Rupee Value: మన రూపాయి విలువ కొన్ని రోజులుగా ఆల్‌టైమ్ కనిష్టస్థాయి పడిపోయింది. 90 మార్కును తాకింది. దీంతో మన ఎగుమతులపై ప్రభావం పడుతోంది. అయితే ఇదే సమయంలో మన ఫారెక్స్ నిల్వలు పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం, డిసెంబర్ 5తో పూర్తయిన వారంలో విదేశీ మారక నిల్వలు 1.033 బిలియన్ డాలర్ల వృద్ధితో 687.26 బిలియన్ డాలర్లకు చేరాయి. ముఖ్య కారణం బంగారం నిల్వలు 1.19 బిలియన్ డాలర్లు కలుపుకుని 106.98 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే, ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 151 మిలియన్ డాలర్లు క్షీణించి 556.88 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఈ నిల్వలు సెప్టెంబర్‌లోని చారిత్రక గరిష్ఠం 704.89 బిలియన్ డాలర్లకు సమీపంలో ఉండి, 11 నెలల దిగుమతులను పుదినపెట్టే స్థితిలో ఉన్నాయి.
అమెరికా ఫెడ్ కట్‌తో బంగారం, వెండి జోష్..
డిసెంబర్ 10న అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీలను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 3.5–3.75%కి నిర్ణయించడంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి రేట్లు గణనీయంగా పెరిగాయి. అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ ధర డిసెంబర్ 12 నాటికి ఔన్స్‌కు 4,338 డాలర్లకు చేరి ఏడు వారాల శిఖరాన్ని తాకింది. భారతదేశంలో డిసెంబర్ 13న 24 క్యారట్ బంగారం గ్రాముకు రూ.13,321కు ట్రేడైంది. రూపాయి మృదుత్వం, పెట్టుబడుల ఆకర్షణ కొనసాగడం ఈ ధరలకు మంచి మద్దతుగా నిలిచాయి.
వెండి ధరల్లో దూకుడు..
దేశీయ వెండి ధరలు వేగవంతమైన పునరుద్ధరణ చూపుతున్నాయి. డిసెంబర్ 13న గ్రాముకు రూ.204.10 (కిలోకు రూ.2,04,100)గా నమోదైంది. వారం క్రితం రూ.1.87 లక్షల నుంచి గణనీయ పెరుగుదల నమోదైంది. సౌర శక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల డిమాండ్, సరఫరా కొరతలు ఈ ర్యాలీకి కారణాలు.
రూపాయి బలహీనతతో ఒత్తిడి..
డాలర్‌తో పోలిస్తే రూపాయి 90 మార్క్‌ను దాటి 2025లో 5%కి అధికంగా క్షీణించి ఆసియా బలహీన కరెన్సీగా మారింది. ఇది దేశీయ లోహ ధరలను మరింత భారీగా చేస్తోంది. అయినప్పటికీ, ప్రపంచ ఆర్థిక అస్థిరతల్లో పెట్టుబడిదారులు ఈ లోహాలను సురక్షిత ఆస్తులుగా ఎంచుకుంటున్నారు.