YS Sharmila: ఇటీవల పిసిసి అధ్యక్షురాలు షర్మిలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు బయటపడుతున్నాయి. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఈ తరహా పోస్టులు పెరిగాయి. పీసీసీ పగ్గాలు తీసుకున్నాక.. వైసిపి ప్రభుత్వంతో పాటు సీఎం జగన్ పై షర్మిల విరుచుకుపడుతున్నారు. వ్యక్తిగతంగా కూడా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అయితే అంతవరకు వైఎస్ కుటుంబాన్ని అభిమానించిన వారు చాలా బాధపడ్డారు. అయితే ఈ క్రమంలో ఆమెపై వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. అవి కాస్త వ్యక్తిగత పోస్టులు దాకా వచ్చాయి.
వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఆ మధ్యన ఇడుపులపాయలో షర్మిలను కలిసిన సంగతి తెలిసిందే. రాజకీయంగా షర్మిల వెంట అడుగులు వేస్తానని ప్రకటించారు. తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య విషయంలో చివరి వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దీంతో అక్కడి నుంచి షర్మిల, సునీతలను టార్గెట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. కొందరైతే శత్రు శేషం ఉండకూడదు .. వారిద్దరిని చంపే అన్న అంటూ పోస్టులు పెట్టారు. ఇవి పెను దుమారానికి దారితీసాయి. దీంతో సునీత తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. వర్ర రవీంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తి పోస్టులు పెడుతున్నారు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తెలంగాణలో పోలీసులు ఒకవైపు దర్యాప్తు చేస్తుండగా.. ఏపీ పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చారు. షర్మిలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అంటూ విశాఖకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ అరెస్టును టిడిపి నేత గండి బాబ్జి ఖండించారు. దీంతో ఇది తెలుగుదేశం పార్టీ పని అని వైసిపి నేతలు ఆరోపించడం ప్రారంభించారు. సదరు ఇద్దరు వ్యక్తులు తండ్రీ కొడుకులని.. చింతకాయల విజయ్ నేతృత్వంలో నడుస్తున్న ఐటీడీపీలో పని చేస్తున్నారని ఏపీ పోలీసులు ప్రకటించారు. దీంతో ఇది రాజకీయ దుమారానికి కారణమవుతోంది. ఆ ఇద్దరే వర్ర రవీంద్రనాథ్ రెడ్డి పేరిట పోస్టులు పెడుతున్నారని ఏపీ పోలీసులు చెబుతుండగా… హైదరాబాద్ కేంద్రంగా వైసీపీ నేతలే షర్మిలపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని టిడిపి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. దీంతో ఇది రాజకీయ దుమారం రేపుతోంది.