NTR Chaitanya Ratham: చైతన్య రథం.. తెలుగునాట ఈ వాహనానికి ప్రత్యేక గుర్తింపు, చరిత్ర ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రజా క్షేత్రంలో అడుగుపెట్టిన నాయకులు చైతన్య రథం స్పూర్తిగా వాహనాల రూపొందించుకునే వారంటే అతిశయోక్తి కాదు. నాడు ఎన్టీఆర్ చైతన్యరథంపై ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో గడగడపకూ తిరిగారు. తెలుగువారిలో స్ఫూర్తిని రగిలించారు. అటు తరువాత ఎంతో మంది నాయకులు ప్రజల మధ్యకు వచ్చేటప్పుడు చైతన్యరథం మాదిరిగా ప్రత్యేక వాహనాలు రూపొందించుకున్నారు. అంతలా ట్రెండ్ స్రుష్టించింది చైతన్యరథం. అయితే ఈ రథం కొత్తగా కొనుగోలు చేసింది కాదు.
ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేశాక మొదట మూడు మహానాడులు నిర్వహించారు. ఆ తర్వాత రాష్ట్ర పర్యటనకు కర్నూలు నుంచి శ్రీకారం చుట్టారు. ఆయన జీపులోనే కర్నూలుకు వెళ్లారు. తుంగభద్ర గెస్ట్‌హౌ్‌సలో వీరు బసచేయగా…ఆ ప్రాంతానికి జనం విపరీతంగా పోటెత్తారు. బహిరంగ సభకు వెళ్లేందుకు ఆ జీప్‌కు ఉన్న పైటాప్ తీసేయాలని ఎన్టీఆర్ చెప్పారు. ‘రాష్ట్రపర్యటన ఇలా జీపులో కాదు. మరో ఏర్పాటుండాలి’ అని రామకృష్ణ స్టూడియో్‌సలో చర్చ జరిపారు. రకరకాల ప్రతిపాదనలు వచ్చాయి.
ఇంతలో ఎన్టీఆర్ లేచి రామకృష్ణ స్టూడియో ప్రాంగణంలో ఉన్న ఒక షెడ్డు దగ్గరకు వెళ్లి, దాన్ని ఓపెన్ చేయించారు. అందులో దుమ్ముకొట్టుకుపోయిన 1940 మోడల్ షెవర్లె వ్యాన్ ఉంది. తన పర్యటనకు అదే సరైనదని ఎన్టీఆర్ భావించారు. అక్కడే ఉన్న హరికృష్ణను పిలిచి వ్యాన్‌కు మరమ్మతులు చేయించాలన్నారు. ఇంజన్, కొత్త టైర్లు బిగించారు. వ్యాన్ లోపల మంచం, రివాల్వింగ్ కుర్చీ, వాష్ బేసిన్, చిన్న అద్దం ఏర్పాటయ్యాయి. వ్యాన్ పైభాగాన్ని కోసేసి, పైకి ఎక్కడానికి ఒక అల్యూమినియం నిచ్చెన బిగించారు. టాప్ మీద ముగ్గురు, నలుగురు నిలబడేందుకు టాప్‌ను సమతలం చేశారు. మైక్, లౌడ్‌స్పీకర్లు ఏర్పాటుచేశారు. ఈ పనులన్నీ చేయడానికి రెండునెలలు పట్టింది. ఎన్టీఆర్ దానికి చైతన్యరథం అని పేరుపెట్టారు. మూతబడ్డ జెమిని స్టూడియో నుంచి తుక్కు కింద కొన్న వాహనాన్ని చైతన్య రథంగా ఉపయోగించుకున్నారు. తిరుపతిలో మొదలై తిరుపతిలో ముగిసిన ఈ యాత్రలో ఈ రథంపైనే 35 వేల కిలోమీటర్లు తిరిగారు.
సారధిగా హరిక్రిష్ణ
చైతన్యరథంతో ఎన్టీఆర్ కుమారుడు హరిక్రిష్ణది విడదీయ రాని బంధం. ఒక విధంగా చెప్పాలంటే హరిక్రిష్ణ మరణం వరకూ ఆయన్ను చైతన్య రథసారధి అని పిలిచేవారు. ఎన్టీఆర్ రాష్ట్ర పర్యటనలకు వెళ్లినప్పుడు హరిక్రిష్ణే స్వయంగా చైతన్య రథాన్ని నడిపేవారు. వాహన బాధ్యతలు ఆయనే చూసుకునేవారు. వాహనంలో వసతులు సైతం సమకూర్చేవారు. వాస్తవానికి హరిక్రిష్ణకు వాహనాలంటే ఎనలేని ప్రీతి. తన వాహనాన్ని తానే నడుపుకోవడం ఆయనకు చాలా ఇష్టం. మార్కెట్ లోకి కొత్త వాహనాలు వస్తే చాలు. ఆయన ఇష్టంగా కొనుగోలు చేసుకునేవారు. చైతన్య రథాన్ని సైతం తన తండ్రి గుర్తుగా అపురూపంగా చూసుకునే వారు.