TDP And Janasena Alliance: తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీ పై తప్పకుండా చూపుతుంది. అక్కడ వచ్చే ఫలితాలు ఏపీ ఫై చూపుతాయి. గత ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా వెల్లడి అయ్యింది. గత ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసిన టిడిపి దారుణంగా దెబ్బతింది.కాంగ్రెస్తో జత కలిసింది. అయినా సరే రెండు స్థానాలకు పరిమితమైంది. కెసిఆర్ కు కయ్యం పెరిగింది. అదే 2019 ఎన్నికల్లో ఓటమికి కారణమైంది.
తెలంగాణలో నాయకులు వెళ్ళిపోయినా.. టిడిపిని అభిమానించే క్యాడర్ ఉంది. సెటిలర్స్ తోపాటు కమ్మ సామాజిక వర్గం ఇప్పటికీ తెలుగుదేశం పార్టీని అనుసరించి తెలంగాణలో ముందుకు సాగుతుంది. తెలంగాణలో పార్టీ అచేతనంగా మారడంతో ఏపీలో టిడిపి అభిమతం కు తగ్గట్టు తెలంగాణలో క్యాడర్ వ్యవహరిస్తూ వస్తోంది. టిడిపి తెలంగాణలో గెలవకపోయినా.. ఇతర పార్టీల గెలుపోటములను నిర్దేశించే స్థాయిలో ఉంది. అందుకే టిడిపి నేరుగా పోటీ చేయడం కంటే.. సర్దుబాటుతో ముందుకు సాగడమే మేలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడిందన్న కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు మరోసారి అలా చేస్తే ప్రతికూలత ఎదురు కావడం ఖాయమని తెలుస్తోంది.
ఖమ్మం, హైదరాబాద్ తో పాటు సెటిలర్స్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో తమకు బలం ఉందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అటు జనసేన సైతం అదే అభిప్రాయంతో ఉంది. దాదాపు 32 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఇలా ఎవరికివారుగాపోటీ చేయడం కంటే.. టిడిపి, జనసేనలు సంయుక్తంగా ఓ 30 నియోజకవర్గాల్లో పై ఫోకస్ పెడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. తెలంగాణలో ఐదు నుంచి పది స్థానాలు దక్కించుకుంటే… ఆ ఊపు ఏపీ పై పడే ప్రభావం అధికం. కానీ ప్రస్తుతం ఎవరికి వారుగా అభ్యర్థులను ప్రకటించడంతో రెండు పార్టీల శ్రేణుల్లో అయోమయం నెలకొంది.
మరోవైపు పార్టీలు పోటీకి దూరంగా ఉండటమే మేలని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పటికే అక్కడ త్రిముఖ పోరు నెలకొంది. అన్ని పార్టీలకు ఇప్పుడు టిడిపి, జనసేనల అవసరం ఉంది. కాంగ్రెస్, బిజెపిలో నేరుగా మద్దతును కోరుతున్నాయి. బిఆర్ఎస్ మాత్రం సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో ఈ రెండు పార్టీలు పోటీ చేయాలని భావిస్తోంది. అదే జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి.. సానుకూల ఓట్లతో గట్టెక్కాలని చూస్తోంది. అందుకే టిడిపి, జనసేన వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది. ఒకటి కలిసి పోటీ చేసి గణనీయమైన ఓట్లు, సీట్లు దక్కించుకుంటే ఏపీలో ఊపు వచ్చే అవకాశం ఉంది. లేకుంటే ఏపీలో ఎన్నికల ప్రయోజనాలను ఆశించి.. బిజెపి, కాంగ్రెస్లో ఏదో ఒక పార్టీకి బాహటంగా మద్దతు తెలిపితే ప్రయోజనం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఆ రెండు పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.