New Parliament Building Inauguration: పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28వ తేదీన పార్లమెంట్ కొత్త భవనాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు పార్లమెంటు ప్రారంభోత్సవానికి రావలసిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు లోకసభ స్పీకర్ ఓం బిర్లా. అదే సమయంలో భవనం ప్రారంభించి.. జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోదీ.
పాత భవనంలో వసతులు లేక..
వందేళ్ల నాటి ప్రస్తుత పాత భవనంలో సరైన వసతులు లేకపోవడంతో పార్లమెంట్ కొత్త భవన నిర్మాణం చేపట్టింది మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఆత్మ నిర్భర్‌కు సంకేతంగా నూతన పార్లమెంట్ భవన నిర్మాణం ఉండనుంది. భారత ప్రజాస్వామ్య విలువలకు అద్దం పట్టేలా భారత సంస్కృతి చిహ్నాలతో నిర్మాణం చేపట్టారు.
కొత్త భవనం ఇలా..
కొత్త భవనంలో లోక్‌సభలో 888 మంది ఎంపీలు, రాజ్యసభలో 300 మంది ఎంపీలకు సీటింగ్ ఏర్పాటు చేశారు. పార్లమెంటు ఉభయ సభల సమావేశం.. లోక్ సభలోనే నిర్వహించనున్నారు . ఇక.. ఉభయ సభల సంయుక్త సమావేశంలో 1,280 మంది ఎంపీలు కూర్చునే ఏర్పాట్లు చేశారు.
ప్రజాస్వామ్య వారసత్వానికి చిహ్నంగా..
నూతన పార్లమెంట్ భవనం భారతదేశ ప్రజాస్వామ్య వారసత్వ చిహ్నంగా ఉండనుంది. మోదీ సర్కార్ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు మే నెల 28న పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
రూ.970 కోట్లతో నిర్మాణం..
నూతన పార్లమెంట్ భవనాన్ని దాదాపు రూ.970 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ పార్లమెంట్ నాలుగు అంతస్తులతో ఉంటుంది. ఇందులో భోజన గదులు, విస్తారమైన పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. ఇది భారతదేశ ప్రజాస్వామ్య వారసత్వ చిహ్నంగా ఉండనుంది. ఈ కొత్త పార్లమెంట్ నిర్మాణంలో జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్ అనే మూడు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. వాటిని వీఐపీలు, సందర్శకులు, అధికారుల కోసం ప్రత్యేక ప్రవేశ ద్వారాలుగా కేటాయించారు.
కాగా, 2020 డిసెంబర్‌లో మోదీ కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులను శంకుస్థాపన చేయగా, 2021 అక్టోబర్ 1 నుంచి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కొత్త పార్లమెంట్ భవనంలో మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్‌తో పాటుగా దేశంలో ప్రధాన మంత్రులుగా చేసిన వారి ఫొటోలను పొందుపరచనున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలైలో కొత్త భవనంలో జరుగుతాయని సమాచారం.