Huzurabad: మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజల కోసమే ప్రభుత్వం పని చేయాలి. ఇక్కడ ప్రజలే సుప్రీం. ప్రజలెక్కువగా ఎవరిని కోరకుంటారో వారే లీడర్ అవుతారు. ఆ పార్టీ అధికారం చేపడుతుంది. ప్రజలకు కోపం వస్తే ఎంతటి వారినైనా అధికారంలోకి దించుతుంది. ఇది అక్షర సత్యం. ప్రజల మద్దతుతో తిరుగులేకుండా ప్రభుత్వాన్ని నడిపిన ఇందిరా గాంధీకే ఓటమి తప్పలేదు. తెలుగు ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ కూడా ఓడిపోయారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అధిక సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత ఏడేళ్లుగా ప్రజలు దూరం పెడుతూ వస్తున్నారు. వీటిన్నంటిని చూస్తే మనకు ఏం అర్థం అవుతుంది. ప్రజలకు నచ్చితే నెత్తినెక్కించుకుంటారు. అదే వారిని ధిక్కరిస్తే అదఃపాతాలానికి తొక్కేస్తారు.
నాటి నుంచి నేటి దాక..
ప్రపంచ, దేశ చరిత్ర గమనిస్తే మహా మహా నాయకులు కూడా ప్రజల చేతిల్లో ఓడిపోయారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవించే వారు, ప్రజల కోసమే పని చేసే వారు మాత్రం ఎక్కువ కాలం మనగలిగారు. అధికారం ఉంది కదా అని ప్రజలను లెక్కచేయకుండా ఇష్టం వచ్చినట్టు చేసే వారిని ఎప్పుడూ ప్రజలు గుర్తుంచుకుంటారు. అసవరం వచ్చినప్పుడే దానిని వ్యక్తపరుస్తారు. అదేదో సినిమాలో చెప్పినట్టు ‘‘ప్రతీ ఒక్కరికీ ఓ టైం వస్తుంది. ఆ టైం వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేయాలి. నీ వంతు వచ్చే వరకు నువు ఓపికతో ఉండాలి’’ అనే డైలాగ్ ఇలాంటి వాటికి కరెక్టుగా వర్తిస్తుంది. ‘‘కాలమే అన్నింటికి సమాధానం చెబుతుంది’’ అని మన పెద్దలు తరుచూ చెప్తుంటారు. ఇది అక్షర సత్యం. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలకు ఈ మాటలు సరిగ్గా సెట్ అవుతాయి..
ఈటెల విషయంలోనూ అదే జరిగిందా ?
తెలంగాణ వచ్చినప్పటి నుంచి తిరుగులేని నాయకుడు కేసీఆర్. అంత వరకు ఉద్యమంలో ఉండి అందరి మన్ననలు పొందారు. అందుకే ప్రజలు ఆయనను నమ్మారు. భారీ మెజారిటీతో అధికారం కట్టబెట్టారు. గత ఏడేళ్లుగా నిర్విరామంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. అయితే ఇటీవల ఆయన ఎవరినీ లెక్కచేయకుండా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను నిరాశపరుస్తున్నాయి. రాజకీయ స్వార్థం కోసం అధికారాన్ని ఉపయోగించుకోవడం ప్రజలను బాధపెడుతోంది. ముఖ్య నాయకులు చేసే ప్రతీ పనిని ప్రజలు గమనిస్తూ ఉంటారు. కానీ సమయం వచ్చినప్పుడే దానిని వెల్లడిస్తారు. అందుకే ఇటీవల వచ్చిన సీ ఓటర్ సర్వేలోనూ సీఎం కేసీఆర్‌కు ప్రజల మద్దతు తగ్గిపోతోందని వెల్లడైంది. ఈటల రాజేందర్ విషయంలో ఆయన ప్రవర్తించిన తీరు రాష్ట్ర ప్రజలందరినీ ఆలోచించేలా చేసింది.
కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎంతో నేర్పుతో పని చేస్తున్న ఈటెల రాజేందర్ పై అధినేత తీసుకున్న చర్యలు ప్రజలు గమనించారు. ఒక్క సారిగా టీఆర్ఎస్‌కు సపోర్ట్ చేసే అన్ని మీడియా సంస్థలు ఈటెలకు వ్యతిరేకంగా కథనాలు ప్రచురించండం, ప్రసారం చేయడం వంటి చర్యలన్నీ తెలంగాణ సమాజం మొత్తం చూసింది. ఎంతో మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చినా స్పందిచని సీఎం.. ఒక్క ఈటెల విషయంలో వెనువెంటనే తీసుకున్న చర్యలన్నీ చూశారు. దీంతో సీఎం నియంతృత్వ విధానానికి బుద్ది చెప్పాలనుకున్నారు. అందుకే ఈటెలను భారీ విజయంతో గెలిపించారు. ఇది ఒక్క హుజూరాబాద్ ప్రజల అభిప్రాయమే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వచ్చిన భావన. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని వ్యతిరేకించే చాలా మంది మేధావులు, ప్రజలు హుజూరాబాద్‌లో మాత్రం బీజేపీ గెలవాలని, ఈటల విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ పరాజయంతో కేసీఆర్ దురంహంకారానికి చెక్ పెట్టాలని భావించారు. ఈ ఓటమితో సీఎం తీరులో మార్పు రావాలని కోరుకున్నారు. ఇకనైనా సీఎం, మంత్రులు స్పందించే తీరులో మార్పు రావాలని కోరుకుంటున్నారు. లేకపోతే టీఆర్ఎస్ భవితవ్యం కష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: BJP In Telangana : తెలంగాణలో బీజేపీ అతివిశ్వాసం కొంప ముంచుతుందా?