Ibrahimpatnam Incident: చిన్నపాటి గాయమైతేనే కుట్లు వేసేందుకు గంట పడుతుంది. కానీ ఆ గంటలోనే 34 మందికి, అది కూడా మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. పశువులను కోసినట్టు కోశారు. కనీసం ఎక్కడా పరిశుభ్రత పాటించలేదు. ఫలితంగా నలుగురు మహిళలు అందునా 30 ఏళ్లలోపు ఉన్నవారు కన్నుమూశారు. మిగతా వారు ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. శస్త్ర చికిత్సలకు వాడిన పరికరాలను స్టెరిలైజ్ చేయలేదు. ఫలితంగా మహిళలకు స్టెఫీలో కాకస్ బ్యాక్టీరియా సోకింది. ఈ ప్రభావం వల్లే మహిళలు కనుమూశారు. మహిళలకు సర్జరీ చేసిన వైద్యుడు, స్టాఫ్ నర్స్ నిర్లక్ష్యం మూలంగానే ఇదంతా జరిగింది. గత నెల 27 తారీఖున ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 34 మంది ఆపరేషన్లు చేయించుకున్నారు. వీరిలో నలుగురు స్టెఫీలో కాకస్ బ్యాక్టీరియా బారినబడి కన్నుమూశారు. మిగతా వారికి లాప్రోస్కోపిక్ హోల్, రింగ్స్ చుట్టూ చీమ చేరింది. ఇక వారందరూ ప్రస్తుతం అపోలో, నిమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధిత మహిళల్లో ఇద్దరు మాత్రమే కోలుకుకున్నారు.

విచారణలో విస్తుపోయే వాస్తవాలు
ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు శుక్రవారం ఇబ్రహీంపట్నం ప్రాథమిక ఆసుపత్రిని పరిశీలించినప్పుడు విస్తు పోయే వాస్తవాలు కళ్ళకు కట్టాయి. ఎక్కడా కనీస సౌకర్యాలు లేవు. పైగా కుటుంబ నియంత్రణ శిబిరం నిర్వహించినప్పుడు సరైన సిబ్బంది కూడా లేరు. గంటలోనే 34 ఆపరేషన్లు చేశారంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న వారంతా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారే. ఆపరేషన్ చేయించుకున్న రోజు సరైన పడకలు కూడా లేకపోవడంతో మహిళలందరినీ కిందనే పడుకోబెట్టారు. కొందరు అక్కడి పరిస్థితులు తట్టుకోలేక ఇళ్లకు వెళ్లిపోయారు. శస్త్ర చికిత్స చేస్తున్నప్పుడు వైద్య పరికరాలను స్టెరిలైజ్ చేయకపోవడం వల్లే ఇన్ఫెక్షన్ సోకింది. మృతి చెందిన మహిళలు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళల కడుపు చుట్టూ చీము చేరింది. కొందరైతే అంతర్గత రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్నారు.
Also Read: Nirmala Sitharaman : ఇదేందయ్యా ఇదీ! మోడీ ఫొటో కోసం నిర్మల.. కేసీఆర్ ఫొటో కోసం హరీష్..
చెప్పేవన్ని డొల్ల మాటలేనా
ప్రభుత్వ వైద్యరంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టామని కేసీఆర్ నుంచి హరీష్ దాకా పదేపదే చెప్తుంటారు. కానీ హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవంటే ప్రజారోగ్యం పై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. ఇబ్రహీంపట్నం ఘటనలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి ఇన్ఫెక్షన్లకు గురైన మహిళలను ప్రవేట్ ఆసుపత్రులకు తరలించారంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు లేమిని ఇట్టే తెలుసుకోవచ్చు. బాధిత మహిళలు ఎక్కడా కూడా నోరు విప్పకుండా ఉండేందుకు ప్రభుత్వం వారి సహాయకులకు అప్పటికప్పుడు పదివేల రూపాయలు ఇచ్చేసింది. ప్రస్తుతం మహిళలు చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి, నిమ్స్ లోకి మీడియాను అనుమతించడం లేదు.

దీనికి తోడు ఇబ్రహీంపట్నం ప్రాథమిక ఆసుపత్రిని సిబ్బంది కొరత వెంటాడుతోంది. కరోనా సమయంలో ఇక్కడ పని చేసిన కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు ఇవ్వకపోవడంతో వారు ఆందోళనలు చేశారు. కొంతమంది ఉద్యోగాలు కూడా మానేశారు. సిబ్బంది లేమి, మహిళలు భారీగా రావడంతో ఆరోజు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వేగంగా చేయాల్సి వచ్చిందని సంబంధిత వైద్య సిబ్బంది అంటున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే దాకా కేంద్ర ప్రభుత్వంపై రుసరసలాడే కెసిఆర్ ఇబ్రహీంపట్నం ఘటనపై ఇంతవరకు నోరెత్తలేదు. పైగా జాతీయ రాజకీయాలకు వెళ్లాలనే ఆలోచనతో బీహార్ లో పర్యటించారు. గాల్వాన్ లోయలో అమరులైన బీహార్ సైనికులకు చెక్కులు ఇచ్చారు. హైదరాబాదులో జరిగిన అగ్ని ప్రమాదంలో కన్నుమూసిన బీహార్ కార్మికులకు పరిహారం ఇచ్చారు. కానీ ఆయనకు ఓట్లు వేసి ముఖ్యమంత్రి చేసిన తెలంగాణ ప్రజలను పూర్తిగా విస్మరించారు. కెసిఆర్ పరిభాషలో చెప్పాలంటే దేశం కోరుకుంటున్న గుణాత్మక మార్పు అంటే ఇదేనేమో!?
Also Read:Early Polls-Media: మీడియాకు ‘ముందస్తు’ జ్వరం.. తెలంగాణలో క్వశ్చన్ మార్క్ జర్నలిజం
[…] Also Read: Ibrahimpatnam Incident: మహిళలంటే లెక్కలేదు. శుభ్రం చ… […]