https://oktelugu.com/

Tirumala: నేడు తిరుమలకు సిట్.. టీటీడీ వర్గాల్లో టెన్షన్.. ఏం జరగనుంది?

ఏపీలో వరుస జరుగుతున్న పరిణామాలు ప్రకంపనలు రేపు తున్నాయి. ముఖ్యంగా లడ్డు వివాదం మరింత వివాదాస్పదం అవుతోంది. ముఖ్యంగా సిట్ దర్యాప్తు ప్రారంభం కానుండడంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

Written By:
  • Dharma
  • , Updated On : September 28, 2024 / 12:45 PM IST

    Tirumala(2)

    Follow us on

    Tirumala: తిరుమల లడ్డు వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ ఘటన జరిగింది. లడ్డు తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు బయట పెట్టిన సంగతి తెలిసిందే. గుజరాత్ కు చెందిన ఓ ల్యాబ్ నిర్ధారించినట్లు ఆయన వెల్లడించారు. అప్పటి నుంచి రచ్చ ప్రారంభం అయింది. వైసిపి హయాంలోనే ఈ ఘటన జరిగిందని తెలియడంతో ఆ పార్టీ కార్నర్ అయ్యింది. అయితే ఇదంతా రాజకీయ కుట్రగా అభివర్ణిస్తోంది వైసిపి. అప్పట్లో టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా వ్యవహరించిన వై వి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి స్పందించారు. దీనిని ఖండించారు. జగన్ సైతం స్పందించి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని ఆరోపణలు చేశారు. చంద్రబాబు పాప ప్రక్షాళన కోసం పూజలు చేయాలని వైసిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. తాను సైతం తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని.. దీనిపై మాట్లాడతానని జగన్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం జగన్ తిరుమల చేరుకోవాల్సి ఉంది. అయితే అక్కడకు కొద్ది గంటల ముందే తన పర్యటన రద్దు చేసుకున్నట్లు జగన్ ప్రకటించారు. అయితే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉండడం వల్లే జగన్ వెనక్కి తగ్గినట్లు విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే వైసిపికి ఇది డిఫెన్స్ పొజిషన్. ఇంకోవైపు నెయ్యి కల్తీపై విచారణకు ప్రభుత్వం అత్యున్నత దర్యాప్తు బృందాన్ని నియమించింది. దీనిపై సిట్ బృందం విచారణను ప్రారంభించింది.

    * ఈరోజు తిరుమలకు
    ఐపీఎస్ అధికారి సర్వ శ్రేష్ట త్రిపాఠి నేతృత్వంలో సిట్ బృందం ఏర్పాటైన సంగతి తెలిసిందే. నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ అత్యున్నత దర్యాప్తు బృందం ఈరోజు తిరుమలలో అడుగుపెట్టనుంది. మొత్తం తిరుమలను సందర్శించనున్నారు వీరు. టిటిడి ఈవో శ్యామలరావుతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కీలక విషయాలను రాబెట్టనున్నారు. టీటీడీ పరంగా గుర్తించిన లోపాల గురించి కూడా తెలుసుకోనున్నారు. దీంతో సిట్ ఎటువంటి విషయాలను గుర్తిస్తుంది? కేసు విచారణలో ఎటువంటి పురోగతి తీసుకొస్తుంది? అన్నది హాట్ టాపిక్ అవుతోంది.

    * టీటీడీ పటిష్ట చర్యలు
    ఇప్పటికే తిరుమలలో ప్రత్యేక చర్యలను ప్రారంభించింది టీటీడీ. లడ్డు వివాదం నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. ఎటువంటి లోపాలు తలెత్తకుండా ఈవో శ్యామలరావు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆగమ పండితులు, ఆలయ వర్గాలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఆలయ సంప్రోక్షణ సైతం చేశారు. ఇంకో వైపు నిన్న జగన్ తిరుమలలో పర్యటించే క్రమంలో డిక్లరేషన్ ఇవ్వాలని భావించారు. ముందుగానే అతిథి గృహానికి వెళ్లి డిక్లరేషన్ ఫారం ను అందించాలని భావించారు. అయితే జగన్ ఉన్నపలంగా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో టీటీడీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.

    * వారిలో ఆందోళన
    అయితే ఇంకో వైపు సీట్ దర్యాప్తు ప్రారంభం కావడంతో టీటీడీలోని అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అయితే కేవలం నెయ్యి కల్తీ పై ఈ బృందం విచారణ చేపడుతుందా? లేకుంటే గత వైసిపి పాలకులు చేసిన తప్పిదాలను సైతం వెలికి తీస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే టీటీడీపై విజిలెన్స్ విచారణను నిలిపివేయాలంటూ ఇప్పటికే పూర్వ అధ్యక్షుడు వై వి సుబ్బారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ తరుణంలో సిట్ బృందం తిరుమలలో అడుగుపెట్టనుండడం అందరిలోనూ ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. ఎటువంటి విషయాలు బయట పడతాయో నన్న చర్చ నడుస్తోంది.