Hakimpet Sports School Issue: హకీం పేట స్పోర్ట్స్ స్కూల్ ఓ ఎస్ డీ గా పనిచేసిన హరికృష్ణ ఉదంతం క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ముందే తెలుసా? ఆరు నెలల క్రితమే దీనికి సంబంధించి సమాచారం తెలిసినప్పటికీ ఆయన పట్టించుకోలేదా? మంత్రి సొంత పెత్తనం వల్ల కెసిఆర్ ఆగ్రహం గా ఉన్నారా? అంటే ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానాలు వస్తున్నాయి. ఆ స్పోర్ట్స్ స్కూల్లో సిరిసిల్లకు చెందిన అబ్బాడి అనిల్ కమార్ రెడ్డి తన మిత్రుడు భాగస్వామిగా మెస్ ను నిర్వహించాడు. అప్పుడు హరికృష్ణ లీలలను ఆయన దగ్గరుండి చూశాడు.. ఈ విషయాలను అనిల్ కుమార్ రెడ్డి మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి 6 నెలల క్రితమే తీసుకెళ్లారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు చెబుతాను అంటే ” నీ ఇష్టం వచ్చింది చేసుకో” అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది.
హకీం పేట స్పోర్ట్స్ స్కూల్ లో హరికృష్ణ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కవిత స్పందించారు. నిందితుడి పై చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ట్విట్టర్ ద్వారా ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే ఈ ట్వీట్ ను అనిల్ కుమార్ రెడ్డి రీ ట్వీట్ చేశారు.” అక్కా హరికృష్ణ వ్యవహారంపై నేను ఆరు నెలల క్రితమే శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లాను. ఇదే విషయాన్ని కేటీఆర్, కెసిఆర్ కు చెబుతాను అంటే నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అని బెదిరించాడు..అక్కా.. శ్రీనివాస్ గౌడ్ పెద్ద దొంగ.. అతని మాటలు నమ్మొద్దు” అంటూ రీ ట్వీట్ చేశాడు.

అనిల్ కుమార్ రెడ్డి హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో తన మిత్రులతో కలిసి కొద్ది నెలల కిందటి వరకు మెస్ నిర్వహించాడు. ఆ సమయంలో హరికృష్ణ ప్రవర్తన, వ్యవహార శైలి గురించి తెలుసుకున్నాడు. “ఇద్దరు అనుచరులను ఏర్పాటు చేసుకొని పాఠశాలలో జిమ్, ఆర్చరీ ప్రాక్టీస్ చేసే ప్రాంతాల్లో రాత్రి వేళల్లో మద్యం తాగేవాడు. మద్యం తాగిన తర్వాత మెస్ వద్దకు వెళ్లి చికెన్ వండండి, మటన్, చేపలు తెప్పించండి అంటూ వంట చేసే వాళ్ళతో గొడవ పడేవాడు. వంట చేసే సిబ్బందితో అభ్యంతరకరమైన రీతిలో వ్యవహరించేవాడు. ఒక్కోసారి వాళ్లను కొట్టేవాడు..మెస్ లో వంట సామాన్లను చెల్లాచెదురు చేసేవాడు. రాత్రి వేళల్లో బాలికల హాస్టల్ లో కూడా తిరిగేవాడు. ఈ విషయాలను మంత్రి దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోలేదు. పాఠశాల ప్రాంగణంలో సిసి ఫుటేజ్ పరిశీలిస్తే అన్ని బయటపడతాయి. ప్రస్తుతం విచారణ జరుపుతున్న కమిటీ ముందు హాజరై జరిగిన విషయాలు మొత్తం చెబుతానని” అనిల్ కుమార్ రెడ్డి చెబుతున్నాడు. కాగా ఈ ఉదంతంలో రోజుకో విషయం వెలుగులోకి వస్తుండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడా శాఖ మంత్రి మీద ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తున్నది. మరికొద్ది నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.