
దేశంలో ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నాయి.. మరోవైపు వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు 45 ఏళ్ల పైబడిన వారు వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. మొదట్లో కొందరు టీకా వేసుకునేందుకు వెనుకాడినా ఆ తరువాత కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో వ్యాక్సిన్ వేసుకునేందుకు బారులు తీరుతున్నారు. దీంతో వ్యాక్సిన్ పై ప్రజల్లో అవగాహన పెరిగిందనే చెప్పవచ్చు. ఇదిలా ఉండగా మే 1 వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. అందుకు ఆయా రాష్ట్రాలు కూడా టీకా ప్రజలకు ఉచితంగానే ఇస్తానని ప్రకటిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీలో మాత్రం మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేయడం సాధ్యం కాదంటోంది. వీరు టీకా వేసుకునేందుకు జూన్ వరకు ఆగాల్సిందేనంటోంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి సింఘాల్ ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో రెండే సంస్థలు టీకాలు ఉత్పత్తి చేస్తున్నాయి. వాటిలో సగం కేంద్రానికి ఇవ్వాలి. మిగతా సగం ఎవరికైనా అమ్ముకునే స్వేచ్ఛ ఉంది. ఎవరూ ఎక్కువ రేటు ఇస్తే వారికే అమ్ముకోవచ్చర. రాష్ట్రాలకే ఇవ్వాలన్న రూలేం లేదు.
అయితే కేంద్రానికి వచ్చే కోటా నుంచి రాష్ట్రాలకు టీకాలు వస్తాయి. ఏపీలో 45 ఏళ్ల లోపు వారు 2 కోట్లకు పైగానే ఉంటారు. వారికి రెండు సార్లు టీకాలు వేయాలంటే 4 కోట్ల వ్యాక్సిన్స్ కావాలి. అంత ఉత్పత్తి చేసిన కేంద్రం ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే రాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఆశలు పెట్టుకోకుండా టీకా కోసం జూన్ వరకు ఆగాల్సిందేనంటున్నారు. అయితే ఇతర రాష్ట్రాలు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతర్జాతీయ బిడ్లు వేసి మరీ టీకాలు సొంతం చేసుకోవడానికి యత్నిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్రం కేంద్రం ఇచ్చే వ్యాక్సిన్ పైనే ఆధారపడి ఉంటుందా..? లేక బిడ్లు వేసి కొనుగోలు చేస్తుందా..? అనేది తెలియదు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు ఉచితంగా టీకా ఇస్తామని ప్రకటించారు. దీంతో ఎక్కువ టీకాలు వేయాలంటే డబ్బులు పెట్టి కొనే అవకాశం ఉందా..? అని చర్చించుకుంటున్నారు..? అందువల్ల వ్యాక్సిన్ పై మొదట్లో నిరాసక్తగా ఉన్న ప్రజలు ఆ తరువాత టీకా వేయించుకునేందకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ తరుణంలో ప్రజల ఒత్తిడి నుంచి ప్రభుత్వం ఏ విధంగా బయటపడుతుందో చూడాలి..