Uttarandhra Janasena
JanaSena: జనసేన శ్రేణులు ఒకరకమైన ఆవేదనతో గడుపుతున్నారు. పార్టీ గ్రాఫ్ పెరిగిందని ఆనందించాలో.. దానిని తనకు అనుకూలంగా టిడిపి మలుచుకోవడంతో బాధపడాలో అర్థం కావడం లేదు.అధినేత ఆదేశాలు పాటిస్తూ మౌనంగా బాధపడడం జనసైనికుల వంతు అయ్యింది. పవన్ తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటన వెనుక టిడిపి వ్యూహం ఉందని అనుమానం ఉంది. ఒత్తు వల్ల అత్యధికంగా టిడిపి లాభం పొందితే.. నష్టపోయేది జనసేన అని సగటు అభిమానికి తెలుసు. ఆ రెండు పార్టీల సమన్వయ సమావేశాల్లో సాగుతున్న వ్యవహారం చూస్తే జనసైనికులకు తత్వం బోధపడుతోంది. కనీసం తమ పక్కనే జనసేన నేతలను కూర్చోబెట్టుకోవడానికి కూడా టిడిపి నేతలు ఇష్టపడడం లేదు. అటువంటప్పుడు పొత్తు ఎందుకని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీది విష కౌగిలి అని మెజారిటీ జనసేన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. జనసేనతో కలిసి కేవలం కార్యక్రమాలకే పరిమితం కావాలని టిడిపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని అనుమానిస్తున్నారు. సీట్ల సంఖ్య, నియోజకవర్గాల కేటాయింపు అంశాలు ఎన్నికల ముందేనని టిడిపి చెబుతోంది. కానీ ఎక్కడికి అక్కడే అభ్యర్థులను అంతర్గతంగా ప్రకటిస్తోంది. అటు సమన్వయ కమిటీ సమావేశాల్లో జరుగుతున్న వివాదాల విషయంలో సైతం టిడిపి స్పందన భిన్నంగా ఉంది. జనసేన నాయకత్వం మాత్రం శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తోంది. ఎటువంటి వివాద అంశాల జోలికి పోవద్దని సూచిస్తోంది. కానీ టిడిపి అధినాయకత్వం మాత్రం కనీసం స్పందించడం లేదు. దీనినే జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు.
వాస్తవానికి రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిన సీట్ల వ్యవహారాన్ని కదిలిస్తే ఐక్యత దెబ్బతింటుందని.. ముందు కలిసి పని చేసే వాతావరణం ఏర్పడితే.. తరువాత సీట్ల సర్దుబాటు సునాయాసంగా జరిగిపోతుందని రెండు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి. అయితే అధినాయకత్వాల స్థాయిలో బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. అయితే టిడిపి ఎక్కడికి తన అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో జనసేన విషయానికి వస్తే మాత్రం ఎన్నికల ముంగిట తేల్చుకుంటామని చెబుతుండడం విశేషం. దీని వెనుక టిడిపి కుట్ర ఉందని జన సైనికులు అనుమానిస్తున్నారు.
అయితే ఇన్ని అవమానాలు పడి పొత్తు కుదుర్చుకోవడం అవసరమా అన్న ప్రశ్న జనసేన నుంచి వినిపిస్తోంది. నాయకత్వం మాత్రం పొత్తు ధర్మం విఘాతం కలిగించే ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. జనసేన పై అభిమానం ఉంటే సీట్ల కేటాయింపు? వంటి వాటిపై స్పష్టత ఇవ్వచ్చు కదా? అని జనసేన నాయకులు కోరుతున్నారు. ఎన్నికల వరకు నాన్చితే అది అంతిమంగా జనసేనకు నష్టం చేకూరుస్తుందని.. అటువంటప్పుడు పొత్తు ఉన్నా.. లాభం కంటే నష్టం అధికమని జనసైనికులు భావిస్తున్నారు. హై కమాండ్ కు ఇదే విషయాన్ని చెబుతున్నారు. కానీ అధినాయకత్వం నుంచి ఎటువంటి భరోసా దక్కకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.