Homeఎన్నికలుLok Sabha Election: 13 రాష్ట్రాలు.. 89 నియోజకవర్గాలు.. నేడే లోక్సభ రెండో దశ పోరు

Lok Sabha Election: 13 రాష్ట్రాలు.. 89 నియోజకవర్గాలు.. నేడే లోక్సభ రెండో దశ పోరు

Lok Sabha Election: పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా రెండో దశ ఎన్నికలు శుక్రవారం(ఏప్రిల్‌ 26న) ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 89 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలిదశ పోలింగ్‌ ఏప్రిల్‌ 19న 102 లోక్‌సభ స్థానాలకు జరిగింది. తొలి దశ పూర్తి చేసుకున్న రాష్ట్రాల్లో రెండో దశ పోలింగ్ జరుగుతోంది. కొత్తగా మరికొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ విస్తృత ఏర్పాట్లు చేసింది.

89 నియోజకవర్గాల్లో పోలింగ్
రెండో దశ ఎన్నికల్లో భాగంగా 89 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గాల్లో 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 55, కాంగ్రెస్‌ 18 సీట్లు గెలుచుకున్నాయి. ఐదేళ్ల క్రితం గెలిచిన సీట్లను బీజేపీ తిరిగి నిలబెట్టుకుంటుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఇక ఈ 89 సీట్లలో 9 ఎస్సీ, 7 ఎస్టీ రిజర్వుడు సీట్లు కూడా ఉన్నాయి. ఇక 2019లో ఈ స్థానాల్లో ఎన్డీయే కూటమి 61 సీట్లు గెలుచుకోగా, యూపీఏ(ప్రస్తుతం ఇండియా) కూటమి 23 సీట్లు గెలుచుకుంది. అప్పటికీ.. ఇప్పటికీ పరిస్ధితులు మారాయి.

బరిలో 1,210 మంది అభ్యర్ధులు..
ఇక రెండో దశ పోలింగ్‌ జరుగుతున్న 89 సీట్లలో మొత్తం 1,210 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ దశలో బీఎస్పీ అత్యధికంగా 74 మందిని నిలబెట్టగా, బీజేపీ 69, కాంగ్రెస్ 68 మంది అభ్యర్థులను నిలబెట్టాయి. కర్ణాటకలో 14 స్థానాల్లో అత్యధికంగా 247 మంది అభ్యర్థులు, మహారాష్ట్ర(8 సీట్లు) 204 మంది పోటీలో ఉన్నారు. కేరళలోని మొత్తం 20 సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా 189 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు.

బ‌రిలో ప్రముఖులు…
రెండో దశ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇందులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. ఆయన కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేస్తున్నారు. రెండోసారి కూడా అక్కడి నుంచి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. రాహుల్ గాంధీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్‌ను పోటీకి దింపింది. సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా కూడా పోటీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతోపాటు వయనాడ్‌లోనూ పోటీ చేశారు. అమేథీలో ఓడిపోగా, వయనాడ్‌లో గెలిచారు.

– ప్రముఖ నటి, బీజేపీ నేత హేమమాలిని కూడా ఈ దశలో పోటీలో ఉన్నారు. ఉత్తర్ప్రదేశ్‌లోని మథుర నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లోనూ మథుర నుంచి గెలిచారు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ ధంగర్‌ పోటీ చేస్తున్నారు.

– రామాయణం సీరియల్‌లో రాముడి పాత్ర పోషించిన ప్రముఖ టీవీ నటుడు అరుణ్ గోవిల్ ఉత్తరప్రదేశ్‌లోని మీరఠ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రెండో దశలో ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయన బీజేపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. బీఎస్పీకి చెందిన దేవవ్రత్ కుమార్ త్యాగి, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సునీతావర్మ ఈ స్థానంలో అరుణ్ గోవిల్‌తో తలపడుతున్నారు.

ఇతర కీలక అభ్యర్థులు
రెండో విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇతర కీలక నేతల జాబితాలో కాంగ్రెస్ కీల‌క నేత శశిథరూర్ (తిరువనంతపురం), రాజీవ్ చంద్రశేఖర్(తిరువనంతపురం), ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ (రాజ్‌నంద్‌గావ్), డీకే.సురేష్ (బెంగళూరు గ్రామీణం), కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్(జోధ్‌పుర్), లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(కోటా), వంచిత్ బహుజన్ అఘాడీ చీఫ్ ప్రకాశ్ అంబేడ్కర్(అకోలా), బీజేపీ బంగాల్ అధ్యక్షుడు సుకాంత మజుందార్(బాలూర్‌ఘాట్), అనిల్ ఆంటోనీ (పతనంతిట్ట), తేజస్వి సూర్య(బెంగళూరు దక్షిణం), హెచ్‌డీ.కుమార్ స్వామి(మాండ్యా), వైభవ్ గెహ్లత్(జలోర్), శోభ కరంద్లాజే (బెంగళూరు ఉత్తరం) నుంచి పోటీలో ఉన్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version