https://oktelugu.com/

PM Modi : మోడీ చొరవ.. ఆ రాష్ట్రం లో తొలిసారిగా రైల్వే స్టేషన్ నిర్మాణం

చైనాకు సరిహద్దు రాష్ట్రంగా ఉండటం.. అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో భారత్ ఈ రాష్ట్రంపై దృష్టి పెట్టింది. ఇక్కడ వందల కోట్లతో విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. రైల్వే స్టేషన్, ట్రాక్ నిర్మాణం ద్వారా ఈ ప్రాంతానికి దేశంతో కనెక్టివిటీ ఏర్పడుతుందని కేంద్రం భావిస్తోంది. తద్వారా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అంచనా వేస్తోంది.

Written By:
  • NARESH
  • , Updated On : February 26, 2024 5:39 pm
    Follow us on

    PM Modi : మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు కావస్తోంది. ఇప్పటికీ ఆ రాష్ట్రానికి రైల్వే స్టేషన్ లేదు. ఈశాన్య ప్రాంతంలో చైనాకు సరిహద్దుల్లో ఉండే ఆ రాష్ట్రం.. మన దేశానికి అత్యంత ముఖ్యమైనది. కీలకమైన నదులు ఆ రాష్ట్రం మీదుగానే ప్రవహిస్తూ ఉంటాయి. అయితే అలాంటి రాష్ట్రంలో ఇంతవరకు రైల్వే స్టేషన్ లేదు. అక్కడి ప్రజలు రైలును ప్రత్యక్షంగా చూసిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆ రాష్ట్రం రూపురేఖలు మార్చేందుకు సంకల్పించారు.. ఇప్పటిదాకా రైల్వే స్టేషన్ లేని రాష్ట్రంగా ఉన్న అపప్రదను తొలగించే ప్రయత్నం చేశారు.

    ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం గుజరాత్లో విస్తృతంగా పర్యటించారు.. సుదర్శన్ సేతు అనే వంతెనను ప్రారంభించారు. ఇంకా వేలాది కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సోమవారం కూడా ఆయన గుజరాత్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా రైల్వేలకు సంబంధించి వేలాది కోట్ల పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ జాబితాలో ఇప్పటివరకు రైల్వే స్టేషన్ లేని రాష్ట్రంగా ఉన్న సిక్కింలో.. ఇకముందు రైలు సర్వీసులు ప్రారంభమవుతాయి. సిక్కిం లో తొలి రైల్వే స్టేషన్ రంగ్ – పో నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. 3 దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారు. మొదటి దశలో రంగ్ పో నుంచి సివోక్, రెండో దశలో రంగ్ పో నుంచి గ్యాంగ్ టక్, మూడో దశలో గ్యాంగ్ టక్ నుంచి నాథులా వరకు రైల్వే ట్రాక్ లు, వంతెనలు, సొరంగాలు నిర్మిస్తారు. ఈ ఏడాది చివరి నాటికి వీటి నిర్మాణం పూర్తి చేయాలని భావించినప్పటికీ.. సిక్కిం ప్రాంతంలో ఉన్న పర్యావరణ అననుకూల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వచ్చే ఏడాది లోగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

    ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం.. ఇప్పటివరకు భారతీయ రైల్వే నెట్వర్క్ లేని ప్రాంతంగా ఉంది. ఈ రాష్ట్రానికి వెళ్లాలంటే కేవలం రోడ్డు మార్గమే దిక్కు. రాంగ్ పో – సివోక్ రైలు ప్రాజెక్టు మొత్తం పొడవు 44.96 కిలోమీటర్లు. ఇందులో 38.65 కిలోమీటర్లు సొరంగాలు, 2.24 కిలోమీటర్లు వంతెనలు ఉన్నాయి. ఇక ఈ ట్రాక్ నిర్మాణానికి సంబంధించిన పనులు వచ్చే నెలలో ప్రారంభమవుతాయి. ఈ లైన్ లో మొత్తం 14 సొరంగాలు నిర్మిస్తారు. అందులో 5.30 కిలోమీటర్ల మేర ఒక భారీ సొరంగాన్ని నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. చైనాకు సరిహద్దు రాష్ట్రంగా ఉండటం.. అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో భారత్ ఈ రాష్ట్రంపై దృష్టి పెట్టింది. ఇక్కడ వందల కోట్లతో విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. రైల్వే స్టేషన్, ట్రాక్ నిర్మాణం ద్వారా ఈ ప్రాంతానికి దేశంతో కనెక్టివిటీ ఏర్పడుతుందని కేంద్రం భావిస్తోంది. తద్వారా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అంచనా వేస్తోంది.