Ganta Srinivasa Rao: గంటాకు అదే సీటు ఫైనల్

గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గంటా గెలుపొందారు. ఈసారి పొత్తులో ఆ నియోజకవర్గాన్ని బిజెపికి కేటాయించారు. గంటా శ్రీనివాసరావు భీమిలి అసెంబ్లీ స్థానాన్ని కోరారు.

Written By: Dharma, Updated On : March 23, 2024 4:22 pm

Ganta Srinivasa Rao

Follow us on

Ganta Srinivasa Rao: గంటాను టిడిపి వదులుకోలేదా? టిడిపిని గంటా వదులుకోలేరా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ మూడు జాబితాలను ప్రకటించింది. కానీ అందులో గంటా పేరు లేదు. అలాగని ఆయన ఆశిస్తున్న భీమిలి నియోజకవర్గం పేరును సైతం ప్రకటించలేదు. దీంతో ఇంకా గంటాకు ఒక ఆప్షన్ ఉంది. చంద్రబాబు గంటా శ్రీనివాసరావు చీపురుపల్లి వెళ్లాలని సూచించారు. కానీ ఆయన అందుకు అంగీకరించలేదు. తనకు ఇష్టమైన భీమిలి టిక్కెట్ ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. దీంతో చంద్రబాబు సైతం గంటా విషయంలో పునరాలోచనలో పడ్డారు. ఆయన విషయంలో సీరియస్ గా ఆలోచిస్తున్నారు.

గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గంటా గెలుపొందారు. ఈసారి పొత్తులో ఆ నియోజకవర్గాన్ని బిజెపికి కేటాయించారు. గంటా శ్రీనివాసరావు భీమిలి అసెంబ్లీ స్థానాన్ని కోరారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించినందున గెలుపు అవకాశము ఉంటుందని గంటా ఆలోచన చేశారు. కానీ చంద్రబాబు మాత్రం ఆయనతో చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని చూశారు. అందుకు గంటా ఇష్టపడలేదు. విశాఖ జిల్లా దాటి వెళ్ళేందుకు ఆయన మొగ్గుచూపడం లేదు.ఇదో సమస్యగా మారింది.

1999లో తొలిసారిగా గంటా ఎంపీగా పోటీ చేశారు.అటు తరువాత వచ్చిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలో దిగారు.అయితే ఒకసారి పోటీ చేసే నియోజకవర్గంలో మరోసారి బరిలో దిగరు. ఇప్పటివరకు చోడవరం, అనకాపల్లి, భీమిలి,విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రి పదవి కూడా చేపట్టారు. అయితే ఈసారి భీమిలి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నిక అవుతానని గట్టిగా చెబుతున్నారు. అయితే పొత్తులో భాగంగా భీమిలి సీటును జనసేనకు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే గంటాను చీపురుపల్లి వెళ్లాలని చంద్రబాబు సూచించారు. అందుకు అయిష్టత చూపడంతో భీమిలిలో గంటా విషయంలో చంద్రబాబు సర్వే చేయించినట్లు సమాచారం. అందులో గంటాకు అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. దీంతో భీమిలి అసెంబ్లీ సీటును గంటాకు కేటాయించడం దాదాపు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. నాలుగో జాబితాలో ఆయన పేరు పక్కాగా ఉంటుందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.

అయితే చీపురుపల్లి విషయంలో ఎలా ముందుకు వెళ్తారు అన్నది తెలియాల్సి ఉంది. అక్కడ ఇన్చార్జిగా కిమిడి నాగార్జున ఉన్నారు. గంటా అక్కడకు వెళ్లేందుకు నిరాకరించడంతో కళా వెంకట్రావును పంపిస్తారని ప్రచారం జరుగుతోంది. కళా వెంకట్రావు ఎచ్చెర్ల టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఆ సీటును పొత్తులో భాగంగా బిజెపికి ఇచ్చి.. కళా వెంకట్రావును చీపురుపల్లి లో సర్దుబాటు చేస్తారని తెలుస్తోంది. మొత్తానికైతే ఈ ఎపిసోడ్ లో గంటా శ్రీనివాసరావు తాను అనుకున్నది సాధించుకున్నారు. తాను ఆశించిన భీమిలి సీటును దక్కించుకున్నారు.