Telangana Election Results 2023: తెలంగాణలో ముచ్చటగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని కెసిఆర్ భావించారు. కానీ ఆయన ఒకటి తెలిస్తే.. తెలంగాణ ప్రజలు మరొకటి తలిచారు. హ్యాట్రిక్ ప్రయత్నాన్ని గండి కొట్టారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు ఎన్నికల్లో సెంటిమెంట్ మాటలతో ఆకట్టుకున్న కేసీఆర్.. ఈసారి మాత్రం ఆ ప్రయత్నంలో దెబ్బతిన్నారు. దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అయితే ఈ అపజయానికి మాత్రం ముమ్మాటికి కేసీఆర్ వైఖరే కారణం.
బీఆర్ఎస్ ఓటమికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ పేరు మార్పు ఓటమికి ప్రధాన కారణమని ఎక్కువమంది భావిస్తున్నారు. అతి విశ్వాసంతో ఎన్నికలకు ఏడాది ముందే టిఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు. జాతీయ రాజకీయాలను శాసిస్తామని ప్రగల్బాలు పలికారు. ఓటమికి ఇదే తొలి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెంటిమెంట్ గా ఉన్న టిఆర్ఎస్ పేరును మార్చడం తొలి తప్పిదంగా చెబుతున్నారు.
కెసిఆర్ ఓటమికి మరో కారణం యువత ఆగ్రహం. రాష్ట్రంలో మెజారిటీ నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. సరైన విధానంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, టిఎస్పిఎస్సి లో పేపర్ లీకులు, లోపాలు వెలుగు చూడడం.. వాటిని డీల్ చేయడంలో కెసిఆర్ సరిగ్గా శ్రద్ధ చూపలేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల్లో ఆగ్రహానికి ఇదొక కారణంగా మారింది.విద్యార్థులకు చికాకు పెట్టడంతో కెసిఆర్ మూల్యం చెల్లించుకున్నారు.
రాష్ట్రంలో అవినీతి భారీగా పెరిగింది. ఎన్నో కోట్లు పెట్టి నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం అతి పెద్ద దెబ్బ. అవినీతి అక్రమాల కారణంగానే ప్రాజెక్టు కృంగిపోయిందని ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు గట్టిగా నమ్మారు. ఇక అన్ని శాఖల్లో అవినీతి పెరిగింది. ముఖ్యంగా భూ సమస్యలు పెరిగిపోయాయి. ధరణి వంటి పథకం దారుణంగా దెబ్బతినడం కూడా కెసిఆర్ పరపతి తగ్గింది.
సంక్షేమ పథకాల అమలు విషయంలో కెసిఆర్ జాప్యం చేశారు. ఎన్నికల ముంగిట చాలా రకాల పథకాలకు శ్రీకారం చుట్టారు. దళిత బంధు వంటి పథకం దక్కని వారు వ్యతిరేకులుగా మారిపోయారు. వికలాంగులకు పెన్షన్ పెంచడం, లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు వంటి అంశాలు ఎన్నికల ముంగిట ప్రారంభించడం కూడా మైనస్ గా మారింది. 2018లో గెలిచిన తర్వాత ఈ పథకాలన్నీ ప్రారంభించి ఉంటే కొంత మైలేజ్ దక్కేది. వీటన్నింటికీ తోడు కేసీఆర్ ఒంటెద్దు పోకడలో ప్రజల్లో వ్యతిరేకత కారణమైంది. కీలక నేతలు పార్టీని విడిచిపెట్టి వెళ్లడం కూడా కోలుకోలేని దెబ్బతీసింది. ఇవన్నీ కెసిఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఓటమికి కారణాలే.