Supreme Court: రూ.17,500 ఫీజు కట్టలేక ఐఐటీ సీటు కోల్పోయిన పేద విద్యార్థి కోసం ఏకంగా సుప్రీంకోర్టునే రంగంలోకి దిగింది

సరస్వతీ కటాక్షం ఉన్నా.. లక్ష్మీదేవి దీవెనలు లేక పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. కొంత మందికి దాతలు విరాళాలు ఇస్తున్నారు. కొంతమందికి నేతలు అండగా ఉంటున్నారు. తాజాగా ఓ పేద విద్యార్థికి సుప్రీం కోర్టు అండగా నిలిచింది.

Written By: Raj Shekar, Updated On : September 28, 2024 12:40 pm

Supreme Court

Follow us on

Supreme Court: పేదరికం చాలా మందిని ఉన్నత చదువులకు దూరం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకూడదని స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తున్నాయి. అయితే ఇవి కూడా సమయానికి అందక పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్న చదువులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నాయి. విదేశీ విద్యకు రుణసాయం చేస్తున్నాయి. అయితే ఫీజులకు, ప్రభుత్వాలు చేసే సాయానికి భారీగా వ్యత్యాసం ఉంటోంది. ఈ కారణంగా కూడా చాలా మంది ప్రతిభావంతులు ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని టిటోరా గ్రామానికి చెందిన 18 ఏళ్ల దళిత యువకుడు అతుల్‌కుమార్‌ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత సాధించాడు. ఐఐటీ ధన్‌బాద్‌లో ఎలక్ట్రిక్‌ ఇంజినీరింగ్‌లో సీటు సాధించాడు. అయితే పేద కుటుంబం కావడంతో రూ.17,500 ఫీజు చెల్లించలేకపోయాడు. ఊరంతా అతుల్‌కుమార్‌కు ఆర్థికసాయం అందించినా చివరి నిమిషంలో పేమెంట్‌ పోర్టల్‌లో సాంకేతిక సమస్య కారణంగా సకాలంలో ఫీజు కట్టలేదు. దీంతో అతడి కల చెదిరింది. ఐఐటీ సీటు క్యాన్సిల్‌ అయింది.

కోర్టును ఆశ్రయించి..
ఎంతో కష్టపడి సాధించిన ఐఐటీ సీటు కోల్పోవద్దన్న సంకల్పంతో అతుల్‌ పేమెంట్‌ పోర్టల్‌లో సాంకేతిక లోపంపై జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్, జార్ఖండ్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, మద్రాస్‌ హైకోర్టును కూడా ఆశ్రయించారు. అక్కడ జాప్యం జరగడంతో చివరకు సుప్రీం కోర్టు తలుపు తట్టాడు. సీజేఐ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సెప్టెంబర్‌ 24న విచారణ చేపట్టింది. అతుల్‌ కుమార్‌కు అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

సోమవారం తుది తీర్పు..
ఇక సెప్టెంబర్‌ 24న విచారణ జరిపిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్‌ 30వ తేదీకి వాయిదా వేసింది. సోమవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తమ కుమారుడికి సీటు దక్కుతుందని తల్లిదండ్రులతోపాటు అతుల్‌కుమార్‌ కూశతో ఉన్నారు.

నిరుపేద కుటుంబం..
ఇదిలా ఉంటే అతుల్‌ కుమార్‌ది నిరుపేద కుటుంబం. ఉత్తరప్రదేశ్‌లోని టిటోరా గ్రామానికి చెందిన అతుల్‌ తల్లిదండ్రులు కూలీ పని చేస్తారు. అతుల్‌ తండ్రి రాజేంద్ర ఒక కర్మాగారంలో కూలీగా పనిచేస్తున్నాడు. నలుగురు అన్నదమ్ములలో అతుల్‌ చిన్నవాడు, వీరంతా కుటుంబ కష్టాలను ఎదుర్కొంటూ చదువులో రాణించారు. టిటోలీలో ఉన్నత పాఠశాల విద్యను, శిశు శిక్షా నికేతన్‌లో ఇంటర్మీడియట్‌ విద్యను పూర్తి చేసిన తర్వాత, అతుల్‌ కాన్పూర్‌లోని గెహ్లాట్‌ సూపర్‌ 100 ఇనిస్టిట్యూట్‌లో ఐఐటీ ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యాడు. అతుల్‌ తల్లి, రాజేష్‌ దేవి, కుటుంబం యొక్క కష్టాలను పంచుకున్నారు. వారు తమ పిల్లల చదువు కోసం అనేక వనరుల నుండి రుణాలు తీసుకున్నారని పేర్కొంది. సవాళ్లు ఉన్నప్పటికీ, నలుగురు సోదరులు తమ చదువులకు అంకితమయ్యారు. ఇద్దరు ఇంజనీరింగ్‌ డిగ్రీలు అభ్యసిస్తున్నారు, ఒకరు ఐఐటీ హమీర్‌పూర్‌ నుంచి మరొకరు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుతున్నారు. పిల్లల చదువులకు తల్లిండ్రులు అప్పులు చేశారు.