Telangana Teachers: ఏడాది క్రితం పూర్తి చేస్తామన్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. రాష్ట్రంలో సుమారు 72 వేల మంది టీచర్లు బదిలీల కోసం, మరో 10 వేల మంది పదోన్న తుల కోసం ఎదురుచూస్తున్నారు. ఎనిమిదేళ్లుగా పదోన్నతులు, ఐదేళ్ల నుంచి బదిలీలు లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో వేసవి సెలవుల్లో పదోన్నతులు, బదిలీలు నిర్వహిస్తామని గత ఏడాది మార్చిలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. మన ఊరు–మన బడి కార్యక్రమం ప్రారంభం సందర్భంగా వనపర్తిలో, తర్వాత అసెంబ్లీలో కూడా ఈ ప్రకటన చేశారు. అయితే గత ఏడాది వేసవి వెళ్లి పోయింది. ఈ ఏడాది వేసవి సెలవులు కూడా పూర్తి కావస్తున్నాయి. అయినా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
రాష్ట్రంలో ఇలా..
రాష్ట్రంలో సుమారు 1,970 హెచ్‌ఎం, మరో 2,400 ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎం, 8,270 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 70% పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. పదోన్నతులు, సాధారణ బదిలీలతో మొత్తం 10 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2015లో ఉపాధ్యాయులు పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టారు. తర్వాత 2018లో కేవలం బదిలీలు మాత్రమే చేశారు. సాధారణంగా రెండేళ్లకోసారి బదిలీలు నిర్వహించాల్సి ఉంటుంది. ఖాళీలను బట్టి ఎప్పటి కప్పుడు పదోన్నతులు కల్పించాలి. కానీ ఆ దిశగా ప్రక్రియే చేపట్టడంలేదు. సీఎం ప్రకటన అనంతరం టీచర్ల బదిలీల కోసం ఈ ఏడాది జనవరి 25న ప్రత్యేక (జీవో 5) ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ఏకకాలంలో చేపట్టడానికి వీలుగా మార్గదర్శకాలు విడుదల చేశారు.
భారీగా దరఖాస్తులు..
బదిలీల కోసం సుమారు 72 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. పదోన్నతుల కోసం సుమారు 9,500 నుంచి 10 వేల పోస్టులను గుర్తించారు. ఈ ప్రక్రియ కొన సాగుతుండగానే కొందరు కోర్టుకెళ్లారు. ముఖ్యంగా స్పౌజ్‌లకు ప్రత్యేక పాయింట్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నాన్ స్పౌజ్‌లు కోర్టును ఆశ్రయించారు. దీంతో బది లీలు, పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది.
సంఘాలతో చర్చించని సర్కార్..
బదిలీలు, పదోన్నతుల మార్గదర్శకాలపై కోర్టు స్టే ఇచ్చిన వెంటనే ప్రభుత్వం చేయాల్సిన పని ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపడం. కానీ, తెలంగాణ సర్కార్ ఇప్పటి వరకు ఆ దిశగా అడుగు వేయలేదు. ఇదే ప్రభుత్వానికి బదిలీలు, పదోన్నతులపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. కోర్టు కేసులతో సంబంధం లేని, వివాదాల్లేని మోడల్ స్కూళ్లు, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో పదోన్నతులను పూర్తి చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రభుత్వానికి ఉపాధ్యాయుల పదోన్నతి, బదిలీ అంశం గుర్తుకు వస్తుందన్నారు. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కేసీఆర్.. ఆచరణలో మాత్రం చూడం లేదని విమర్శిస్తున్నారు.