Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాగ్బానాలు వేడిపుట్టిస్తున్నాయి. బీజేపీ విజయవాడలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు చీప్ లిక్కర్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేసి విమర్శలకు దిగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెబుతున్నారు. బీజేపీ దిగజారి పోయిందని మద్యం ఎరగా చూపి ఓట్లు దండుకోవాలని చూస్తోందని విమర్శలు వస్తున్నాయి. దీనిపై వీర్రాజు స్పందించారు. తాను పేదవాడి కోసం మాట్లాడానని వివరణ ఇచ్చారు. పేదవాడి రక్తం తాగే ప్రభుత్వంపై చేసిన విమర్శల్లో భాగంగానే చీప్ లిక్కర్ గురించి మాట్లాడానని తెలిపారు.

వైసీపీ నేతలు మాత్రం సోము వీర్రాజు కాదు ఆయన సారాయి వీర్రాజు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. రూ. 50 లకే లిక్కర్ అమ్మితే కుటుంబానికి రూ. 2 లక్షల ఆదాయం మిగులుతుందని వీర్రాజు చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో వీర్రాజు పై విమర్శలు చేసిన వారిపై సెటైర్లు వేశారు. వైసీపీ నేతలకు ఏది మంచిదో ఏది చెడో తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీర్రాజు కూడా అంతే స్థాయిలో స్పందించారు. పేదవాడి కోసం ఎంతకైనా తెగిస్తామని చెప్పుకొచ్చారు.
Also Read: ఓడిపోతే సినిమాలే దిక్కు.. రోజా గారు ఆలోచించండి !
మరోవైపు తనపై సెటైర్లు వేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ తన తండ్రి తెల్లవారుజాము మూడు గంటల వరకు ఏం చేస్తారో తెలియదా అని ప్రశ్నించారు. ఏపీ రాజకీయాలపై మాట్లాడే బదులు తన రాజకీయాలు చూసుకోవాలని హితవు పలికారు. రాష్ర్టంలో మద్యం పేరుతో నిలువు దోపిడీ చేస్తుంటే తాను పై విధంగా మాట్లాడితే అందరికి ఎందుకు కాలుతుందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.
పేదవాడి కోసం పాటుపడే బీజేపీ ప్రభుత్వం వారి కోసమే మద్యం పాలసీ తీసుకొచ్చేలా చట్టం తీసుకొస్తుంది. ఇందుకోసం బీజేపీ మేనిఫెస్టోలో కూడా చేర్చనున్నారు. అందుకే పేదవాడికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే చీప్ లిక్కర్ పై మాట్లాడటం జరిగింది. ఇందులో పేదవాడి అభ్యున్నతి తప్ప ఏ రాజకీయ దురుద్దేశం లేదని తెలుస్తోంది. మొత్తానికి ఏపీలో కూడా బీజేపీ తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాలు ఖరారు చేస్తోందని తెలుస్తోంది.