Srikanth Bharat: ఏపీలో కల్తీ మద్యం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఓ సినీ నటుడు తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఏపీలో నాసిరకం మద్యం సరఫరా అవుతుందన్న విమర్శ ఎప్పటినుంచో ఉంది. ఆ మధ్యన ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఏపీలోని కల్తీ మద్యం బారిన పడే ప్రాణాలు పోగొట్టుకున్నారు అన్న ప్రచారం జరిగింది. బూమ్ బూమ్ బీర్లు తాగడం వల్లే.. రక్త విరోచనాలతో ఆయన చనిపోయారని వార్తలు వచ్చాయి. అయితే వివిధ దీర్ఘకాలిక వ్యాధుల వల్లే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది. తాజాగా మరో నటుడు శ్రీకాంత్ భరత్ ఏపీ మద్యంపై హాట్ కామెంట్స్ చేశారు.
ఇటీవల శ్రీకాంత్ భరత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. ప్రతిరోజు పండగే వంటి హిట్ చిత్రాల్లో నటించారు. పలు వెబ్ సిరీస్ లో సైతం యాక్ట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. అయితే ఆయన విజయవాడలో చేసిన తాజా కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. తనకు మద్యం తాగే అలవాటు ఉందని.. అందుకే బూమ్ బూమ్ బీర్ తెచ్చి తాగుతున్నానని.. తన ప్రాణానికి హాని ఉందని.. గతిలేక ఈమద్యం తాగుతున్నానని కన్నీటి పర్యంతమవుతూ చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
ఏపీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారు అన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దేశంలో ఎక్కడా వినని బ్రాండ్లు ఏపీలో దర్శనమిస్తున్నాయని విపక్షాలతో పాటు సామాన్య జనాల నుంచి సైతం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజుల కిందట రాకేష్ మాస్టర్ మృతితో ఏపీ మద్యంపై రకరకాల ప్రచారం జరిగింది. అది మరువక ముందే మరో సినీ నటుడు శ్రీకాంత్ భరత్ తాజాగా చేసిన కామెంట్స్ మాత్రం హీట్ పుట్టిస్తున్నాయి. అయితే ఆయన ఏ ఉద్దేశ్యంతో ఈ కామెంట్స్ చేశారో కానీ.. సోషల్ మీడియాలో మాత్రం నెటిజెన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.