Chandrababu Jail: చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసునకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానంలో నేడు విచారణ కొనసాగనుంది. ఈనెల మూడున ఈ కేసు విచారణ వచ్చినప్పటికీ.. హైకోర్టులో సిఐడి దాఖలు చేసిన పత్రాలను కావాలని సుప్రీంకోర్టు కోరింది. ఈనెల తొమ్మిదికి విచారణను వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో నిన్న విచారణ ప్రారంభమైంది. ధర్మాసనం ఇరు వర్గాల వాదనను వినింది. ఈ నేపథ్యంలో జడ్జిలు లేవనెత్తిన అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కేసులో సెక్షన్ 17 ఏ వర్తించేలా కనిపిస్తోందని న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ వ్యాఖ్యానించినట్లు టిడిపి అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది.
చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే బలమైన వాదనలు వినిపించారు. అంతకుముందు ఏసీబీ, హైకోర్టులో 17 ఏ సెక్షన్ ను అనుసరించి చంద్రబాబు పై అక్రమ కేసులను కొట్టివేయాలని కోరినట్లు న్యాయమూర్తి ముందు చెప్పుకొచ్చారు. ఈ తరుణంలో జస్టిస్ బేలా ఎం త్రివేది జోక్యం చేసుకున్నారు. హైకోర్టులో మీ వాదనలు పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ డాక్యుమెంట్లు సమర్పించిందనుకుంటే.. ఒకవేళ దానిపై మీ వాదనలు వినిపించడానికి అక్కడ అవకాశం రాక.. దానికి వ్యతిరేకంగా కౌంటర్ దాఖలు చేయలేక పోయి ఉంటే.. మేము మెరిట్స్ లోకి వెళ్లకుండా వెనక్కు పంపించవచ్చా? అని ప్రశ్నించారు. అందుకు ఏపీ ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపించారు. రిమాండ్ రిపోర్టులోనే 2018 లోనే కేసు విచారణ ప్రారంభమైందని స్పష్టంగా పేర్కొన్నట్లు చెప్పుకొచ్చారు.
అయితే దీనిపై చంద్రబాబు తరపు లాయర్ హరీష్ సాల్వే గట్టిగానే తన వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లు ఈ కేసు ప్రాథమిక విచారణ 2021 లోనే ప్రారంభించినట్లు స్పష్టంగా ఉందని చెప్పారు. 2021 సెప్టెంబర్ 7న వచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఈ ప్రాథమిక విచారణ ప్రారంభించారని స్పష్టం చేశారు. ఆ ఫిర్యాదులో ఎక్కడా పిటిషనర్ చంద్రబాబు పేరు లేదన్నారు. ఒకవేళ 2018 జూన్ 5న విచారణ ప్రారంభమైందనుకుంటే కౌంటర్ అఫిడవిట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని స్పష్టం చేసి ఉండేదని చెప్పుకొచ్చారు. యశ్వంత్ సిన్హా కేసును సైతం ప్రస్తావించారు. గవర్నర్ అనుమతి లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పే అధికారం రాజ్యాంగ న్యాయస్థానాలకు ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలని కోరారు.
ప్రభుత్వ ఉద్యోగులు అధికార విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు మాత్రమే అవినీతి నిరోధక చట్టం వర్తిస్తుందని చంద్రబాబు కొరకు న్యాయవాది చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో జస్టిస్ అనిరుద్ధ బోస్ మరోసారి జోక్యం చేసుకున్నారు. మీ క్లైంట్ కేసులో వాస్తవాలను చూసినప్పుడు 17a వర్తిస్తునట్లు కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. జస్టిస్ బేలా త్రివేది సైతం జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో 90 శాతం వాటా తోలుత వచ్చిందా? లేదా? అని చూసుకోకుండా పది శాతం నిధులు మందులు చేశారన్నది ఆరోపణ కావచ్చని అభిప్రాయపడ్డారు. 17 ఏకీ భాష్యం చెప్పే సమయంలో అవినీతి విరోధక చట్టం ప్రధాన ఉద్దేశం దెబ్బతినకుండా చూడాల్సి ఉంటుంది కదా? అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జడ్జిల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. టిడిపి అనుకూల మీడియా అయితే ప్రత్యేక కథనాలను, వార్తలను రాసుకొచ్చింది. మరి నేటి విచారణలో ఏం తేలనుంది? తీర్పు ఎలా రానుందో చూడాలి మరి.