గెలుపు ఇచ్చే కిక్కు అంతా ఇంతాకాదు.. ఓటమి ఇచ్చే నైరాశ్యం ఎవరినైనా కృంగదీస్తుంది.. అయితే వరుస విజయాలతో జోరుమీదున్న జగన్ ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షించేలా అతి పెద్ద ప్లాన్ వేశారు. అదే తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు. తిరుపతిలో ఫలితాలు దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఉండాలని.. ఇందుకు తగిన విధంగా కార్యాచరణ రూపొందించాలని పార్టీ నేతలకు జగన్ దిశానిర్ధేశం చేశారు.
తిరుపతి లోక్ సభ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ చార్జిగా ఒక మంత్రి, అదనంగా ఒక ఎమ్మెల్యే ఉంటారని వెల్లడించారు. తిరుపతి ఉప ఎన్నికలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ చర్చించారు.
పార్టీ అభ్యర్థి గురుమూర్తిని నేతలకు పరిచయం చేసిన జగన్.. ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయనే విషయాన్ని గడపగడపకూ వెళ్లి వివరించాలని చెప్పారు.
తిరుపతిలోని ప్రతీ గడపకూ వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించాలని నేతలకు జగన్ సూచించారు.ప్రతీ ఓటరుకూ తమ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచిని వివరించాలని నేతలకు జగన్ సూచించారు. రాబోయే రోజుల్లో ఇదే ఒరవడి కొనసాగిస్తామని హామీ ఇవ్వాలని తెలిపారు.
వైసీపీ నేతలంతా వరుస విజయాలతో అతివిశ్వాసానికి వెళ్లొద్దని జగన్ కోరారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లి వైసీపీని గెలిపించాలని.. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఫలితాలు ఉండాలని నేతలను ఆదేశించారు.ఇందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు.