YCP Govt: రహస్యంగా ఉండాల్సిన నివేదికలు ఒక్కొక్కటీ బయటికొస్తున్నాయి. ప్రభుత్వం వద్ద మాత్రమే ఉండాల్సిన రిపోర్టులు పత్రికలకు చేరుతున్నాయి. అధికారులు రాజకీయ నాయకుల అవతారం ఎత్తుతున్నారు. రాజకీయ నాయకుల్ని బెదిరించినంత పని చేస్తున్నారు. ఇదంతా ప్రభుత్వ ప్రమేయంతో జరుగుతోందా ? అధికారుల సొంత నిర్ణయాలతో జరుగుతోందా ? ఏపీలో నెలకొన్న విచిత్రమైన పరిస్థితికి కారణమేంటి ? అన్న చర్చ హాట్ హాట్ గా జరుగుతోంది.

ప్రతి ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ విభాగం ఒకటి ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితిని సదరు ప్రభుత్వాలకు రహస్యంగా చేరవేయడం దాని విధి. ప్రభుత్వానికి తెలియాల్సిన విషయం ఒక్క ప్రభుత్వానికి మాత్రమే తెలియాలి. మూడో కంటికి కూడా తెలియకూడనంత గోప్యతను పాటించాలి. అది ఇంటెలిజెన్స్ విభాగం ప్రాథమిక విధి. కానీ ఏపీలో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇంటెలిజెన్స్ విభాగం తన ప్రాథమిక విధిని నిర్వర్తించడంలో విఫలమవుతోంది. ప్రభుత్వానికి మాత్రమే తెలియాల్సిన రహస్యాలు, నివేదికలు ప్రైవేటు వ్యక్తుల దాకా వెళ్తున్నాయి.
ఐప్యాక్ సంస్థతో సర్వే చేయించుకోవడానికి జగన్ పార్టీ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఐప్యాక్ సంస్థ.. ఎఫ్ఎస్ సీఎస్ పేరుతో ఏపీలో సర్వే చేస్తున్న సమయంలోనే ఇంటెలిజెన్స్ విభాగం కూడా సర్వే నిర్వహించింది. ఆ సర్వే నివేదికలను ప్రభుత్వానికి అందించింది. ప్రభుత్వానికి అందిన వెంటనే.. ఓ పత్రిక వద్దకు కూడా ఆ సర్వే చేరిపోయింది. కేవలం ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సర్వే రిపోర్టు ఓ పత్రికకు ఎలా వెళ్లిందన్న ప్రశ్న ఇప్పుడు పురుడుపోసుకుంది. ప్రభుత్వమే లీక్ చేయించిందా ? లేక అధికారులు ఎవరైనా లీక్ చేశారా ? అన్న అంశం పై ఇప్పటికీ స్పష్టత లేదు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూసినట్టయితే.. ఎవరి ఫోన్ ట్యాప్ చేస్తున్నారో వారికి సమాచారం ఇచ్చి ట్యాపింగ్ చేయాలి. ఇది ప్రథమ కర్తవ్యం. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లే ట్యాపింగ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా ట్యాపింగ్ చేశామని ఆ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మరీ చెబుతున్నారు. ట్యాపింగ్ లింక్ ను నేరుగా ఎమ్మెల్యేలకు పంపిస్తున్నారు. ఇలా ఓ 50 మంది ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇదంతా ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందంటే.. జరుగుతుందంటే నమ్మాలా ? . అధికారులే సొంతంగా ఇలాంటి పనులు చేస్తున్నారా ? ప‌్రభుత్వ పెద్దల సహకారం లేకుండా అధికారులు ఇలా చేయగలరా ? అని ఫోన్ ట్యాపింగ్ బాధిత ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.

ఒకవైపు ఇంటెలిజెన్స్ నివేదికలు, మరోవైపు ఐప్యాక్ సంస్థ సర్వే రిపోర్టులు ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. ఇదంతా ఇంటెలిజెన్స్ కార్యాలయం నుంచే లీక్ అవుతోందని కొందరు అనుమానిస్తుంటే.. మరికొందరు ప్రభుత్వంలోని కొందరు ఇదంతా చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి పని ఎవరు చేసినా ఇంటెలిజెన్స్ రిపోర్టులు లీక్ కావడం మంచి కాదన్నది జగమెరిగిన సత్యం. ఇలాంటి లీకులు కచ్చితంగా ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీస్తాయని చెప్పవచ్చు.