
కరోనా వ్యాప్తి రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో సాధారణ రోగులు ఆసుపత్రులకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇతర రోగాల పరిష్కానికి వచ్చి లేని వైరస్ అంటించుకోవాల్సి వస్తుందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో రాష్ట్రంలోని టీచింగ్, జిల్లా ఆసుపత్రులకు ఓపి సంఖ్య చాలావరకు తగ్గింది. కేవలం అత్యవసరం ఉన్నవారు మాత్రమే ఆసుపత్రులను సందర్శిస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 85 శాతం ఈ పరిధిలోనే నమోదు కావడంతో అధికారులతో సైతం ప్రజలకు కూడా మనోధైర్యాన్ని కొల్పోతున్నారు. దాదాపు సిటీలో ఉన్న ఆసుపత్రులన్నీ హాట్ స్పాట్లుగా మారిపోయాయి. ఇప్పటికే కరోనా కట్టడిలో కీలకమైన డాక్టర్లు, జర్నలిస్టులు, పారిశుధ్య కార్మికులు, పోలీసులూ వైరస్ భారిన పడ్డారు.
ముఖ్యంగా ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్, ప్లేట్లబురుజు, నిమ్స్ ఆసుపత్రుల్లో సుమారు 89 మందికి పైగా వైరస్ బారిన పడగా, జర్నలిస్టుల్లోనూ ఇప్పటి వరకు 15 మందికి పైగా వైరస్ సోకినట్లు సమాచారం. దీంతో పాటు పోలీసులుల్లోనూ 30 మంది వరకు వైరస్ బారిన పడగా, శానిటేషన్ సిబ్బందిలో దాదాపు 12 మంది వరకు వైరస్ బారిన పడ్డారు. దీంతో పాటు కార్పొరేట్, ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ నర్సులకు కోవిడ్ సోకింది. ఆయా ఆసుపత్రుల్లో జలుబు, దగ్గు, లాంటి లక్షణాలు ఉన్న వారిని పరీక్షించడం వలనే వైరస్ కు సోకినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే ప్రభు త్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిత్యం శానిటేషన్‌ను పకడ్భందీగా చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జ్వరం, ఇతర సమస్యల వారికి ఖచ్చితంగా వేర్వేరు ఓపిలు విధానం ప్రతి ఆసుపత్రిలో ఉండాలని, లేని యెడల కఠిన చర్య లు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. అదే విధంగా పిహెచ్‌సిలులోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని ఇప్పటికే మంత్రి జిల్లా వైద్యాధికారులకు సూచించారు.