా వర్షం కురిసినప్పుడు తిరుమల అద్భుతంగా ఉంటుందని, ప్రకృతి రమణీయతను చూసేందుకు భక్తులు వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంటున్నారు. కాగా ఇటీవల నడక మార్గంలో కర్నూలుకు చెందిన ఒక బాలుడి ని చిరుత పులి గాయపరిచిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అటవీ మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. భద్రతను భారీగా పెంచారు. ఇక నడక మార్గంలో వరద నీరు పోటెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులను పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నారు. కాగా భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో శ్రీవారి లడ్డూ పోటు లో ప్రసాద తయారీని పెంచినట్టు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. వర్షాకాలం అయినప్పటికీ భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు. ప్రస్తుతం శ్రీవారిని దర్శించుకునేందుకు 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.