KCR- Ibrahimpatnam Incident: రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడని చరిత్రలో చదువుకున్నాం. ఇబ్రహీంపట్నం ఘటనలో నలుగురు మహిళలు కన్నుమూస్తే కనీస ఓదార్పు లేని పాలనను ప్రస్తుతం చూస్తున్నాం. ” తెలంగాణ ప్రజల కాలికి ముల్లు గుచ్చితే పంటితో తీస్తా. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణను ఆగం కానివ్వను” తెలంగాణ సమాజం సాక్షిగా పలు వేదికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. జనాలకు అండగా ఉంటానని, సాధక బాధకాల్లో తోడుగా నిలుస్తానని మాటిచ్చారాయన! తెలంగాణ ప్రజలు కూడా ముఖ్యమంత్రి నుంచి ఆశించింది అదే. అందుకే రెండుసార్లు అధికారాన్ని కట్టబెట్టారు. కానీ పలు సందర్భాల్లో కెసిఆర్ వ్యవహరించిన తీరు ఇందుకు పూర్తి విరుద్ధం. జనం బాధలు ఆయన హృదయాన్ని చలింప చేయవా? రోదనలన్నీ ఆయన కంట తడిని తట్టి లేపవా? ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ విషాద ఘటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ చుట్టూ ఎన్నో రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంతటి విషాద ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యవస్థగా స్పందించిందే తప్ప.. మేమున్నామంటూ, మీకేం కాదంటూ ఇబ్రహీంపట్నం ఆసుపత్రి లేదా బాధితుల స్వస్థలాలకు ప్రభుత్వ పెద్దలు ఎవరూ వెళ్ళలేదు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పెద్ద దీనిని ఒక సీరియస్ అంశంగా పరిగణించలేదు. వాస్తవానికి బండి సంజయ్, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను కొట్టి పారేయడానికి లేదు. పరీక్షలు నిర్వహించకుండా, ఆరోగ్య పరిస్థితి తెలుసుకోకుండా గదిలో కింద పడుకోబెట్టి ఆపరేషన్లు చేసింది దాచేస్తే దాగే సత్యమా? అమాయకులైన నలుగురు మహిళలు చనిపోవడం అంత తేలికైన విషయమా? దేశంలో మీడియాతో ఎక్కువసేపు మాట్లాడగలిగే ముఖ్యమంత్రుల్లో కెసిఆర్ ఒకరు. వరుస ప్రెస్మీట్లు పెట్టి ఎన్నో విషయాలపై అలవోకగా మాట్లాడే కెసిఆర్.. ఇబ్రహీంపట్నం ఘటనపై స్పందించకపోవడం బాధాకరం.

అందరూ పేదింటి మహిళలే
ఇబ్రహీంపట్నం ఘటనలో కన్ను మూసిన వారంతా కూడా పేదింటి మహిళలే. తల్లులను కోల్పోయి పిల్లలు కన్నీళ్లు రాలుస్తున్నా స్పందించేందుకు కేసిఆర్ కు మనసు రావడంలేదని ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. ” పొరుగు రాష్ట్రాల్లో తన రాజకీయ ప్రాబల్యం కోసం పాకులాడుతున్నారు. తెలంగాణ ప్రజలు చెల్లించిన సొమ్ముతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాపత్రయపడుతున్నారు. ఇబ్రహీంపట్నం బాధితులను పరామర్శించకుండా, బీహార్ వెల్లి గాల్వాన్ లోయ అమరుల కుటుంబాలకు చెక్కులు ఇవ్వడం ఏంటనే” ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గాల్వాన్ అమర వీరుల కుటుంబాలకి ఆర్థిక సాయం చేయడాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. అయితే రాష్ట్రంలో జరిగిన ఘటనపై సమీక్ష నిర్వహించే ఆసక్తి కూడా సీఎం కేసీఆర్ కు లేకపోవడం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం. వాస్తవానికి ఇబ్రహీంపట్నం ఘటనలో ఎక్స్ గ్రేషియా ప్రకటన, తాత్కాలికంగా ఆపరేషన్ల నిలిపివేత, డాక్టర్ల లైసెన్స్ రద్దు వంటి చర్యలను ప్రభుత్వం తీసుకుంది. కొంతమంది బాధిత మహిళలను నిమ్స్, అపోలోకు తరలించింది. వారందరినీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. అయితే ఇంతటి దారుణం జరిగినప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా స్పందిస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతున్నది.
కెసిఆర్ కు ఇది మొదటిసారి కాదు
ఇలాంటి విమర్శనాత్మక వైఖరిని అవలంబించడం సీఎం కేసీఆర్ కు కొత్త కాదు. బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేసినప్పుడు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వారి డిమాండ్లను సిల్లిగా అభివర్ణించారు. పలుమార్లు విద్యార్థులు రోడ్డెక్కారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్ ని ఏమాత్రం స్పందించలేదు. సాక్షాత్తు గవర్నర్ తమిళసై సౌందర రాజన్ బాసర విద్యార్థులను పరామర్శించారు. మరి ఆ బాధ్యత సీఎం కేసీఆర్ కు లేదా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

2018 సెప్టెంబర్ 11న కొండగట్టు బస్సు ప్రమాదం జరిగినప్పుడు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ సీఎం కేసీఆర్ అటు వైపు తొంగి కూడా చూడలేదు. ఇలా చెప్పుకుంటూ పోవాలే గానీ.. కెసిఆర్ చూడని, పట్టించుకోని తెలంగాణ ప్రజల బాధలు ఎన్నో. పాలకుడికి, ప్రజలకు దూరం మొదలయినప్పటి నుంచే రాజ్య విస్తరణ కాంక్ష మొగ్గలు తొడుగుతుంది. ప్రస్తుతం కెసిఆర్ కూడా ఇదే దశలో ఉన్నారు. రాష్ట్ర ప్రజలను పట్టించుకోకుండా, తెలంగాణ వాసులు చెల్లించిన పన్నులతో దేశంలో గుణాత్మక మార్పు కోసం కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. ఇక్కడ జనం మాత్రం అయ్యో దేవుడా అంటూ వినిపిస్తున్నారు.
Also Read:Early Polls-Media: మీడియాకు ‘ముందస్తు’ జ్వరం.. తెలంగాణలో క్వశ్చన్ మార్క్ జర్నలిజం
[…] […]
[…] […]