F-35 Fighter
F-35 Fighter : 2025 నుండి అమెరికా భారతదేశానికి సైనిక పరికరాల అమ్మకాలను పెంచుతుందని, అత్యంత ప్రమాదకరంగా భావించే F-35 యుద్ధ విమానాలను అందిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, ఈ విషయంలో ట్రంప్ ఎటువంటి కాలపరిమితిని విధించలేదు. ఈ ప్రకటన భారతదేశం, అమెరికా మధ్య పెరుగుతున్న సైనిక సహకారాన్ని ప్రతిబింబిస్తుంది. భారతదేశం ఈ ఆఫర్‌ను అంగీకరిస్తే దాని ఆయుధశాలలో F-35ని జోడించిన మొదటి నాటోయేతర, పసిఫిక్యేతర అమెరికా మిత్రదేశంగా అవతరిస్తుంది. ఇది దాని వైమానిక పోరాట సామర్థ్యాలను గణనీయంగా మార్చగలదు. అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ ఫైటర్ జెట్‌ను ఎంతో సన్నిహిత దేశాలకు కూడా అమెరికా ఇవ్వాలని అనుకోవడం లేదు. రష్యా నుంచి ఎస్-400 కొనుగోలు చేసిందని.. నాటో కూటమి దేశమైన తుర్కియేకు కూడా వీటిని విక్రయించబోమని గతంలోనే అమెరికా తేల్చి చెప్పింది. అలాంటిది ఎస్-400 వాడుతున్న భారత్‌కు వీటిని అమ్మాలని భావించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ ఆధునిక స్టెల్త్ ఫైటర్‌ను భారత్‌కు అందిస్తామని విలేకర్ల సమావేశంలో ట్రంప్ ప్రకటించారు.
F-35 ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధ విమానం
F-35 అనేది ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్, ఇది అద్భుతమైన వేగం, అధునాతన సాంకేతికతకు ప్రసిద్ధి చెందింది. ఈ విమానం అధునాతన ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్‌లు, ఓపెన్ ఆర్కిటెక్చర్, అధునాతన సెన్సార్లు, అసాధారణమైన పర్యవేక్షణ సామర్థ్యాలు దీనిలో ఉననాయి.
ఈ యుద్ధ విమానం ఎందుకు అంత ముఖ్యమైనది?
అమెరికాకు చెందిన ఈ ఫైటర్ జెట్ పూర్తి పేరు F-35 లైట్నింగ్ 2. ఇది అన్ని వాతావరణాలలో ఉపయోగించగల స్టెల్త్ మల్టీరోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్. ఇది ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, గూఢచర్యం, నిఘా వంటి కార్యకలాపాలను కూడా నిర్వహించగలదు. ఎఫ్-35ఎ ప్రాథమిక వేరియంట్. దీని ధర 80 మిలియన్ డాలర్లు (సుమారు రూ.695 కోట్లు). ఇది ఎఫ్-35బి రన్‌వే లేకపోయినా.. నిట్టనిలువునా గాల్లోకి ఎగరడంతో పాటు ల్యాండ్ కూడా అవుతుంది. దీని ధర 115 మిలియన్ డాలర్లు (సుమారు రూ.990 కోట్లు) ఉంటుంది. ఎఫ్-35సి దీనిని ప్రత్యేకంగా విమాన వాహక నౌకల కోసం డిజైన్ చేశారు. ధర 110 మిలియన్ డాలర్లు (రూ.955 కోట్లకుపైగా)ఉంటుంది. దీనిని అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ తయారు చేస్తుంది.
దీనిని ఒకే పైలట్ నడుపుతాడు. దీని పొడవు 51.4 అడుగులు, రెక్కల వెడల్పు 35 అడుగులు,ఎత్తు 14.4 అడుగులు. గరిష్ట వేగం గంటకు 1976 కి.మీ. దీని రేంజ్ 1239 కి.మీ. ఇది గరిష్టంగా 50 వేల అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. దీనికి 4 బ్యారెల్ 25 మిమీ రోటరీ ఫిరంగి అమర్చబడి ఉంటుంది. ఇది నిమిషంలో 180 బుల్లెట్లను పేల్చివేస్తుంది. దీనికి నాలుగు ఇంటర్నల్, ఆరు బాహ్య హార్డ్ పాయింట్‌లు ఉన్నాయి. ఎయిర్-టు-ఎయిర్, ఎయిర్-టు-సర్ఫేస్, ఎయిర్-టు-షిప్, యాంటీ-షిప్ క్షిపణులను మోహరించవచ్చు. ఇది కాకుండా, నాలుగు రకాల బాంబులను అమర్చవచ్చు.
ప్రపంచంలో F-35 కార్యక్రమాలు
ప్రస్తుతం 17 దేశాలు F-35 కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఇప్పటివరకు 1870 మందికి పైగా పైలట్లు, 13,500 మంది నిర్వహణ సిబ్బందికి శిక్షణ ఇవ్వబడింది. F-35 విమానాల సముదాయం 602,000 విమాన గంటలను దాటింది.
క్రాష్ అయ్యే ప్రమాదం
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన స్టెల్త్ ఫైటర్ జెట్ F-35 అనేకసార్లు కూలిపోయింది. ఒక విమానం కూలిపోయి ఉంటే అమెరికాకు దాదాపు రూ.832 కోట్ల నష్టం జరిగి ఉండేది. ఇది అమెరికా అత్యంత ఖరీదైన జెట్ ప్రోగ్రామ్ నుండి వచ్చిన విమానం. గత సంవత్సరం అమెరికా వైమానిక దళానికి చెందిన F-35 లైట్నింగ్-2 స్టెల్త్ ఫైటర్ జెట్ న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. గతంలో దక్షిణ కరోలినాలో ఇలాంటి యుద్ధ విమానం అదృశ్యమైంది. అది తరువాత ఒక ఇంటి వెనుక కూలిపోయినట్లు కనుగొన్నారు. దక్షిణ కరోలినాలోని జాయింట్ బేస్ చార్లెస్టన్ నుండి 96 కి.మీ దూరంలో ఉన్న విలియమ్స్‌బర్గ్ కౌంటీలో దాని శిథిలాలు కనుగొనబడ్డాయి.
డస్సాల్ట్ రాఫెల్ తో పోలిక
రాఫెల్, యూరోఫైటర్‌లను యుద్ధ విమానాలుగా అభివృద్ధి చేశారు. కానీ తరువాత ఫ్రాన్స్ రాఫెల్‌ను ప్రాజెక్ట్ నుండి తొలగించింది. భారత వైమానిక దళం వద్ద 36 రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. దీనిని ఒకరు లేదా ఇద్దరు పైలట్లు నడుపుతారు. ఇది 50.1 అడుగుల పొడవు, 35.9 అడుగుల రెక్కల విస్తీర్ణం, 17.6 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 1912 కి.మీ. ఇది గరిష్టంగా 51,952 అడుగుల ఎత్తుకు చేరుకోగలదు. ఇది సెకనులో 305 మీటర్లు నేరుగా ఎగురుతుంది. దీనికి 30 మి.మీ ఆటోకానన్ అమర్చబడి ఉంటుంది. ఇది నిమిషానికి 125 రౌండ్లు కాల్చగలదు. ఇది కాకుండా దీనికి 14 హార్డ్ పాయింట్స్ ఉన్నాయి. దీనిలో గాలి నుండి గాలికి, గాలి నుండి భూమికి, గాలి నుండి ఉపరితలానికి, అణు నిరోధక క్షిపణులను అమర్చవచ్చు. అనేక ఇతర రకాల బాంబులను కూడా మోహరించవచ్చు.